ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఇప్పుడు ముక్కలవబోతోందా? బ్రిటన్ పాలనపై ఇతర దేశాల ప్రజల్లో తిరుగుబాటు ధోరణి మొదలైందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నాయకులు బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు తమకు ఉందంటూ సంచలన తీర్మానం చేశారు. అసలు బ్రిటన్ లో ఏం జరుగుతోంది? అక్కడి రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి? యునైటెడ్ కింగ్‌డమ్… ఏ దేశానికి ఆ దేశంగా ముక్కలవుతుందా…?
గ్రేట్ బ్రిటన్ చరిత్రలో ఒక కీలక మలుపు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ ఇప్పుడు విడిపోయే దిశగా అడుగులు వేస్తోందన్న చర్చ మొదలైంది. కార్డిఫ్ లోని సెయింట్ డేవిడ్స్ హోటల్ లో స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నేతలు ఒక అరుదైన సమావేశం నిర్వహించారు. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి విడిపోవాలన్న ఆలోచనకు వీళ్లంతా బీజం వేశారు. ది యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తన్ ఐర్లాండ్ నే మనం యూకేగా పిలుస్తాం. అంటే యూకే అన్నది కొన్ని దేశాల సమాహారం. అయితే ఇంగ్లండ్ తో కలిసి ఉండే విషయంలో ఈ మధ్య మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత క్రమంగా బలపడుతోంది. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నుంచి అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఈ మూడు దేశాల్లోనూ తాము స్వతంత్రంగా ఉండాలని కోరుకునే రాజకీయ పార్టీల వాయిస్ ఎక్కువగా వినిపిస్తోంది.
తాజా సమావేశంలో నాయకులంతా ఏకగ్రీవంగా ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ దేశాల భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు తమ ప్రజలకే ఉందని వారు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య నిర్ణయాలను అడ్డుకునే అధికారం వెస్ట్‌మిన్‌స్టర్ ప్రభుత్వానికి లేదని వారు కుండబద్దలు కొట్టారు. స్కాట్లాండ్ 2014లో స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ… ఇప్పుడు మరోసారి రెఫరెండం కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ప్లైడ్ సిమ్రు పార్టీ.. వేల్స్ స్వాతంత్ర్యానికి మద్దతు ఇస్తుండగా… నార్తర్న్ ఐర్లాండ్ మాత్రం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ తో కలిసిపోవాలని తీవ్రంగా భావిస్తోంది.
సరిగ్గా ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బ్రిటన్ రాజకీయాల్లో మరింత వేడి పుట్టించాయి. ఐక్య ఐర్లాండ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ డబ్లిన్ పర్యటనలో బాహాటంగా ప్రకటించారు. ఐర్లాండ్ ఏకీకరణ జరగడం ఒక అద్భుతమైన విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. గత అమెరికా అధ్యక్షుల కంటే భిన్నంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఐక్య ఐర్లాండ్ చర్చ మరింత వేగవంతం అయిందని నార్తర్న్ ఐర్లాండ్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1998 నాటి గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం మెజారిటీ ప్రజలు కోరుకుంటే ఏకీకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపే అవకాశం చట్టబద్ధంగా ఉంది.
ఈ పరిణామాలన్నీ ప్రస్తుత యూకే పాలకులకు మింగుడుపడని అంశాలనే చెప్పాలి. దీన్ని బ్రిటన్ ప్రభుత్వం వేర్పాటువాదంగా చూస్తోంది. స్కాట్లాండ్ లో మరో రెఫరెండం ప్రసక్తే లేదని ప్రధాని ఆండీ బర్న్ హామ్ జాన్… స్పష్టం చేశారు. ప్రజలంతా ఒకే దేశంగా కలిసి ఉంటేనే బలంగా ఉంటామని డౌనింగ్ స్ట్రీట్ ప్రకటించింది. లేబర్ పార్టీ మేనిఫెస్టో స్వాతంత్ర్యానికి ఏమాత్రం మద్దతు ఇవ్వదని ప్రధాని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పైనే ఉందని ఆయన వివరణ ఇచ్చారు. అటు కన్జర్వేటివ్ పార్టీ నేతలు కూడా ఈ సమ్మిట్ ను కేవలం ఒక ఫొటో సెషన్ గా కొట్టిపారేశారు.
అయితే కార్డిఫ్ లో జరిగిన ఈ ఒప్పందం కేవలం స్వాతంత్ర్యం గురించి మాత్రమే కాకుండా ఇతర కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ లో భాగం కావాలని ఈ మూడు దేశాలు బలంగా కోరుకుంటున్నాయి. ఆర్థిక రంగం, ఇంధన ఉత్పత్తి వంటి కీలక విషయాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఈ ఒప్పందంలో నేతలు నిర్ణయించారు. బార్నెట్ ఫార్ములాలో మార్పులు తీసుకురావాలని వేల్స్… బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ప్లైడ్ సిమ్రు పార్టీ ఏకంగా క్రౌన్ ఎస్టేట్ ఆదాయాలపై పూర్తి నియంత్రణ కావాలని పట్టుబడుతోంది. ఈ పరిణామాలు గమనిస్తుంటే… ఆండీ బర్న్ హామ్ యూకేకు ఆఖరి ప్రధానిగా చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఉందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
యూరోపియన్ యూనియన్ తో కలిసి ఉండలేక… బ్రెగ్జిట్ ద్వారా బ్రిటన్ ఎలా బయటకు వచ్చేసిందో… భవిష్యత్తులో యూకే ముక్కలవడానికి కూడా అలాంటి పరిణామాలే దారి తీయొచ్చు. ప్రస్తుతానికి స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ లో పెద్ద స్థాయి ప్రజా ఉద్యమాలు జరగకపోయినా… విడిపోవడానికి మొగ్గు చూపుతున్న రాజకీయ పార్టీలు ఇదే వాయిస్ తో ముందుకెళితే మాత్రం… రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి పగుళ్లు రాక తప్పదు…

