Partition Horrors Remembrance Day: 1947 ఆగస్టు 14 ఉదయం. ఒకవైపు కరాచీలో కొత్త దేశం పురుడుపోసుకుంటోందన్న సంబరాలు, మరోవైపు ఢిల్లీలో దశాబ్దాల పారతంత్రం వీడి స్వాతంత్య్ర వెలుగులు నిండబోతున్నాయన్న ఆత్రుత. కానీ, పంజాబ్, బెంగాల్‌లలోని లక్షలాది ఇళ్లలో మాత్రం హర్షాతిరేకాలు లేవు.. కేవలం కంటిమీద కునుకు లేని భయం, గుండెల్ని పిండేసే అనిశ్చితి మాత్రమే ఉన్నాయి. దానికి కారణం రేపు తెల్లారితే తమ ఊరు, తమ ఇల్లు ఏ దేశంలో ఉంటాయో అక్కడ ఎవరికీ తెలియదు! సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను బ్రిటీష్ న్యాయవాది సర్ సిరిల్ జాన్ రెడ్‌క్లిఫ్‌కు అప్పగించినప్పటికీ, ఆయన గీసిన ఆ వినాశకరమైన గీత ఆగస్టు 14న బయటకు రాలేదు. ఆ తుది నిర్ణయాన్ని ఆగస్టు 17 వరకు దాచిపెట్టారు. అంటే అర్ధరాత్రి రెండు దేశాలు స్వతంత్రంగా మారినప్పటికీ, వేలాది కుటుంబాలకు తమ సొంత ఇల్లు భారత్‌లో ఉందో, పాకిస్థాన్‌లో ఉందో తెలియని ఒక విచిత్రమైన, విషాదకరమైన పరిస్థితి నెలకొంది.
ఈ చారిత్రక ఘట్టాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆగస్టు 14న కరాచీలో ఏం జరిగిందో చూడాలి. ఆ రోజు ఉదయం 9 గంటలకు సింధ్ అసెంబ్లీ భవనం బయట ఉత్సాహంతో జనం కిక్కిరిసిపోయారు. మహమ్మద్ అలీ జిన్నా, లార్డ్ మౌంట్‌బాటన్ ఒకే రాచరికపు బగ్గీలో అక్కడికి చేరుకున్నారు. కరాచీలోని రాజ్యాంగ పరిషత్ ప్రత్యేక సమావేశంలో అధికార మార్పిడి ప్రక్రియ అధికారికంగా ముగిసింది. అయితే, మౌంట్‌బాటన్‌కు అక్కడ ఎక్కువ సేపు గడిపే వ్యవధి లేదు. మధ్యాహ్నం 2 గంటలకే ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఎందుకంటే అదే రోజు అర్ధరాత్రి భారత్ స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఇక, కరాచీలో సంబరాలు ముగిసి ఢిల్లీలో అర్ధరాత్రి వేడుకలకు వేదిక సిద్ధమవుతుంటే, పంజాబ్‌లో మాత్రం సరిహద్దు రక్తసిక్తమవుతోంది. విభజన వార్త కేవలం పత్రికలకే పరిమితం కాకుండా ప్రజల గుమ్మాల ముందుకు వచ్చింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు తమ ఇళ్లను వదిలి వెళ్లాలో వద్దో తెలియక కొట్టుమిట్టాడారు. పంజాబ్‌లో రైళ్లు నడుస్తున్నాయి, కానీ అవి కేవలం ప్రయాణికులను మాత్రమే కాక, ముక్కలైన జీవితాలను మోసుకెళ్తున్నాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 మధ్య దాదాపు ఏడు లక్షల మంది శరణార్థులు రైళ్ల ద్వారా సరిహద్దులు దాటారని అంచనా. కానీ, అసలు భయానక దృశ్యం ఆగస్టు 17 తర్వాత మొదలైంది. రెడ్‌క్లిఫ్ లైన్ బహిర్గతమయ్యాక, తమ ఊరు పరాయి దేశంలోకి వెళ్లిపోయిందని తెలిసిన దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు కాలినడకన, బస్సుల్లో, రైళ్లలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సరిహద్దులు దాటడం ప్రారంభించారు. మార్గమధ్యంలో శరణార్థుల కాఫిలాలు, రైళ్లపై దాడులు జరిగాయి. దహనమైన, నిశ్శబ్దంగా శవాల దిబ్బగా మారిన రైళ్లు స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ హింసలో 5 నుంచి 10 లక్షల మంది (కొన్ని అంచనాల ప్రకారం 15 నుంచి 20 లక్షల మంది) ప్రాణాలు కోల్పోయారు. సుమారు 75 వేల మంది మహిళలు కిడ్నాప్‌లు, లైంగిక హింసకు గురయ్యారు.
దేశమంతా ఒకవైపు పండుగ వాతావరణం, మరోవైపు రక్తపాతంతో అల్లకల్లోలంగా ఉంటే, అహింసా మూర్తి మహాత్మా గాంధీ మాత్రం ఈ వేడుకలకు చాలా దూరంగా కలకత్తాలోని బెలియాఘాటాలో ఉన్న హైదరీ మంజిల్‌లో ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకల కంటే, అక్కడ రేగుతున్న కోరలు చాచిన మత హింసను ఆపడమే ఆయనకు ముఖ్యమైంది. కలకత్తాలో ఆగస్టు 16-18 మధ్య జరిగిన హింసలో 4,000 మందికి పైగా చనిపోయిన వేళ, గాంధీ అక్కడే ఉండి శాంతి కోసం నిరాహార దీక్షలు చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఢిల్లీలో చారిత్రాత్మక అర్ధరాత్రి ఘట్టం ఆసన్నమైంది. బ్రిటిష్ పాలన అధికారికంగా అంతమై, కొత్త పతాకం ఎగిరింది. కానీ, ఆ వెలుగుల వెనుక దట్టమైన చీకటి దాగి ఉంది. ఒకవైపు అధికార మార్పిడి, మరోవైపు కోట్ల మంది నిరాశ్రయుల కాళ్ల నడకలు.. ఒకవైపు కొత్త దేశాల ఉదయం, మరోవైపు స్వంత ఇళ్లకు శాశ్వతంగా వేస్తున్న తాళాలు. కాలక్రమేణా ఆ గాయాలు మానుతూ, కొత్త జీవితాలు పట్టాలెక్కినా, అప్పట్లో వెనుకబడిపోయిన ఆ ఇళ్లు, తెగిపోయిన అనుబంధాల కథలు చరిత్రలో మిగిలిపోయాయి.
నేడు ఆగస్టు 14ను ‘విభజన విభాషిక స్మృతి దినోత్సవం’ (Partition Horrors Remembrance Day)గా గుర్తుచేసుకుంటున్నాం. దీని ఉద్దేశం పాత ద్వేషాలను రగిల్చడం కాదు. సమాజంలో భయం, నఫ్రత్ పెరిగినప్పుడు దానికి అతిపెద్ద మూల్యం చెల్లించేది సామాన్య మానవుడేనని గుర్తుంచుకోవడమే! 1947 ఆగస్టు 14 రాత్రి కేవలం స్వాతంత్య్రపు రాత్రి మాత్రమే కాదు.. దేశాలను పంచడానికి గీసిన ఒక గీత మధ్య అసలు మనిషి ఎక్కడ నిలబడ్డాడు అని నేటికీ మనల్ని ప్రశ్నిస్తున్న ఒక విషాద జ్ఞాపకం.

