UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?

Grooming Gangs Explained

Grooming Gangs Explained

Explained: 2,50,000 మంది అమ్మాయిలు… 149 ప్రాంతాలు… 70 ఏళ్లకు పైగా సాగిన క్రూరమైన లైంగిక దాడులు… ఇప్పుడు ఈ సంఖ్యలు బ్రిటన్‌ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా బిగ్‌ డిబెట్‌కు కారణమైంది.

రూపర్ట్ లోవ్‌ విడుదల చేసిన రిపోర్టులో ఏముంది?

బ్రిటిష్ పొలిటికల్‌ లీడర్‌ రూపర్ట్ లోవ్ విడుదల చేసిన ది రే*ప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు బ్రిటన్‌లో భారీ దుమారం రేపుతోంది. దశాబ్దాలుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒకే తరహా నమూనాతో నడిచిన ఒక వ్యవస్థ గురించి ఈ నివేదిక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా సామాజికంగా బలహీనంగా ఉన్న బాలికలను లక్ష్యంగా చేసుకుని కొందరు గుంపులు వల వేసి, వారిని లైంగిక దోపిడీకి గురిచేశాయనే ఆరోపణల చుట్టూనే ఈ మొత్తం వివాదం తిరుగుతోంది.

ఈ విచారణకు నాయకత్వం వహించిన సామీ వుడ్ హౌస్ సాధారణ కార్యకర్త కాదు. ఆమె స్వయంగా ఇలాంటి దాడులకు గురైన బాధితురాలు. ఆమెతో పాటు అనేక మంది బాధితులు, కుటుంబ సభ్యులు, సమాచారం బయటపెట్టిన వ్యక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆ కథలు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కొందరు తమపై వందలాది మంది పురుషులు దాడి చేశారని చెప్పారు. మరికొందరిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లారని చెప్పారు. కొందరికి మద్యం, మత్తు పదార్థాలు అలవాటు చేసిన తరువాత లైంగిక దాడి చేశారని ఆరోపించారు. జరిగిన దారుణాలను వీడియోలుగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఒకరి దగ్గర నుంచి మరోకరి దగ్గరకు పంపిస్తూ మనుషుల్లా కాకుండా వస్తువుల్లా చూసిన సందర్భాలు కూడా ఈ వాంగ్మూలాల్లో కనిపించాయి. ఇక్కడే అందరినీ షాక్‌కు గురిచేసిన సంఖ్య బయటకు వచ్చింది.

×
×
Ad

కనీసం 2,50,000 మంది యువ శ్వేతజాతి బాలికలు ఈ తరహా దోపిడీకి గురై ఉండొచ్చన్న అంచనా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, అక్రమ రవాణా, హింస, బెదిరింపులు, జీవితాంతం వెంటాడే మానసిక గాయాలు… ఈ అన్నింటినీ కలిపితే బాధితుల సంఖ్య లక్షల్లో ఉండొచ్చనే వాదన ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. 2,50,000 అనేది అధికారిక లెక్క కాదు. 2019లో బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన చర్చల్లో వినిపించిన అంచనాల ఆధారంగా ఈ సంఖ్యను ఉపయోగించారు. కానీ అసలు సంఖ్య దీనికంటే ఎక్కువే ఉండొచ్చని కూడా వాదిస్తున్నారు. కారణం ఒక్కటే. ఇలాంటి కేసులపై పూర్తి స్థాయి రికార్డులు ఎప్పుడూ సేకరించలేదనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి.

పాకిస్థానీ ముస్లిం పురుషుల ఘోరాలు:

ఈ నివేదికలో అత్యంత వివాదాస్పద అంశం నిందితుల నేపథ్యం. 2005 నుంచి 2017 మధ్య సమూహ బాలల లైంగిక దోపిడీ కేసుల్లో శిక్షలు పడిన 264 మంది నిందితుల వివరాలను పరిశీలించిన ఒక అధ్యయనాన్ని ఇందులో ప్రస్తావించారు. ఆ గణాంకాలు చూస్తే 84శాతం మంది దక్షిణాసియా వంశానికి చెందినవారిగా కనిపించారు. వారిలో ఎక్కువ మంది పాకిస్థానీ ముస్లిం పురుషులేనన్న వాదన ఇప్పుడు బ్రిటన్‌లో తీవ్రమైన రాజకీయ చర్చకు కారణమవుతోంది. అదే అధ్యయనంలో 7శాతం మంది శ్వేతజాతి వారు, 8శాతం మంది నల్లజాతి వారుగా కనిపించారు.

ఈ లెక్కల ఆధారంగా కొందరు ఇది కేవలం క్రిమినల్ సమస్య మాత్రమే కాదని, కొన్ని ప్రాంతాల్లో జాతి, మత, సామాజిక నేపథ్యాలతో కూడా సంబంధం ఉందని వాదిస్తున్నారు.

మరోవైపు విమర్శకులు మాత్రం కొందరు నేరస్తుల చర్యలను మొత్తం ముస్లిం సమాజానికి లేదా మొత్తం పాకిస్థానీ సమాజానికి ముడిపెట్టడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నేరాల చర్చ నుంచి బయటకు వచ్చి వలసలు, మతం, మల్టి కల్చర్, జాతీయ గుర్తింపు లాంటి పెద్ద అంశాల చుట్టూ తిరగడం మొదలైంది. ఇదంతా ఒకవైపు అయితే మరో పెద్ద ప్రశ్న కూడా ముందుకొచ్చింది. ఒకవేళ ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులకు తెలియదా? పాఠశాలలకు తెలియదా? స్థానిక ప్రభుత్వాలకు తెలియదా? ఆరోగ్య శాఖలకు తెలియలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలే ఇప్పుడు బ్రిటన్ అధికార వ్యవస్థను ఇబ్బందిపెడుతున్నాయి.

కొందరు అధికారులు జాత్యహంకార ఆరోపణలు వస్తాయనే భయంతో సమస్యను నేరుగా ఎదుర్కోలేదనే విమర్శలు కూడా మళ్లీ వినిపిస్తున్నాయి. నివేదిక బయటకు వచ్చిన తర్వాత రూపర్ట్ లోవ్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌లో వలస విధానాలు విఫలమయ్యాయని, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ప్రభుత్వాలు చూపలేదని విమర్శించారు. ఇదే సమయంలో ఎలాన్ మస్క్ కూడా ఈ అంశంపై స్పందించడంతో ప్రపంచ మీడియా దృష్టి మళ్లీ ఈ కేసుపై పడింది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలను పట్టించుకోని వారిని కూడా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

అయితే నిజంగా 1950ల నుంచి ఒకే తరహా నమూనాతో ఈ నేరాలు కొనసాగాయా? నిజంగా 149 ప్రాంతాల్లో ఇలాంటి ఆరోపణలు ఎందుకు వినిపించాయి? 2,50,000 అనే సంఖ్య వాస్తవానికి ఎంత దగ్గరగా ఉంది? ముఖ్యంగా వేలాది మంది బాలికలు సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరికే వరకు బ్రిటన్‌ ప్రపంచం ముందు దోషీగానే కనిపించాల్సి ఉంటుంది.