మంకీ బ్రాంచింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఇదొక కొత్త రిలేషన్షిప్ ట్రెండ్. ప్రేమలో ఉన్న ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు మాత్రమే ఈ కథ మొదలవుతుందనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఇక్కడ మూడో వ్యక్తి రాకముందే ఒకరి మనసు పాత బంధం నుంచి నెమ్మదిగా బయటకు వెళ్లిపోతుంటుంది.
ఒక చెట్టుపై ఉన్న కొమ్మను వదిలే ముందు మరో కొమ్మను గట్టిగా పట్టుకునే కోతిని ఊహించుకోండి. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకే ముందు, కొత్త కొమ్మపై పట్టు దొరికిందని నిర్ధారించుకుంటుంది. ప్రేమ సంబంధాల్లో కూడా కొందరు ఇలాగే ప్రవర్తిస్తారు. పాత బంధాన్ని వదిలే ముందే కొత్త బంధాన్ని సిద్ధం చేసుకుంటారు. ఈ ప్రవర్తనకే మంకీ బ్రాంచింగ్ అని పేరు.
ఒకప్పుడు మీతో మాట్లాడకుండా రోజును ముగించలేని మనిషి, ఇప్పుడు మీతో మాట్లాడటానికి సమయం వెతుక్కుంటున్నారని అనుకుందాం. మీ మధ్య మాటలు తగ్గిపోతాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా దూరం పెరుగుతుంది. అదే సమయంలో వారి జీవితంలోకి మరో వ్యక్తి వస్తారు.
మొదట పరిచయం మాత్రమే. తర్వాత కాస్త స్నేహం. ఆపై రోజంతా ఎదురుచూసే సందేశాలు.. రాత్రి నిద్రపోయే ముందు చెప్పుకునే కబుర్లు.. చివరకు తమ మనసులోని బాధలను కూడా మీకంటే ఆ కొత్త వ్యక్తితోనే పంచుకోవడం మొదలవుతుంది. బయటకు చూస్తే పాత బంధం ఇంకా అలాగే ఉంటుంది కానీ లోపల మాత్రం కథ మారిపోయి ఉంటుంది. శరీరం ఒక సంబంధంలో ఉన్నా, మనసు మరో సంబంధంలో భవిష్యత్తును వెతుక్కుంటుంది. కొత్త వ్యక్తి తన జీవితంలో ఉంటాడనే నమ్మకం వచ్చిన రోజే పాత బంధానికి ముగింపు చెబుతారు. ఇంతకీ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? కొంతమందికి ప్రేమ కంటే ఒంటరితనం భయంకరంగా అనిపిస్తుంది. ఒక బంధం సంతోషాన్ని ఇవ్వకపోయినా దాన్ని వదిలే ధైర్యం ఉండదు. ఇంకోవైపు, కొత్త వ్యక్తి నుంచి లభించే శ్రద్ధ, ప్రశంసలు, ప్రేమ వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మరికొందరు విడిపోవడం వల్ల ఎదురయ్యే బాధ్యతను, గొడవలను ఎదుర్కోవడానికి ఇష్టపడరు.
అందుకే ఒక తలుపు మూసేలోపే మరో తలుపు తెరిచి ఉంచుకుంటారు. మరి మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉందని ఎలా తెలుసుకోవాలి? మీతో భావోద్వేగంగా దూరం పెంచుకుంటూ, ఫోన్ సంభాషణలను రహస్యంగా ఉంచుతూ, కొత్త వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారా? ఇవి కొన్ని సంకేతాలు కావచ్చు.
అయితే వీటిని మాత్రమే ఆధారంగా చేసుకుని ఎవరినీ తప్పుబట్టలేం. మంకీ బ్రాంచింగ్ అనేది వైద్యపరమైన మానసిక రుగ్మత కాదు. అయితే ఒకరితో ప్రేమలో ఉంటూనే, మరొకరితో రహస్యంగా భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకోవడం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. దీనికి ఎమోషనల్ చీటింగ్ అనే కోణం కూడా ఉంది. నిజానికి ప్రేమలో మనసు మారవచ్చు. ఒకరిపై ఉన్న ఇష్టం మరొకరిపై కలగవచ్చు. జీవితాంతం కలిసి ఉండలేమని కూడా అనిపించవచ్చు. ఇవన్నీ సహజమైన భావోద్వేగాలే.
అయితే మనతో ప్రయాణిస్తున్న వ్యక్తికి నిజం చెప్పకుండా, మన తర్వాతి ప్రయాణానికి మరో మనిషిని సిద్ధం చేసుకోవడమే సమస్య. ఒక బంధం ముగిసిందని చెప్పడానికి మరో మనిషి చేయి అవసరం లేదు. కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చినా నిజాయితీగా విడిపోవడమే మంచిది. ఎందుకంటే ప్రేమలో ఒకరిని కోల్పోవడం కంటే, మరొకరిని మన అవసరానికి ఉపయోగించుకోవడం ఇంకా ఎక్కువ బాధను మిగులుస్తుంది.

