Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!

Cold Cough

Cold Cough

చలికాలంలో దగ్గు, జలుబు, గొంతులో మంట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. ఈ లక్షణాలు కనిపించగానే చాలామంది ఇన్ఫెక్షన్ వచ్చిందని భావిస్తారు. కానీ ప్రతిసారీ కారణం ఇన్ఫెక్షన్ మాత్రమే ఉండదు.

ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా ఇలాంటి లక్షణాలనే కలిగించవచ్చు. మరి మనకు వచ్చిన దగ్గు.. కాలుష్యం వల్ల వచ్చిందా? వైరల్ ఇన్ఫెక్షనా? లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యా? ఈ తేడాను ఎలా గుర్తించాలి?

ముందుగా కాలుష్యం వల్ల వచ్చే దగ్గు గురించి తెలుసుకుందాం. గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు, వాహనాల పొగ, నిర్మాణ పనుల నుంచి వెలువడే ధూళి శ్వాసనాళాల్లోకి చేరి మంట, వాపు కలిగిస్తాయి. దీంతో పొడి దగ్గు, గొంతులో మంట, ముక్కులో మంట, కళ్ల నుంచి నీళ్లు రావడం, ఛాతీ బిగుతుగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు.

ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగినప్పుడు లేదా ఎక్కువసేపు బయట ఉన్నప్పుడు ఈ సమస్య పెరగవచ్చు. ఇంట్లో లేదా స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు లక్షణాలు తగ్గితే కాలుష్యం ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు తప్పనిసరిగా ఉండాలని లేదు.

ఇక ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే దగ్గులో కొన్ని అదనపు లక్షణాలు కనిపించవచ్చు. జ్వరం, చలి, తీవ్రమైన అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ లాంటివి ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. సాధారణ జలుబు, ఫ్లూ లాంటి వైరస్‌లు చలికాలంలో వేగంగా వ్యాపిస్తాయి. ఇన్ఫెక్షన్ వల్ల మొదట పొడి దగ్గు వచ్చినా, ఆ తర్వాత కఫంతో కూడిన దగ్గుగా మారవచ్చు. అయితే కఫం పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉందని వెంటనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని భావించకూడదు. యాంటీబయాటిక్స్ అవసరమని కూడా దాని ఆధారంగా నిర్ణయించలేం.

మరోవైపు చల్లటి, పొడి గాలి కూడా శ్వాసనాళాలను ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలు ఉన్నవారిలో దగ్గు, గురక, ఛాతీ బిగుతు పెరగవచ్చు. తరచూ తుమ్ములు, ముక్కులో దురద, కళ్ల నుంచి నీళ్లు రావడం, పలుచటి నీటిలా ముక్కు కారడం వంటి లక్షణాలు ఉంటే అలర్జీ కూడా కారణం కావచ్చు.

ఇవి వారాలపాటు కొనసాగవచ్చు లేదా దుమ్ము వంటి కారణాలకు గురైన ప్రతిసారీ తిరిగి రావచ్చు. అయితే కొన్ని లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, ఛాతీలో నొప్పి, తీవ్రమైన గురక, దగ్గుతో రక్తం రావడం, పెదవులు నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. దగ్గు తీవ్రంగా ఉన్నా, రోజురోజుకీ పెరుగుతున్నా, తగ్గకుండా కొనసాగుతున్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఇక ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు అవసరం. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు గడపకుండా ఉండాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ఉపయోగించాలి. ఇంట్లో దుమ్ము, సిగరెట్ పొగ, ఇతర పొగలకు దూరంగా ఉండాలి. తగినంత నీరు తాగడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం, అవసరమైన టీకాలు వేయించుకోవడం కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. దగ్గు వచ్చిందంటే ఇన్ఫెక్షన్ వచ్చినట్టే అని అనుకోవద్దు.

కాలుష్యం, చల్లటి గాలి, అలర్జీలు, వైరస్‌లు.. వీటిలో ఏదైనా కారణం కావచ్చు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకుండా, లక్షణాలను బట్టి సరైన వైద్య సలహా తీసుకోవాలి. కారణాన్ని గుర్తించినప్పుడే సరైన చికిత్స తీసుకుని మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.