Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేల సంవత్సరాల క్రితం… రాజ్యాలు పుట్టక ముందు, చరిత్ర పుస్తకాలు రాయక ముందు, మనిషి చేతిలో గడియారం కూడా లేని కాలంలో ఆకాశమే మనిషి క్యాలెండర్. సూర్యుడే మనిషికి సమయాన్ని చూపేవాడు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు మధ్యాహ్నం వేళ సూర్యుడు ఒక్కసారిగా మాయమయ్యాడు. పక్షులు గూటికి చేరుకున్నాయి. జంతువులు తలదాచుకున్నాయి. రాజులు దాన్ని దేవుడి కోపమని భావించారు. సాధారణ మనిషి మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఒక్క ప్రశ్న అడిగాడు… సూర్యుడికి ఏమైంది?
ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మానవ నాగరికతకు వేల సంవత్సరాలు పట్టింది. ఈరోజు… అదే ఘటనను మనం భయంతో కాదు, విజ్ఞానంతో చూస్తున్నాం. ఆగస్టు 12న మళ్లీ అదే ఆకాశం… అదే సూర్యుడు… అదే చంద్రుడు… కానీ మనిషి అర్థం చేసుకునే శక్తి. సూర్యగ్రహానాన్ని ఇప్పుడు మనిషి విజ్ఞానంతో అర్థంచేసుకుంటున్నాడు.
ఆకాశాన్ని చూసి భయపడిన మనిషే… అదే ఆకాశాన్ని చదవడం కూడా నేర్చుకున్నాడు. నక్షత్రాల కదలికలను లెక్కించాడు. చంద్రుడి ప్రయాణాన్ని అర్థం చేసుకున్నాడు. సూర్యుడి వెలుగు వెనుక దాగి ఉన్న విశ్వ రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పడం ప్రారంభించాడు. అప్పుడు తెలిసిన నిజం ఒక్కటే. సూర్యుడు మాయమవ్వలేదు.
Also Read
భూమి చుట్టూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న చంద్రుడు, ఒక ప్రత్యేకమైన క్షణంలో భూమికీ సూర్యుడికీ మధ్యలోకి వచ్చి నిలబడతాడు. అతని నీడ భూమిపై పడిన చోటే సూర్యగ్రహణం కనిపిస్తుంది. ప్రకృతి వేల కోట్ల ఏళ్లుగా ఎలాంటి పొరపాటు లేకుండా ప్రదర్శిస్తున్న అద్భుతమైన ఖగోళ విన్యాసం అది. అలాంటి అరుదైన క్షణమే ఈ ఆగస్టు 12న మరోసారి ప్రపంచాన్ని పలకరించబోతోంది. 2026లో ప్రపంచానికి కనిపించే ఏకైక సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ప్రారంభమై, సాయంత్రం 5గంటల15 నిమిషాలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయానికి ఈ ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఈ అద్భుతాన్ని చూడగల అదృష్టం అందరికీ దక్కదు. చంద్రుడి నీడ పడే సన్నని మార్గంలో ఉన్నవారికే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది.
ఈసారి ఆ నీడ గ్రీన్లాండ్, ఐస్లాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర స్పెయిన్, ఈశాన్య పోర్చుగల్‌లోని చిన్న ప్రాంతం, ఉత్తర రష్యా మీదుగా ప్రయాణించబోతోంది. యూరప్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికాలో మాత్రం పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. కానీ భారత్‌కి మాత్రం ఈసారి ఆ అవకాశం లేదు. చంద్రుడి నీడ దక్షిణాసియా మీదుగా ప్రయాణించకపోవడంతో, ఈ గ్రహణం ఏ దశలోనూ ఇండియాలో కనిపించదు.
అయినా ఈ ఘటనపై ప్రపంచం అంతా ఎందుకంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది? కారణం, ఇది కేవలం ఆకాశంలో కనిపించే అందమైన దృశ్యం మాత్రమే కాదు. శాస్త్రానికి ప్రకృతి తెరిచే అరుదైన కిటికీ కూడా. సాధారణ రోజుల్లో సూర్యుడి తీవ్రమైన కాంతి వెనుక దాగిపోయే కరోనా అనే బయటి వాతావరణం, సంపూర్ణ గ్రహణం సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కొద్ది నిమిషాల్లో సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఎలా పనిచేస్తోందో సైంటిస్టులు తెలుసుకుంటారు. భూమి వాతావరణం ఒక్కసారిగా వెలుగు తగ్గిపోతే ఎలా స్పందిస్తోందనే విషయాలను కూడా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. అందుకే నాసా కూడా విమానాలు, అత్యంత ఎత్తుకు వెళ్లే బెలూన్ల సాయంతో ఈ గ్రహణాన్ని పరిశీలించేందుకు సిద్ధమవుతోంది.
ఒకప్పుడు సూర్యగ్రహణాన్ని చూసి రాజులు యుద్ధాలను వాయిదా వేశారు. ప్రజలు దాన్ని చెడు శకునంగా భావించారు. కాలక్రమంలో ఆ భయాల చుట్టూ ఎన్నో కథలు పుట్టాయి. కానీ శాస్త్రం ఒక్క మాటతో ఆ అపోహలన్నింటినీ తొలగించింది. సూర్యగ్రహణం అనేది శాపం కాదు. విపత్తుకు సంకేతం కూడా కాదు. ప్రకృతి తన కచ్చితమైన గణితంతో సృష్టించే సహజ ఖగోళ ఘటన మాత్రమే. అయితే ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరి. సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ నేరుగా కళ్లతో చూడకూడదు. సాధారణ కళ్లద్దాలు, నలుపు గాజు లేదా నీటిలో ప్రతిబింబం చూసి వీక్షించడం ఏమాత్రం సురక్షితం కాదు. ధ్రువీకరించిన ఎక్లిప్స్ గ్లాసెస్ లేదా ప్రత్యేక సోలర్ ఫిల్టర్లతో మాత్రమే చూడాలి.
సంపూర్ణ గ్రహణం కనిపించే ప్రాంతంలో, చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేసిన ఆ కొద్ది నిమిషాల్లో మాత్రమే నేరుగా చూడడం సురక్షితం. నిజానికి వేల సంవత్సరాల క్రితం ఆకాశం మనిషిలో భయాన్ని నింపింది. ఈరోజు అదే ఆకాశం ప్రశ్నలు అడగమని ప్రేరేపిస్తోంది. ఒకప్పుడు రహస్యంగా కనిపించిన సూర్యగ్రహణం.. ఇప్పుడు విజ్ఞానానికి ప్రతీకగా నిలిచింది. మనిషి నిజంగా గెలిచింది ప్రకృతిపై కాదండి. తన అజ్ఞానంపైనే ఇది మానవుడు సాధించిన విజయం.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!