Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్‌ మాస్‌ వార్నింగ్!

Iran Vs America War Explained

Iran Vs America War Explained

Explainer: ఒక దేశం సరిహద్దు దగ్గర వేల తుపాకులు గురిపెట్టి ఉన్నాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. సముద్రంలో యుద్ధ నౌకలు కదులుతున్నాయి. క్షిపణులు నిమిషాల వ్యవధిలో దూసుకెళ్లే దూరంలో సిద్ధంగా ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇరాన్ నుంచి అమెరికాకు ఒక హెచ్చరిక పేలింది.

ఇరాన్ నేలపై అమెరికా సైనికుడి బూటు పడితే… ఆ బూటుతో పాటు ఆ సైనికుడి త*ల కూడా తెగిపడుతుందని ఇరాన్ ఆర్మీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ ప్రకటించాడు. సరిహద్దుల వెంట ఇరాన్ భూసేనలు పూర్తి యుద్ధ సన్నద్ధతలో ఉన్నాయని చెప్పాడు. శత్రువుల కదలికలను క్షణక్షణం గమనిస్తున్నామని, ప్రతి ముప్పుకు సమాధానం సిద్ధంగా ఉందని హెచ్చరించాడు. అతని మాటల్లోనే మంట కనిపిస్తోంది. ఆ మంట వెనక వేలాది సైనికులు, క్షిపణులు, డ్రోన్లు, ట్యాంకులు, రాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా ఒక్క అడుగు ముందుకు వేస్తే… పశ్చిమాసియా నేల మరోసారి అగ్నితో మండే ప్రమాదం కనిపిస్తోంది.

ఈ భయానికి మూలాలు 1979లోకి వెళ్తాయి. ఇరాన్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ సంబంధాలు ఒక్కసారిగా విషపూరితంగా మారాయి. ఇరాన్‌పై ఆంక్షలు మొదలయ్యాయి. ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ దేశాల గుండెల్లో మరో భయాన్ని నింపింది. చివరకు 2015లో అమెరికా సహా ప్రపంచ శక్తులు ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమంపై పరిమితులు అంగీకరించింది.

ప్రపంచం కొంత ఊపిరి పీల్చుకుంది. ఆ ఊపిరి ఎక్కువ కాలం నిలవలేదు. 2018 మే 8న డొనాల్డ్ ట్రంప్ అమెరికాను ఆ ఒప్పందం నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆంక్షలు మళ్లీ విరుచుకుపడ్డాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఉక్కుపాదం పడింది. ఇరాన్, అమెరికా మధ్య అనుమానాలు మరింత లోతుగా వెళ్లాయి. దౌత్యం వెనక్కి వెళ్లిన ప్రతి అడుగుతో యుద్ధం ముందుకు వచ్చింది.

2026 ఫిబ్రవరి 28కి చేరేసరికి ఆ మంట భారీ అగ్నిగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై భారీ సైనిక దాడులు ప్రారంభించాయి. క్షిపణులు ఇరాన్ ఆకాశాన్ని చీల్చాయి. డ్రోన్లు దూసుకెళ్లాయి. సైనిక స్థావరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. రాడార్ కేంద్రాలు, క్షిపణి వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు దాడుల పరిధిలోకి వచ్చాయి.

ఒక దాడి తర్వాత మరో దాడి… ఒక పేలుడు తర్వాత మరో పేలుడు… ఇరాన్ చుట్టూ యుద్ధపు వల బిగుస్తూ వచ్చింది. ఫిబ్రవరి 28న ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్టు ఇజ్రాయెల్ సీనియర్ అధికారి ప్రకటించడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఆ యుద్ధానికి అసలు గుండె హార్ముజ్ జలసంధి. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న ఈ ఇరుకైన సముద్ర మార్గం ప్రపంచ ఇంధన రక్తప్రసరణకు ప్రధాన నాళం.

ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. హార్ముజ్‌లో ఒక్క మార్గం మూసుకుపోయినా… ప్రభావం వేల కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. చమురు ధరలు మండిపోవచ్చు. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. రవాణా ఖర్చులు పెరగవచ్చు. ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టవచ్చు. అందుకే హార్ముజ్ ఇప్పుడు ఒక సముద్రపు దారి మాత్రమే కాదండి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు వెళ్లే మార్గం కూడా. ఆ మార్గాన్ని ఎవరు కంట్రోల్ చేస్తే… ప్రపంచం మొత్తం దాని ఒత్తిడిని అనుభవిస్తుంది.

జూన్ 15న కాల్పుల విరమణకు తాత్కాలిక మార్గం తెరుచుకుంది. యుద్ధం నుంచి చర్చల వైపు అడుగులు పడుతున్నాయన్న సంకేతాలు కనిపించాయి. హార్ముజ్ తెరుచుకుంటుందన్న ఆశ మొదలైంది. కొన్ని గంటలు, కొన్ని రోజులు ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. జూలైలో అమెరికా ఇరాన్‌పై ఆర్థిక, నౌకా ఒత్తిళ్లు పెంచింది. ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. యుద్ధం మళ్లీ నీడలా వెంటాడింది. చర్చల టేబుల్ మీద పేపర్లు కదులుతుంటే… సముద్రంలో నౌకలు కదిలాయి. సరిహద్దుల్లో సైనికులు కదిలారు. ప్రపంచం మళ్లీ ప్రమాదం వైపు చూసింది.

ఇప్పుడు అమెరికా వ్యూహం మరింత ప్రమాదకరమైన రూపం తీసుకుంది. బాంబులతో ఇరాన్‌ను నాశనం చేయడం కంటే… ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయాలని వాషింగ్టన్ చూస్తోంది. ఆగస్టు 9న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఉచ్చు బిగుస్తే చివరకు ఇరాన్ చర్చల టేబుల్ దగ్గరకు వస్తుందని ట్రంప్ లెక్కగట్టారు. ఈ మొత్తం పోరాటాన్ని ఆయన చెస్ ఆటతో పోల్చారు. ప్రతి కదలిక వెనక మరో కదలిక. ప్రతి నిర్ణయం వెనక మరో దాడి. ప్రతి నిశ్శబ్దం వెనక మరో వ్యూహం.

ఇరాన్ వైపు నుంచి వస్తున్న సమాధానం మాత్రం మరింత కఠినంగా ఉంది. విదేశాంగ మంత్రి అబ్బాస్ ప్రకారం అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. మధ్యవర్తుల ద్వారా మాత్రమే సందేశాలు వెళ్తున్నాయి. అమెరికా మధ్యంతర ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నంత కాలం చర్చలు తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదని ఇరాన్ చెబుతోంది. ఒమన్‌తో హార్ముజ్‌పై చర్చలు చివరి దశకు చేరుకున్నాయని చెబుతున్నా… సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకోవడానికి ఇరాన్ భారీ షరతులు పెట్టింది.

ఆంక్షలు తొలగించాలి. సైనిక ఒత్తిడి ఆపాలి. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి. ఇరాన్‌పై భవిష్యత్ దాడుల బెదిరింపులు నిలిపివేయాలి. జరిగిన దాడులకు పరిహారం ఇవ్వాలి. ఇరాన్, దాని మిత్రదేశాలపై సైనిక చర్యలు ఆపాలి. ఈ షరతుల చుట్టూ ఇప్పుడు చర్చలు తిరుగుతున్నాయి. ఒక్క షరతు విఫలమైనా హార్ముజ్ తలుపులు మళ్లీ బిగుసుకునే ప్రమాదం ఉంది. అంతలో ఇరాన్ జనరల్ చేసిన హెచ్చరిక ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా సైనికుడు ఇరాన్ నేలపై అడుగు పెడితే… ఇరాన్ భూసేనలు అతన్ని ఎదుర్కొంటాయని స్పష్టమైన సందేశం వెళ్లింది.

ఆ మాట వెనక ఒక సైన్యం నిలబడి ఉంది. ఆ సైన్యం వెనక క్షిపణులు ఉన్నాయి. క్షిపణుల వెనక మరో క్షిపణి వ్యవస్థ ఉంది. సముద్రంలో నౌకలు ఉన్నాయి. ఆకాశంలో యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రతి వైపు ఆయుధాలు సిద్ధంగా ఉన్నప్పుడు… ఒక్క తప్పు నిర్ణయం వేల ప్రాణాలను మింగే యుద్ధానికి నాంది పలకగలదు. మరి నెక్ట్స్‌ ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఒకవేళ అమెరికా సేనలు ఇరాన్ నేలపై అడుగుపెడితే మరో మారణహోమం తప్పదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పవచ్చు.