Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్

Aliens Exist

Aliens Exist

Explained: ఒక చిన్న ప్రశ్న.. మీరు ఉదయం నిద్రలేచేసరికి ప్రపంచం మొత్తం 100 సంవత్సరాలు ముందుకు వెళ్లిపోయిందని తెలిస్తే? మీ కుటుంబం లేదు. మీ స్నేహితులు లేరు. మీకు తెలిసిన నగరాలు కూడా మారిపోయాయి. కానీ మీ వయసు మాత్రం ఒక్క సంవత్సరం కూడా పెరగలేదు. వింతగా అనిపిస్తుందా? ఇదంతా ఎందుకు చెబుతున్నానని డౌట్ వస్తుందా? ఒకవేళ ఏలియన్స్ నిజంగా భూమికి వస్తే, వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందట.

అసలు ఈ కారణంతోనే వాళ్లు మన దగ్గరకు రావడం లేదేమో అని సైంటిస్టులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చాలామంది.. ఏలియన్స్ గురించి ఆలోచించినప్పుడు వాళ్ల స్పేస్‌షిప్‌లు, UFOలు, రహస్య ప్రభుత్వ ఫైళ్ల గురించి మాట్లాడతారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నారు. ఏలియన్స్ నిజంగానే ఉంటే ఇప్పటి వరకు భూమిపైకి అవి ఎందుకు రాలేదని ఒక ప్రశ్న వేసుకోమని చెబుతున్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా మనం విశ్వం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి.

×
×
Ad

సినిమాలు మనకు చెప్పిన దానికంటే విశ్వం చాలా పెద్దది. అవును.. చాలా… చాలా పెద్దదండి. మన సూర్యుడికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటౌరీ. ఖగోళ శాస్త్ర పరంగా అది మన పొరుగింటిలాంటిది. కానీ ఆ పొరుగింటి దూరం ఎంత తెలుసా? 40 ట్రిలియన్ కిలోమీటర్లు. అంటే 40 తర్వాత 12 సున్నాలు. ఇంత దూరాన్ని ఊహించడం కూడా కష్టం.

టైమ్ డిలేషన్ అంటే ఏంటి?

మనిషి ఇప్పటివరకు తయారుచేసిన అత్యంత వేగవంతమైన అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్. అది సెకనుకు 191 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. మనకు అది అదిరిపోయే వేగంలా అనిపిస్తుంది. ఆ స్పీడ్‌తో ప్రాక్సిమా సెంటౌరీ చేరుకోవడానికి 6,650 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి. మనిషి చరిత్రలో తెలిసిన చాలా నాగరికతలు పుట్టి… ఎదిగి… అంతరించిపోవడానికి సరిపడే సమయం. అది కూడా కేవలం దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం కోసం. ఇక్కడే ఏలియన్స్ ఎదుర్కొనే మొదటి సమస్య మొదలవుతుంది. అదే దూరం. ఒకవేళ ఏలియన్స్ చాలా అడ్వాన్‌సెడ్‌ టెక్నాలజీతో కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తే? అప్పుడు ఇంకో విచిత్రమైన సమస్య ఎదురవుతుంది. దాన్ని ఐన్‌స్టీన్ ముందే ఊహించాడు. సమయం అందరికీ ఒకేలా కదలదు. మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తే… మీకు సమయం అంత నెమ్మదిగా కదులుతుంది. దీన్ని టైమ్ డిలేషన్ అంటారు.

ఇలా ఒక ఏలియన్ కుటుంబాన్ని ఊహించండి. ఏలియన్స్ తమ గ్రహం నుంచి భూమిని చూడటానికి బయలుదేరారు. వాళ్లకు ఆ ప్రయాణం కొన్ని సంవత్సరాల్లా అనిపించవచ్చు. కానీ తిరిగి ఇంటికి చేరేసరికి…వాళ్ల ప్రపంచంలో వందల సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు. వాళ్ల పిల్లలు ఉండరు. వాళ్ల స్నేహితులు ఉండరు. వాళ్లు వదిలి వచ్చిన నాగరికత కూడా ఉండకపోవచ్చు. వాళ్లు తమ సొంత ప్రపంచంలోనే పరాయివాళ్లుగా మారిపోతారు. కానీ ఇది కూడా అతిపెద్ద సమస్య కాదు. అసలు సమస్య శక్తి..! అవును.. పవర్..!

కాంతి వేగానికి దగ్గరవుతున్న కొద్దీ స్పేస్‌షిప్‌ను ఇంకా వేగంగా నడపడానికి కావాల్సిన శక్తి భయంకరంగా పెరుగుతుంది. కాంతి వేగాన్ని చేరుకోవాలంటే అనంతమైన శక్తి కావాలని భౌతికశాస్త్రం చెబుతోంది. అది అసాధ్యం. ఒకవేళ ఈ సమస్యను కూడా పరిష్కరించారనుకుందాం. అప్పుడు అంతరిక్షమే వాళ్లకు శత్రువుగా మారుతుంది. మనకు ఖాళీగా కనిపించే స్పేస్‌లో కూడా చిన్న చిన్న కణాలు ఉంటాయి. సాధారణ వేగాల్లో అవి ప్రమాదకరం కావు. కానీ కాంతి వేగానికి దగ్గరగా ప్రయాణిస్తున్న స్పేస్‌షిప్‌కు అవే బుల్లెట్లలా మారిపోతాయి. హైడ్రోజన్ అణువులు కూడా ప్రాణాంతక రేడియేషన్‌గా మారి నౌకను ధ్వంసం చేసేంత శక్తిని సృష్టించగలవు. ఇంత కష్టపడి… ఇంత శక్తిని ఖర్చు చేసి… ఇంత ప్రమాదం ఎదుర్కొని… భూమికి ఎందుకు రావాలి? మీరే ఆలోచించండి.

ఏలియన్స్ ఉన్నాయా? లేవా?

భూమి మనకు స్వర్గంలనే అనిపిస్తుంది. 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులు మన వాతావరణంలో ఆక్సిజన్‌ను నింపకపోయి ఉంటే మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు.

అయితే మనకు ప్రాణం ఇచ్చే ఆక్సిజన్… ఏలియన్స్‌కు విషం కావచ్చు. మనకు సహజమైన వాతావరణం… వాళ్లకు ప్రమాదకరం కావొచ్చు. అంటే భూమి చేరుకోవడం మాత్రమే కాదు… భూమిపై బతకడం కూడా ఏలియన్స్‌కు సవాలే. అయితే నిజంగా ఏలియన్స్ లేరా అంటే.. నిజానికి వాళ్లు ఉండే అవకాశమే ఎక్కువ. ఇప్పటివరకు 6,200 కంటే ఎక్కువ ఎక్సోప్లానెట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

మన గెలాక్సీలోనే 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రం చుట్టూ కనీసం ఒక గ్రహం ఉన్నా… గ్రహాల సంఖ్య ఊహకు అందదు. అందుకే SETI లాంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా విశ్వం వైపు చెవులు పెట్టి వింటున్నాయి. ఎక్కడైనా మరో నాగరికత నుంచి ఒక సంకేతం వస్తుందేమో అని. ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం రాలేదు. నిజానికి 13.8 బిలియన్ సంవత్సరాల వయసున్న విశ్వంలో మనం కేవలం వందేళ్లుగా మాత్రమే వెతుకుతున్నాం. అది ఒక మహాసముద్రంలో ఒక్క చుక్క నీళ్లు తీసి చేపలు లేవని చెప్పినట్టే. దీనిబట్టి చూస్తే మనం ఒంటరిగా ఉండకపోవచ్చు..అయితే ఒకరినొకరు చేరుకోలేనంత దూరంగా బతుకుతూ ఉండొచ్చు. అందుకే ఏలియన్స్‌ మనకి కనిపించకపోవచ్చు..!