Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Nano EV: ఒక సామాన్య భారతీయుడి సొంత కారు కల… ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన మాట… సమస్త ప్రపంచం భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసిన ఆటోమొబైల్ అద్భుతం “టాటా నానో”! కాల చక్రంలో రోడ్లపై ఈ కారు శబ్దం తగ్గినా, సగటు భారతీయుడి గుండెల్లో దీని స్థానం చెక్కుచెదరలేదు. ఇప్పుడు అదే నానో… సరికొత్త ‘ఈవీ’ రూపంలో మళ్లీ ఇండియన్ రోడ్లను షేక్ చేయబోతోందా? టాటా డిజైన్ హెడ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి?
2008 ఆటో ఎక్స్పో వేదికగా రతన్ టాటా ఒక సంచలన ప్రకటన చేశారు. ‘లక్ష రూపాయల కారు’ నానోను ఆవిష్కరించారు. లక్ష రూపాయల కారు చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా ప్రయాణించే సగటు కుటుంబాలకు రక్షణగా, లక్ష రూపాయల ప్రారంభ ధరతో 2009లో నానో కారు రోడ్లపైకి వచ్చింది. భారతీయ ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత చవకైన కారుగా ఇది నిలిచింది. అంతర్జాతీయంగా భారతదేశ పారిశ్రామిక ప్రాభవాన్ని సగర్వంగా చాటిచెప్పింది. మిడిల్ క్లాస్ వర్గాల ఆశలకు, ఆకాంక్షలకు నానో ఒక ఐకానిక్ ప్రతీకగా మారింది.
అయితే, మార్కెటింగ్ వ్యూహాల్లో దొర్లిన చిన్న పొరపాటు.. అంటే “ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు” అనే ట్యాగ్‌లైన్, కస్టమర్ల సామాజిక మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపింది. భద్రతా ఆందోళనలు, క్రమంగా మారిన వినియోగదారుల ప్రాధాన్యతల కారణంగా నానో అమ్మకాలు పడిపోయాయి. ఒకానొక సమయంలో ఇండియన్ ఆటోమొబైల్ విప్లవానికి ఊపిరిలూదిన ఈ ల్యాండ్‌మార్క్ మోడల్, చివరికి 2018 నాటికి ఉత్పత్తికి ముగింపు పలుకుతూ నిశ్శబ్దంగా వీడ్కోలు తీసుకుంది.
Also Read
కానీ, కాలం మారింది. నేడు భారత ఆటోమొబైల్ రంగాన్ని ఎలక్ట్రిక్ విప్లవం ఏలుతోంది. ఇందులో టాటా మోటార్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. జులై 2026 గణాంకాల ప్రకారం… ఒక్క నెలలోనే టాటా 13,678 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, 41.54 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థి మహీంద్రా కంటే దాదాపు 6 వేల యూనిట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టియాగో, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సియెర్రా వంటి ఈవీలతో సంచలనం సృష్టిస్తున్న టాటా పోర్ట్‌ఫోలియోలో, టియాగో ఈవీ కంటే దిగువన ఒక మైక్రో ఈవీకి ఇప్పటికీ స్పష్టమైన అవకాశముంది.
ఇటీవల టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఆశలకు మళ్లీ ఊపిరిపోశాయి. “నానో మళ్లీ వస్తుందా?” అన్న ప్రశ్నకు ఆయన నవ్వుతూ “ట్రై చేస్తాం” అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో నానోను ఎలక్ట్రిక్ అవతార్‌లో ప్రపంచం ముందుకు తీసుకురావడం తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. గతంలో కోయంబత్తూరుకు చెందిన జయేమ్ ఆటోమోటివ్స్‌తో కలిసి 17 kWh బ్యాటరీ, 130 కిలోమీటర్ల రేంజ్‌తో నానో ఈవీని ఫ్లీట్ కోసం అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆధునిక సాంకేతికతతో 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే నానో ఈవీ సాంకేతికంగా సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు.
అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో టాటా మోటార్స్ స్పష్టత ఇచ్చింది. అజయ్ జైన్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, నానో ఈవీ పునరాగమనానికి సంబంధించి సంస్థ వద్ద ఎలాంటి అధికారిక ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. అయినా, సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొట్టే ఏఐ చిత్రాలు, విపరీతమైన ఆసక్తి… భారతీయ వినియోగదారుల హృదయాల్లో నానో పట్ల ఉన్న చెరిగిపోని ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తూనే ఉన్నాయి.
సగటు భారతీయుడి కాలాన్ని, కలను మార్చిన నానో పేరు… ఒక వ్యాపార ప్రయోగం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం! టాటా మోటార్స్ అధికారికంగా ప్రణాళికలను ప్రకటించకపోయినా, ఎలక్ట్రిక్ యుగంలో నానో లాంటి కాంపాక్ట్, అఫర్డబుల్ మైక్రో ఈవీకి మార్కెట్లో అపరిమితమైన డిమాండ్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలం ఎలాంటి మలుపులు తిప్పుతుందో, రతన్ టాటా కల ఈవీ రూపంలో పునర్జన్మనిస్తుందో లేదో వేచి చూడాల్సిందే!
:- CLN RAJU ( EDITOR- NTV DIGITAL)
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!