నిద్రపోయే ముందు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తి, ఉదయం నిద్రలేవగానే మాట తడబడుతూ కనిపించవచ్చు. చేతులు కదలకపోవచ్చు. చూపు మసకబారవచ్చు. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన నిద్రలోనే మెదడులో రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి ఉండవచ్చు. మనిషికి తెలియకుండానే మొదలైన ఈ ప్రమాదం, నిద్ర ముగిసిన తర్వాత బయటపడవచ్చు.
మెదడులోని ఒక భాగానికి రక్తం చేరడం ఆగిపోయినప్పుడు, అక్కడి కణాలకు అవసరమైన ఆక్సిజన్ అందదు. కొన్నిసార్లు రక్తనాళంలో రక్తం గడ్డకట్టి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. మరికొన్నిసార్లు రక్తనాళం పగిలి మెదడులో రక్తస్రావం జరుగుతుంది.
ఈ రెండు పరిస్థితులూ ప్రాణాలకు ముప్పు కలిగించే స్ట్రోక్‌కు దారితీయవచ్చు. నిద్రలో సంభవించినప్పుడు, దాని తొలి సంకేతాలు బయటపడటానికి కొన్ని గంటలు పట్టవచ్చు. అందుకే ఉదయం నిద్రలేవగానే స్ట్రోక్ లక్షణాలు కనిపించే పరిస్థితిని వేక్ అప్ స్ట్రోక్ అంటారు. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం, స్ట్రోక్ ఎప్పుడు మొదలైందనే దానికంటే, ఆ వ్యక్తి చివరిసారిగా ఎప్పుడు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారనేది. సాధారణంగా నిద్రపోయే ముందు ఉన్న పరిస్థితిని వైద్యులు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేకమైన మెదడు స్కానింగ్ పరీక్షలు, వైద్య పరిశీలన ఆధారంగా చికిత్సకు అవకాశం ఉందో లేదో నిర్ణయిస్తారు. లక్షణాలు మొదలైన సమయం తెలియకపోయినా, కొన్ని సందర్భాల్లో చికిత్స సాధ్యమవుతుంది.
అయితే, శరీరం ఇచ్చే హెచ్చరికలను గుర్తించడం అత్యంత ముఖ్యం. నిద్రలేవగానే ముఖం ఒకవైపు వాలిపోవడం, ఒక చేయి బలహీనంగా మారడం, మాట స్పష్టంగా రాకపోవడం, అకస్మాత్తుగా చూపు తగ్గడం, నడవలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు.
తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు, అకస్మాత్తుగా గందరగోళానికి గురికావడం కూడా ప్రమాద సంకేతాలు కావచ్చు. కొన్నిసార్లు ఈ లక్షణాలు కొద్దిసేపటికే తగ్గిపోతాయి. దీంతో ప్రమాదం తొలగిపోయిందని భావించే అవకాశం ఉంది. కానీ, లక్షణాలు తగ్గిపోయినంత మాత్రాన మెదడుకు ముప్పు తప్పినట్లు భావించకూడదు. తాత్కాలికంగా కనిపించి మాయమయ్యే స్ట్రోక్ లక్షణాలు కూడా తీవ్రమైన హెచ్చరికగానే పరిగణించాలి. వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. లక్షణాలు వాటంతట అవే తగ్గుతాయని ఎదురుచూడటం, చికిత్సకు లభించే అవకాశాలను తగ్గించవచ్చు. ఈ ప్రమాదానికి దారితీసే కారణాల్లో అధిక రక్తపోటు ప్రధానమైనది. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం కూడా స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. గుండె స్పందనలు క్రమం తప్పకుండా ఉండే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్య వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది.
నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోయే స్లీప్ అప్నియా సమస్య కూడా గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఉదయం సమయానికి రక్తపోటులో సహజమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇప్పటికే ఇతర ప్రమాద కారకాలు ఉన్నవారిలో ఈ పరిస్థితులు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. స్ట్రోక్ వచ్చిన ప్రతి ఒక్కరికీ పక్షవాతం వస్తుందనే భావన కూడా సరైనది కాదు.
కొందరిలో మాట, చూపు, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం లేదా శరీర సమతుల్యత దెబ్బతినవచ్చు. అలాగే, ఇది వృద్ధులకు మాత్రమే వచ్చే సమస్య కూడా కాదు. ఏ వయసులోనైనా స్ట్రోక్ సంభవించే అవకాశం ఉంది. ఇక చికిత్సలో భాగంగా, అర్హులైన రోగులకు రక్తం గడ్డను కరిగించే మందులు ఇవ్వవచ్చు. మరికొందరిలో ప్రత్యేకమైన పరికరాన్ని రక్తనాళంలోకి పంపించి గడ్డను తొలగించే మెకానికల్ థ్రాంబెక్టమీ చికిత్స అందిస్తారు. నిద్రలో స్ట్రోక్ వచ్చిన కొందరికి కూడా ప్రత్యేక స్కానింగ్ పరీక్షల ఆధారంగా ఈ చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. అనంతరం ఫిజియోథెరపీ, మాటకు సంబంధించిన చికిత్సలు, రోజువారీ పనులను తిరిగి చేసుకునేందుకు అవసరమైన పునరావాసం ద్వారా కోలుకునే ప్రయత్నం కొనసాగుతుంది.
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గట్టిగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిజానికి నిద్ర మనిషికి విశ్రాంతినిస్తుంది కానీ, ఆ నిశ్శబ్దంలోనే ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులు మొదలవ్వచ్చు.
ఉదయం నిద్రలేవగానే శరీరం ఇచ్చే సంకేతాలను గుర్తించడం, వాటిని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే, స్ట్రోక్ విషయంలో సమయానికి అందే చికిత్స మెదడును కాపాడటంతో పాటు, ఒక మనిషి తన జీవితాన్ని తిరిగి మామూలుగా కొనసాగించే అవకాశాన్ని కూడా పెంచుతుంది.

