ఒక చిన్నారి సరిగ్గా చదవలేకపోతున్నాడు. చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అతని ప్రవర్తనలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ పెరుగుతున్న వయసులో వచ్చే సాధారణ సమస్యలని అనుకుంటాం. కానీ మన చుట్టూ ఉండే కొన్ని వస్తువులు కూడా పిల్లల మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తాయని మీకు తెలుసా?
ఇంటి గోడలకు వేసే పెయింట్, మనం వంట చేసుకునే పాత్రలు, చివరికి మనం తినే కొన్ని మసాలా దినుసుల్లోనూ దాగి ఉండే సీసం అనే విషపదార్థం ఇందుకు కారణం కావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.
సీసం అంటే లెడ్. ఇది మనిషి శరీరంలోకి చేరినప్పుడు అనేక అవయవాలపై ప్రభావం చూపించే విషపదార్థం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న ప్రకారం, సీసం ప్రభావానికి గురికావడానికి సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదు. అంటే చాలా తక్కువ మోతాదులో శరీరంలోకి చేరినా ప్రమాదం ఉండవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 35 లక్షలకు పైగా మరణాలకు సీసం విషప్రభావం దోహదం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కోట్లాది మంది పిల్లలు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చిన్నతనంలో మెదడు, నాడీ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంటాయి. అలాంటి సమయంలో సీసం శరీరంలోకి చేరితే నేర్చుకునే సామర్థ్యం, ప్రవర్తన, ఎదుగుదల దెబ్బతినవచ్చు. ఈ ప్రభావాల్లో కొన్ని శాశ్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, శరీరంలో సీసం చేరిన వెంటనే స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. నష్టం జరుగుతున్న విషయం గుర్తించే సమయానికే పరిస్థితి తీవ్రంగా మారవచ్చు.
మరి ఈ సీసం మన శరీరంలోకి ఎలా చేరుతుంది? పాత పెయింట్లు ఊడిపోయినప్పుడు వెలువడే ధూళి ద్వారా, కలుషితమైన మసాలా దినుసుల ద్వారా, కొన్ని సౌందర్య ఉత్పత్తుల ద్వారా, సీసం కలిసిన వంట పాత్రల ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశించవచ్చు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పాత బ్యాటరీలు వంటి వ్యర్థాలను సరైన పద్ధతిలో రీసైకిల్ చేయకపోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
శరీరంలోకి చేరిన సీసం మెదడు, కాలేయం, మూత్రపిండాలు, ఎముకలకు చేరుతుంది. ఎముకలు, దంతాల్లో నిల్వ ఉండి కాలక్రమేణా పేరుకుపోవచ్చు. పెద్దల్లో ఇది గుండె సంబంధిత సమస్యలకు, మూత్రపిండాల వ్యాధులకు దోహదం చేయవచ్చు. శరీరంలో సీసం ఎంత ఉందో తెలుసుకోవడానికి రక్తంలో దాని స్థాయిని పరీక్షిస్తారు. అయితే ఈ ప్రమాదాన్ని నివారించే మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా ప్రపంచస్థాయి అంచనా ప్రకారం, సగానికి తక్కువ దేశాల్లోనే సీసం కలిగిన పెయింట్లపై చట్టబద్ధమైన నియంత్రణలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంటే ప్రమాదం గురించి తెలిసినా, దాన్ని అడ్డుకునే చర్యలు ఇంకా బలపడాల్సి ఉంది.
ఇక ప్రమాదాన్ని గుర్తించడం దగ్గరే ఆగిపోకుండా, అది మొదలయ్యే చోటే అడ్డుకోవాలి. ఉత్పత్తుల్లో సీసం వాడకాన్ని నియంత్రించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, పరిశ్రమల వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడం, ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరం.
2027లో సీసం ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రపంచస్థాయి కార్యాచరణ ప్రణాళికను ప్రపంచ ఆరోగ్య సభ ముందు ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే దేశాలకు మార్గదర్శకాలు అందించే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించనుంది. భారత్లోని ఐదు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో రక్తంలో సీసం స్థాయిని పరీక్షించే ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. సీసం విషప్రభావం వల్ల కలిగే నష్టాన్ని గుర్తించడం ముఖ్యం. కానీ అంతకంటే ముఖ్యం, ఆ నష్టం జరగకుండా చూడటం.
ఎందుకంటే ఒక చిన్నారి ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు అన్నీ అతని చుట్టూ ఉన్న వాతావరణంతో ముడిపడి ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల ఎదుగుదలను కాపాడాలంటే సీసం శరీరంలోకి చేరిన తర్వాత చికిత్స కోసం ఎదురుచూడటం కన్నా, అది చేరే దారులనే మూసివేయడం అత్యవసరం.

