రోజంతా ఉత్సాహంగా ఉండాలి.. నిద్ర రాకుండా పనిచేయాలి.. జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేయాలి. ఇందుకోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. ఇవి తాగిన వెంటనే శరీరంలో శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. అలసట తగ్గి చురుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఈ తాత్కాలిక ఉత్సాహం వెనుక గుండెకు సంబంధించిన ప్రమాదాలు దాగి ఉన్నాయా?
అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తుతోంది. కెఫీన్, ఇతర స్టిమ్యులెంట్లు అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్, సప్లిమెంట్ల వినియోగానికి గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ముఖ్యంగా 18 నుంచి 34 ఏళ్ల యువతలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించాయి. 2017 నుంచి 2025 మధ్య అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ భద్రతా డేటాబేస్‌లో నమోదైన 28,345 ఆరోగ్య సమస్యల నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. వీటిలో 854 నివేదికలు కెఫీన్ లేదా ఇతర స్టిమ్యులెంట్లు ఉన్న ఎనర్జీ డ్రింక్స్, సప్లిమెంట్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఈ నివేదికల్లో సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే కెఫీన్, స్టిమ్యులెంట్లు ఉన్న ఉత్పత్తుల వినియోగంతో గుండె ఆగిపోయిన ఘటనలు దాదాపు 11 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. గుండెపోటు ఘటనలు 4.5 రెట్లు ఎక్కువగా కనిపించాయి. గుండె లయలో అసాధారణ మార్పులు, గుండె దడ లాంటి సమస్యలు నాలుగు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. గుండె వేగం పెరగడం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా కనిపించింది. ఛాతినొప్పి, స్పృహ కోల్పోవడం లాంటి సమస్యలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఉత్పత్తులకు సంబంధించిన గుండె సమస్యల నివేదికల్లో దాదాపు 45 శాతం 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారివే. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఇలాంటి ధోరణి కనిపించింది. ఇక్కడ అసలు సమస్య కెఫీన్ పరిమాణం.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2026 ప్రకటన ప్రకారం, చాలామంది ఆరోగ్యవంతమైన పెద్దలు రోజుకు 400 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవడం సాధారణంగా సురక్షితమే. కానీ కొన్ని ఎనర్జీ డ్రింక్స్‌లో సాధారణ కాఫీ కంటే ఒక్కో పరిమాణంలోనే మూడు రెట్లు ఎక్కువ కెఫీన్ ఉండవచ్చు. కొన్ని ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లలో ఈ పరిమాణం 12 రెట్లకు మించి ఉండవచ్చు. యువతలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించడానికి కారణాలు ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. తరచుగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం, తీవ్రమైన వ్యాయామానికి ముందు వీటిని తీసుకోవడం, మద్యంతో లేదా ఇతర మత్తు పదార్థాలతో కలిపి వాడటం, ముందుగా గుర్తించని గుండె సమస్యలు ఉండటం వంటి అంశాలు కారణమై ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ పరిశోధన ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే గుండెపోటు లేదా గుండె ఆగిపోతుందని నిరూపించలేదు. ఇది కేవలం ఈ ఉత్పత్తుల వినియోగానికి, గుండె సమస్యల నివేదికలకు మధ్య కనిపించిన సంబంధాన్ని మాత్రమే సూచిస్తోంది. పైగా ఈ అధ్యయనం స్వచ్ఛందంగా నమోదైన ఫిర్యాదులపై ఆధారపడింది.
కాబట్టి అసలు ప్రమాదం ఎంత ఉందో కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయినా కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. తక్షణ ఉత్సాహం కోసం తీసుకునే ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్ ఎంత ఉందో తెలుసుకోకుండా అలవాటుగా తాగడం మంచిది కాదు. ముఖ్యంగా గుండె దడ, ఛాతినొప్పి లేదా తల తిరిగి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

