Lancet Report: 22 లక్షల మరణాలకు కారణం ఇదే! లాన్సెట్ నివేదిక బయటపెట్టిన నిజం

Lancet

Lancet

భూమి నెమ్మదిగా వేడెక్కుతోంది. ఆ వేడి కేవలం చెట్లను, పంటలను, సముద్రాలను మాత్రమే ప్రభావితం చేయడం లేదు. మనుషుల ప్రాణాలను కూడా తీస్తోంది. పగలు మండే ఎండ, రాత్రి తగ్గని ఉక్కపోత, ఊపిరి పీల్చుకోనివ్వని కాలుష్యం, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న దోమలు.. ఇవన్నీ మనిషి ఆరోగ్యంపై దాడి చేస్తున్నాయి.

వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ఆరోగ్య ముప్పును లాన్సెట్ విడుదల చేసిన తాజా నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ కూడా ఉంది.

భారత్‌లో ఎండ తీవ్రత గతంతో పోలిస్తే చాలా పెరిగింది. 2016 నుంచి 2025 మధ్య మనం ఎదుర్కొన్న హీట్‌వేవ్ రోజుల్లో సగం రోజులు వాతావరణ మార్పుల వల్లే పెరిగాయని నివేదిక చెబుతోంది.

బయట నడిచినా, పనిచేసినా శరీరంపై వేడి ప్రభావం పడే సమయం సంవత్సరానికి 2,600 గంటలకు పైగా ఉంటోంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. దీంతో భారతీయులు సంవత్సరానికి సగటున 64 గంటల నిద్రను కోల్పోతున్నారు. మరోవైపు మనం పీల్చే గాలి కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతోంది. 2023లో భారత్‌లో PM2.5 వాయు కాలుష్యం కారణంగా సుమారు 22 లక్షల మరణాలు సంభవించినట్లు నివేదిక అంచనా వేసింది. వేడి పెరిగినప్పుడు ఈ కాలుష్యం ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. అంటే ఎండ ఒకవైపు శరీరాన్ని దెబ్బతీస్తుంటే, కాలుష్యం మరోవైపు ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. ఇక దోమల వల్ల వచ్చే వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది.

డెంగీ వ్యాప్తి చేసే దోమలకు అనుకూలమైన వాతావరణం విస్తరిస్తోంది. మలేరియా వ్యాప్తికి అనుకూలమైన కాలం కూడా గతంతో పోలిస్తే పెరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో కొన్ని ప్రమాదకర బ్యాక్టీరియాలు పెరగడానికి అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులు వ్యాధులు వ్యాపించే అవకాశాలను కూడా పెంచుతున్నాయి.

ఈ పరిస్థితి భారత్‌కే పరిమితం కాలేదు. 2023లో ప్రపంచవ్యాప్తంగా వేడి కారణంగా దాదాపు 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 71.5 శాతం మరణాలకు మానవుల వల్ల పెరిగిన వాతావరణ మార్పులే కారణమని నివేదిక అంచనా వేసింది. కరవులు, వేడిగాలుల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. ఆహార కొరతను ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా అదనంగా 12 కోట్ల 79 లక్షల మంది ఆహార అభద్రతను ఎదుర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రపంచ దేశాలు ఇప్పటికీ బొగ్గు, చమురు, గ్యాస్ లాంటి ఇంధనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో 80.7 శాతం వాటా వీటిదే. స్వచ్ఛమైన ఇంధన వినియోగం పెంచడం, ఆసుపత్రులను సిద్ధం చేయడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ఇప్పుడు అత్యవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

వాతావరణ మార్పులు అంటే కేవలం భూమి వేడెక్కడం మాత్రమే కాదు. అది మన నిద్రను దోచుకుంటోంది. మనం పీల్చే గాలిని విషపూరితం చేస్తోంది. మన ఆహారాన్ని ప్రభావితం చేస్తోంది. కొత్త వ్యాధులకు దారి తీస్తోంది. ప్రకృతిని మనిషి మార్చాడు. ఇప్పుడు ఆ మార్పుల ప్రభావాన్ని మనిషే తన శరీరంతో భరిస్తున్నాడు. ఈ ప్రమాదాన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తే, రాబోయే రోజుల్లో మనం చెల్లించాల్సిన మూల్యం మరింత ఎక్కువగా ఉంటుంది.