Sabang Port: ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఏ దేశాధినేత ఇవ్వని విధంగా మోడీకి ఘన స్వాగతం పలికింది. ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియోంటో భారత ప్రధాని పర్యటనకు ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చారు. రెండు దేశాలు రక్షణ, వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే, ఇప్పుడు ఒక ఒప్పందం మాత్రం చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదే ‘‘సబాంగ్ పోర్టు’’ ఒప్పందం. వెహ్ ద్వీపంలో ఉన్న ఈ పోర్టును భారత్-ఇండోనేషియాలు కలిసి అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ పోర్టుతో చైనాకు ఏం భయం..?
సబాంగ్ కేవలం సాధారణ పోర్టు కాదు. ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో 40 శాతం జరిగే ‘‘మలక్కా జలసంధి’’కి దగ్గరగా, సుమత్రా ద్వీపానికి ఉత్తర కొనలో ఉంది. ఇది ఉన్న స్థానమే ఇప్పుడు చైనాకు తలనొప్పిగా మారింది. నిజానికి చైనాకు ఉన్న అత్యంత బలహీన అంశాల్లో మలక్కా జలసంధి ఒకటి. దీనిని ‘‘మలక్కా డైలామా’’ అని చైనా విశ్లేషకులు భావిస్తుంటారు. చైనాకు సంబంధించిన చమురు 80 శాతం ఈ జలసంధి గుండా వెళ్తుంది. చైనాకు జరిగే వాణిజ్యంలో ఈ సముద్ర మార్గం చాలా కీలకం. ఇప్పుడు సబాంగ్ పోర్టు ద్వారా ఈ మార్గాన్ని భారత్ కంట్రోల్ చేయనుంది.
ఇదే కాకుండా, ఇది అండమాన్ నికోబార్‌లోని గ్రేట్ నికోబార్‌కి కేవలం 100 మైళ్ల దూరంలో ఉంది. మోడీ సర్కార్ ఇక్కడే గ్రేట్ నికోబార్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టును నిర్మిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్ నికోబార్ పోర్టు, సబాంగ్ పోర్టు ‘‘మలక్కా జలసంధి’’కి గేట్‌వేగా మారనున్నాయి. చైనా ఏదైనా చర్యకు పాల్పడితే ఈ మార్గంలోని చైనాను పూర్తిగా బ్లాక్ చేయవచ్చు. ఎలాగైతే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేసి అమెరికాను ఆడిస్తుందో అలాగే.
ఇండో-పసిఫిక్‌పై భారత్ ప్రభావం:
సబాంగ్ పోర్టు ద్వారా మలక్కా జలసంధిపై భారత కంట్రోల్ ఉంటుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంపై వ్యూహాత్మక ఆధిపత్యం భారత్‌కు లభిస్తుంది. సబాంగ్ పోర్టు సుమారుగా 50,000 టన్నుల నౌకల్ని నిర్వహించగలిగే సామర్థ్యం ఉన్న చిన్న పోర్టు అయినప్పటికీ, ఇది జలాంతర్గాములతో సహా నేవీకి చెందిన అనేక నౌకలకు ఆతిథ్యం ఇవ్వగలదు.
చైనా ‘‘స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్’’కు చెక్:
చైనా భారత్‌ను దిగ్బంధించేందుకు వ్యూహాత్మకంగా మన సరిహద్దు దేశాలను మచ్చిక చేసుకుంటోంది. పాకిస్తాన్‌లో గ్వాదర్, శ్రీలంకలో హంబన్‌టోటా, బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్ వంటి పోర్టుల ఆధునీకీకరణ పేరుతో భారత సరిహద్దుల్లో పాగా వేస్తోంది. ఇదే కాకుండా తూర్పు ఆఫ్రికాలో చైనా స్థావరాలు ఉన్నాయి. కెన్యాలో లాము, సుడాన్‌లో చిన్న టెర్మినళ్లను నిర్మిస్తోంది. ఇక ఆఫ్రికాలోని జిబూటీలో పోర్టు కూడా చైనాకు వ్యూహాత్మక అట్వాంటేజ్ ఇస్తోంది. ఇదే సమయంలో ఈ దేశాలు చైనా నుంచి గణనీయంగా అప్పును కలిగి ఉన్నాయి. అప్పు తీర్చని పక్షంలో ఈ పోర్టుల్ని లీజుకు తీసుకునే ప్లాన్ చైనాది. ఇప్పటికే శ్రీలంకలోని హంబంటోట పోర్ట్ దీనికి ఒక చక్కటి ఉదాహరణ, ఇక్కడ చైనా 85% వాటాను కొనుగోలు చేసి, దానిని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది.
చైనా పాక్‌ను నమ్ముకున్న పని అయ్యేట్లు లేదు:
మరోవైపు, ఎప్పటికైనా మలక్కాతో తమకు ముప్పు తప్పదని గ్రహించిన చైనా, పాకిస్తాన్‌లో గ్వాదర్ పోర్టును డెవలప్ చేస్తోంది. ఈ పోర్టును ‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సిపెక్)’’తో రోడ్డు, రైలు మార్గాలతో కనెక్ట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా తన జిన్‌జియాంగ్ ప్రావిన్సును, గ్వాదర్ పోర్టులో జోడిస్తోంది. గత కొన్నేళ్లుగా అనేక బిలియన్ డాలర్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది.
కానీ, చైనా ఊహించిన పనులు పాకిస్తాన్‌లో జరగడం లేదు. పాకిస్తాన్‌లో అస్థిర పరిస్థితులు, బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తాలిబాన్ల దాడులు, పీఓకేలో ప్రజల తిరుగుబాటు చైనా కలల ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చింది. బీఎల్ఏ ముఖ్యంగా చైనా ఇంజనీర్లు, చైనీయులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ సంపదను దోచుకుంటున్నారని ఆరోపిస్తోంది. ఇవన్నీ చైనాకు తలనొప్పిగా మారాయి. ఇప్పుడు మలక్కా రూపంలో భారత్ చెక్ పెట్టింది.

