Kashmiri Pandits: టార్గెట్ కాశ్మీరీ పండిట్స్..ఉద్యోగాలు మానకపోతే చం*పేస్తాం!

Kashmiri Pandits

Kashmiri Pandits

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి పండిట్లపై ఉగ్రవాదులు కన్నెర్ర జేశారు. ఉద్యోగాలు వదిలి వెళ్లిపోవాలని… లేకపోతే ప్రాణాలు తీస్తామని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ బహిరంగంగా బెదిరిస్తోంది. ఏకంగా వారి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో లీక్ చేసి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. మళ్లీ 1990ల నాటి భయానక పరిస్థితులు కాశ్మీర్ లోయలో కనిపిస్తున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రశాంతంగా తమ జీవితాలను గడుపుతున్న కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు ఎందుకు టార్గెట్ చేశారు.

కాశ్మీర్ లోయలో నెత్తుటి వాసనలు మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. మైనారిటీలైన కాశ్మీరీ పండిట్లను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. లష్కరే తోయిబాకు చెందిన యునైటెడ్ లిబరేషన్ కౌన్సిల్ ఉగ్రవాద సంస్థ ఏకంగా 7000 మంది పండిట్లకు బెదిరింపు లేఖలు పంపింది. ప్రాణాలు నిలుపుకోవాలంటే తాము చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేసింది. పీఎం ప్యాకేజీ కింద ఉద్యోగాలు చేస్తున్న వారంతా వెంటనే తమ పనులకు రాజీనామా చేయాలని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పండిట్ల ఫోన్ నెంబర్లు, ఇళ్ల అడ్రస్ లు ఆన్లైన్లో లీక్ చేసి తీవ్రమైన భయాందోళనలు సృష్టిస్తున్నారు.

ఈ తరహా దాడులు.. బెదిరింపులు 1990 నాటి పరిస్థితులను కళ్లముందు ఉంచుతున్నాయి. అప్పట్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి నేరుగా గోడల మీద పోస్టర్లు అంటించి బెదిరించే వాళ్ళని బాధితులు చెబుతున్నారు. 2008లో 3000.. ఆ తర్వాత 2015లో మరో 3000 ఉద్యోగాలతో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం 6 వేల మందికి పైగా ఉద్యోగులు గత 15 ఏళ్లుగా లోయలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వం 6042 క్వార్టర్లు నిర్మించినా కేవలం 800 క్వార్టర్లను మాత్రమే ఉద్యోగులకు కేటాయించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే భద్రతాపరమైన చర్యలను చేపట్టాలని కాశ్మీరీ పండిట్లు డిమాండ్ చేస్తున్నారు. రాకేష్ హందూ అనే ఉద్యోగి ఏకంగా ప్రధాని మోడీకి, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. ఉగ్రవాదుల ముప్పు… కాశ్మీరీ పిండిట్లను బెదిరించడంపై జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర హోదాను ఆలస్యం చేసే కుట్ర ఇందులో ఉందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపిస్తుంటే… ఉగ్రవాదులకు ఆయన మద్దతు ఇస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

దశాబ్దాల క్రితం కాశ్మీరీ పండిట్లు… దారుణమైన మారణహోమాన్ని ఎదుర్కొన్నారు. 1989-90ల మధ్య అడ్డుఅదుపులేని ఉగ్రవాదుల చొరబాట్లతో స్థానికంగా ఉండే పండిట్లు నరకాన్ని చూశారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది తమ చారిత్రక వారసత్వాన్ని వదిలేసి… ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం మళ్లీ కాశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు రెచ్చగొట్టడంతో కాశ్మీర్ వ్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.