ఒక నగరాన్ని నాశనం చేయడానికి అణుబాంబే అవసరం లేదు. కొన్ని కిలోల పేలుడు పదార్థాలు, వాటితో పాటు కనిపించని రేడియోధార్మిక పదార్థాలు కలిస్తే చాలు. ఒక ప్రాంతమంతా భయంతో వణికిపోవచ్చు. మనుషులు ప్రాణాలు కోల్పోవచ్చు. మరికొన్ని ప్రాంతాలు నివసించడానికి కూడా ప్రమాదకరంగా మారవచ్చు. ఇలాంటి ఆయుధాన్నే డర్టీ బాంబ్ అంటారు.
ఇప్పుడు అమెరికా నిఘా వర్గాలను కలవరపెడుతున్నది ఇదే. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో డర్టీ బాంబ్ లేదా రసాయన ఆయుధాలతో దాడి చేసేందుకు ఇరాన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న అనుమానాలు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులను లక్ష్యంగా చేసుకునే అవకాశాలపై అమెరికా నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసినట్లు అక్కడి మీడియా కథనలు చెబుతున్నాయి. అయితే ఇరాన్ నిజంగానే దాడికి సిద్ధమైందా? అలాంటి దాడి చేసే సామర్థ్యం దానికి ఉందా? అసలు దాడి చేయాలనే నిర్ణయం తీసుకుందా? అనే విషయాలపై అమెరికా అధికారుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దాడి జరగబోతోందని నిర్ధారించే ఆధారాలు లేవు కానీ డర్టీ బాంబ్ చుట్టూ మాత్రం భయాలు నెలకొన్నాయి. సాధారణంగా మనం అణుబాంబు గురించి విన్నప్పుడు గుర్తొచ్చేది భారీ విధ్వంసం. కానీ డర్టీ బాంబ్ అలా పనిచేయదు. ఇందులో సాధారణ పేలుడు పదార్థాలతో పాటు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగిస్తారు.
పేలుడు జరిగినప్పుడు ఆ పదార్థాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపిస్తాయి. గాలి, నేల, భవనాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. డర్టీ బాంబ్ పేలుడులో విడుదలయ్యే రేడియేషన్ వల్ల కలిగే ప్రమాదం ఆ ప్రాంతాన్ని దీర్ఘకాలం ప్రభావితం చేయవచ్చు.
మరోవైపు రసాయన ఆయుధాల ముప్పు కూడా ఉంది. ఇవి మనుషుల శరీరంలోని జీవ ప్రక్రియలను దెబ్బతీసే విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తాయి. కొన్ని రసాయనాలు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తే, మరికొన్ని నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇంకొన్ని చర్మం, కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇక అమెరికా నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం ఇరాన్లో బాంబుల తయారీకి అవసరమైన కొన్ని పదార్థాలను నిల్వ చేసి ఉండవచ్చనే అనుమానాలున్నాయి. అయితే ఈ సమాచారంపై కూడా అధికారుల్లో ఏకాభిప్రాయం లేదు.
అమెరికాలో ఇప్పటికే రేడియోధార్మిక లేదా రసాయన పదార్థాలు చేరి ఉండవచ్చని, వాటిని ఉపయోగించేందుకు అక్కడే నివసిస్తున్న వ్యక్తులను ప్రేరేపించే అవకాశముందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ఈ ఆరోపణలను ఖండించింది. రసాయన ఆయుధాల వినియోగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ లెక్కన చూస్తే నిజంగా దాడి జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేని ప్రశ్నే. మరి చూడాలి నెక్ట్స్ ఏం జరగబోతుందో!

