Explainer: యుద్ధంలోకి మరో ముస్లిం దేశం..తగలబడుతున్న మధ్యప్రాచ్యం!

Egypt Supports Saudi Arabia

Egypt Supports Saudi Arabia

మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం మొదలవబోతోందా? ఇప్పటికే సౌదీ అరేబియాపై డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. రాజధాని రియాద్‌లో ప్రాణాలు పోతున్నాయి. చమురు సంస్థల కార్యాలయాలే లక్ష్యంగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ పోరాటంలోకి మరో దేశం కూడా దిగబోతుంది. సౌదీకి అండగా నిలబడేందుకు ఈజిప్ట్ సిద్ధమవుతోంది.

అవసరమైతే తమ సైన్యాన్ని పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. అంటే ఇప్పటివరకు ఒకవైపు సౌదీ అరేబియా, మరోవైపు యెమెన్ హౌతీలు. ఇప్పుడు ఈజిప్ట్ కూడా రంగంలోకి దిగే పరిస్థితి. మరి ఈ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేదా ఒక్కో దేశం ఈ ఘర్షణలో పాల్గొంటూ మధ్యప్రాచ్యాన్ని మరోసారి మంటల్లోకి నెట్టబోతోందా? ఇంతకీ సౌదీ అరేబియాపై ఎందుకీ దాడులు?

అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి జరిగినట్లు కథనాలు చెబుతున్నాయి. ఈ దాడిలో ఒక అమెరికా పౌరుడితో సహా 13 మంది చనిపోయినట్లు సమాచారం. ఆ తర్వాత కూడా డ్రోన్ల ముప్పు తగ్గలేదు.

రియాద్ ప్రాంతం, తూర్పు ప్రాంతం, దేశం దక్షిణ భాగం మీదుగా వచ్చిన నాలుగు డ్రోన్లను తమ రక్షణ దళాలు కూల్చివేసినట్లు సౌదీ ప్రకటించింది. ఇంతలోనే సౌదీకి చెందిన అతిపెద్ద చమురు సంస్థ అరామ్‌కో ప్రధాన కార్యాలయాన్ని హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. భవనం దెబ్బతిన్నది. ప్రాణనష్టం జరగలేదు కానీ ఈ దాడుల వెనుక ఉన్న అసలు ప్రమాదం మరింత పెద్దది. ఎందుకంటే సౌదీ అరేబియా అనేది ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన దేశం. అక్కడ యుద్ధం తీవ్రత పెరిగితే దాని ప్రభావం సరిహద్దులు దాటి ప్రపంచమంతా కనిపించవచ్చు.

ఇక ఈ శత్రుత్వం ఒక్కరోజులో మొదలైంది కాదు. 2014లో యెమెన్ రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి అధ్యక్షుడు అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత సౌదీ అరేబియా యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా సైనిక చర్యల్లోకి దిగింది. ఏళ్ల తరబడి పోరాటం సాగింది. 2022లో కాల్పుల విరమణతో కొంత ఉపశమనం కనిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ దాడులు పెరుగుతున్నాయి.

హౌతీలకు ఇరాన్ నుంచి శిక్షణ, నిఘా సమాచారం, డ్రోన్ దాడులకు సహాయం అందుతోందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ పోరాటం యెమెన్, సౌదీ మధ్య ఉన్న శత్రుత్వానికే పరిమితం కావడం లేదు. ఇరాన్ పాత్రపై కూడా ప్రపంచ దేశాల దృష్టి పడుతోంది. ఇంతలో మరో ప్రమాదకరమైన పరిణామం చోటుచేసుకుంది.

ఎర్ర సముద్రానికి సమీపంలో ఉన్న బాబ్ అల్ మందెబ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన మార్గం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు దెబ్బతింటే చమురు రవాణా, ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమవుతాయి. అంటే యుద్ధం ఒకవైపు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంటే, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మార్గాలపైనా ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈజిప్ట్ సైనిక సహాయానికి సిద్ధమవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సౌదీకి సాయం చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ను కూడా హౌతీలపై చర్యలకు కోరవచ్చని ఆయన మాట్లాడారు.

అయితే ఈ దేశాలు నిజంగా యుద్ధంలోకి దిగుతాయా? దిగితే ఏ స్థాయిలో పాల్గొంటాయి? ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సౌదీపై దాడులు కొనసాగుతున్నాయి. ఈజిప్ట్ సైనిక సహాయానికి సిద్ధమంటోంది. అమెరికా, టర్కీ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఒక్కసారి పరిస్థితిని గమనించండి. ఒకవైపు డ్రోన్ల దాడులు. మరోవైపు చమురు కేంద్రాలపై ముప్పు. ఇంకోవైపు యుద్ధంలోకి దిగేందుకు సిద్ధమవుతున్న దేశాలు. ఇప్పటివరకు యెమెన్‌లో మొదలైన ఈ పోరాటం మరిన్ని దేశాలను తనలోకి లాగితే, దాని పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో ఎవరూ తేలిగ్గా అంచనా వేయలేరు.

మరి సౌదీకి అండగా ఈజిప్ట్ సైన్యం నిజంగా రంగంలోకి దిగుతుందా? అమెరికా కూడా దాడులు మొదలుపెడుతుందా? టర్కీ ఈ పోరాటంలో భాగమవుతుందా? ఈ ప్రశ్నలకు వచ్చే రోజుల్లో దొరికే సమాధానాలే మధ్యప్రాచ్యం ఎటువైపు వెళ్తుందో నిర్ణయించవచ్చు.