Onkar Batra: 7ఏళ్లకే వెబ్‌సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!

Wonder Kid

Wonder Kid

ఏడేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? ఆటలు ఆడతారు.. కార్టూన్లు చూస్తారు.. స్కూల్‌కు వెళ్తారు. కానీ జమ్మూకు చెందిన ఓ బాలుడు మాత్రం ఏడేళ్లకే వెబ్‌సైట్ నిర్మించాడు. 12 ఏళ్లకే పుస్తకం రాశాడు. 13 ఏళ్లకే కంపెనీ పెట్టాడు. 16 ఏళ్లకే శాటిలైట్ తయారీపై పనిచేశాడు. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. జమ్మూ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు సాగిన జెన్-జీ యువకుడి సక్సెస్ స్టోరీ ఇది.

ఏడేళ్ల వయసులోనే కంప్యూటర్లపై ఆసక్తి పెంచుకున్నాడు ఒంకార్ సింగ్ బాత్రా. జమ్మూలో పెరిగిన ఒంకార్‌కు టెక్నాలజీ పరిచయం చాలా చిన్న వయసులోనే వచ్చింది. ఆయన తండ్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయడం కూడా దీనికి ఒక కారణం. ఏడేళ్ల వయసులో తన తొలి వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఆ ప్రతిభతో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో వెబ్‌మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అథారిటీ కూడా ఈ రికార్డును నమోదు చేసింది. బాత్రా టాలెంట్ అక్కడితో ఆగలేదు. 12 ఏళ్ల వయసులో టెక్నాలజీ నుంచి సిద్ధాంత భౌతిక శాస్త్రం వైపు అడుగు వేశాడు. వెన్ ది టైమ్ స్టాప్స్ పేరుతో 49 పేజీల పుస్తకం రాశాడు. టైమ్ డైలేషన్‌పై ఐన్‌స్టీన్ సిద్ధాంతాన్ని సవాలు చేసే ఆలోచనలను ఇందులో ప్రస్తావించాడు….13 ఏళ్లకే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. 2018లో బాత్రా టెక్నాలజీస్.. 2019లో యునైటెడ్ ఇండియా పబ్లిషింగ్ ప్రారంభించాడు.

కరోనా సమయంలో ప్రజలు.. వైద్యులను సంప్రదించేందుకు.. ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడే ఇంటరాక్టివ్ వెబ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడంలో భాగమయ్యాడు. ఈ ప్రయత్నానికి గుర్తింపుగా రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్నాడు. పిల్లల విభాగంలో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఇది ఒకటి. ఇదే సమయంలో ఒంకార్ తన ప్రయాణాన్ని మరో దిశలోకి మళ్లించాడు. అది అంతరిక్ష రంగం. పాఠశాలలో చదువుతున్న సమయంలోనే చిన్న శాటిలైట్ వ్యవస్థపై పనిచేయడం ప్రారంభించాడు. ఈ ప్రాజెక్ట్ పేరు ఇన్‌క్యూబ్. పారడాక్స్ సోనిక్ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ పరిధిలో ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేశారు.

ఇన్‌క్యూబ్‌ను ఇండియాలో తొలి ఓపెన్ సోర్స్ శాటిలైట్‌గా చెబుతున్నారు. దీన్ని 1U క్యూబ్‌శాట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించారు. బరువు సుమారు ఒక కిలో. లైట్‌వెయిట్ శాటిలైట్ అంతరిక్షంలో పనిచేయగలదా? ఉష్ణోగ్రతకు సంబంధించిన డేటాను సేకరించగలదా? అన్న అంశాలపై ఈ ప్రాజెక్ట్‌లో ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడే ఒంకార్‌కు ఒక కీలక సమస్య ఎదురైంది. లో ఎర్త్ ఆర్బిట్‌లో తిరిగే శాటిలైట్ ఎప్పుడూ భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్‌ను చూడలేదు. శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొంత సమయం పాటు గ్రౌండ్ స్టేషన్ పరిధికి దూరంగా వెళ్తుంది. అప్పుడు కమ్యూనికేషన్ ఆగిపోవచ్చు. ఉదాహరణకు వరదలు, అడవుల్లో మంటలు, ఇతర విపత్తులను గమనించే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సేకరించిన కీలక డేటా వెంటనే భూమికి చేరకపోవచ్చు. ఇన్‌క్యూబ్‌పై పనిచేస్తున్న సమయంలో ఒంకార్ గుర్తించిన అసలు సమస్య ఇదే. ఒక శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపడం కంటే.. అది భూమితో నిరంతరం ఎలా కనెక్ట్ అయి ఉండాలన్న ప్రశ్న అతని తదుపరి ప్రయాణానికి కీలకంగా మారింది.

స్కూల్ చదువు కొనసాగుతుండగానే ఒంకార్ ఇంజినీరింగ్ విద్యార్థులకు బోధించే స్థాయికి చేరుకున్నాడు. IIT జమ్మూతో ఆయనకు అనుబంధం ఏర్పడింది. శాటిలైట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో గెస్ట్ ప్రాజెక్ట్ ఫెసిలిటేటర్, కోఆర్డినేటర్‌గా పని చేయడం మొదలు పెట్టాడు. IIT జమ్మూ ల్యాబ్‌లో రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ కూడా చేశాడు. అక్కడ ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియో, రియల్ టైమ్ ట్రాకింగ్ వంటి అంశాలపై పనిచేశాడు. తర్వాత CSIR–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో విజిటింగ్ రీసెర్చర్‌గా పనిచేశాడు. AI, స్పేస్, బయాలజీ రంగాలను కలిపి ఆలోచనలను పరిశీలించే హైబ్రిడ్ డెవలప్‌మెంట్ ల్యాబ్‌ను కూడా ప్రారంభించాడు.

జమ్మూ నుంచి అమెరికా వరకు ఒంకార్ ప్రయాణం మరో కీలక మలుపు తిరిగింది. అమెరికాకు వెళ్లి న్యూయార్క్‌లో హైస్కూల్ పూర్తి చేశాడు. కొంతకాలం పెన్ స్టేట్ యూనివర్సిటీలో చదివి.. తర్వాత కాలేజీ విద్యను వదిలి బే ఏరియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు అడుగులు వేశాడు. 2024లో పాలొ ఆల్టో కేంద్రంగా అపోలింక్ అనే స్పేస్‌టెక్ స్టార్టప్‌ను స్థాపించాడు. ఇన్‌క్యూబ్ సమయంలో గుర్తించిన కమ్యూనికేషన్ సమస్యకే ఇప్పుడు బిజినెస్ పరిష్కారం చూపాలని అపోలింక్ ప్రయత్నిస్తోంది. భూమికి కనిపించని సమయంలో కూడా లో ఎర్త్ ఆర్బిట్‌లోని శాటిలైట్లు కనెక్ట్ అయి ఉండేలా శాటిలైట్ రిలే నెట్‌వర్క్ నిర్మించడమే సంస్థ లక్ష్యం. రేడియో ఫ్రీక్వెన్సీ, ఆప్టికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీలను కలిపిన హైబ్రిడ్ ఆర్కిటెక్చర్‌పై సంస్థ పనిచేస్తోంది. ఇప్పటికే ఉన్న శాటిలైట్లలో ప్రత్యేక రిలే హార్డ్‌వేర్ అమర్చాల్సిన అవసరం లేకుండా వ్యవస్థను రూపొందించాలన్నది అపోలింక్ లక్ష్యం. 19 ఏళ్ల వయసులోనే 4.3 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ సాధించాడు. ఆ సమయంలో కంపెనీ విలువ 45 మిలియన్ డాలర్లుగా రిపోర్ట్ అయింది.

ఈ ఏడాది జూలై 7న కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ను ప్రయోగించారు. ఈ మిషన్‌లో పలు కస్టమర్ స్పేస్‌క్రాఫ్ట్‌లతో పాటు అపోలింక్ IPoS శాటిలైట్ కూడా ఉంది. ఇది కేవలం మరో శాటిలైట్ ప్రయోగం కాదు. ఏడేళ్ల వయసులో వెబ్‌సైట్ నిర్మించిన బాలుడి ఆలోచన.. 16 ఏళ్ల వయసులో శాటిలైట్ ప్రాజెక్ట్‌గా మారి.. 20 ఏళ్ల వయసులో నిజమైన ఆర్బిట్ మిషన్ వరకు చేరిన సక్సెస్ స్టోరీ. ఒక సమస్యను గుర్తించడం.. దాన్ని అర్థం చేసుకోవడం.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం.. చివరకు ఆ సమస్యకు మార్కెట్ స్థాయిలో పరిష్కారం చూపించడం.. ఈ నాలుగు దశలు అతని ప్రయాణంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. జమ్మూ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు అంతరిక్షంలో కొనసాగుతోంది.