El Nino effect on Farmers Explained: ప్రకృతి పగబడుతోంది.. ఆకాశం ముఖం చాటేస్తోంది. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అశనిపాతంలా ఎల్‌నినో ముంచుకొస్తోంది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం ఒకవైపు… సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరోవైపు… వెరసి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. వానలు పడకపోతే రైతులకే కాదు… పప్పులు, నూనెల ధరలు పెరిగి సామాన్యుల జేబులకు కూడా భారీ చిల్లు పడటం ఖాయం. ఎల్‌నినో ఎఫెక్ట్ ఈ ఏడాది ఎవరూ ఊహించని స్థాయిలో ఉండబోతోంది. పంటల సాగు, దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతాపం తీవ్రంగా ఉంబోతోంది.
ఎల్‌నినో రైతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికే మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాల సమయంలో ఇది మరింత బలపడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఆశించిన స్థాయిలో ఈసారి వర్షాలు పడే అవకాశాలు ఏమాత్రం లేకపోవడం దేశవ్యాప్తంగా రైతన్న ఆశలపై నీళ్లు చల్లింది. కేరళ తీరాన్ని సాధారణం కంటే మూడు రోజులు ఆలస్యంగా తాకిన రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా విస్తరించడంలో బాగా నెమ్మదిస్తున్నాయి. ప్రధానంగా వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చెరకు వంటి కీలక పంటలు వేసే సమయంలో వానలు తగ్గడం ఖరీఫ్ సీజన్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.
ఎల్‌నినో ఏర్పడితే ఖరీఫ్ పంటల దిగుమతి తగ్గుతుందా?
చరిత్రను గమనిస్తే… బలమైన ఎల్‌నినో ఏర్పడిన ప్రతిసారీ వానలు ముఖం చాటేయడం, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం పరిపాటిగా వస్తోంది. ఈ దెబ్బతో కీలకమైన ఖరీఫ్ పంటలు… ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడి భారీగా పడిపోతుంది. వాతావరణాన్ని చల్లబరిచి ఎల్ నినో ప్రభావాన్ని కాస్త తగ్గించే ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. హిందూ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ఏర్పడే ఈ ఐఓడీ… ప్రస్తుతం తటస్థంగా ఉంది. రాబోయే నాలుగు నెలల రుతుపవనాల సీజన్ అంతా ఇది తటస్థంగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. వర్షాలు ఎక్కడ పడతాయో… ఎక్కడ పడవో చెప్పలేని గందరగోళం వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతోంది.
వర్షాలు రాకపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశతో తమ సాగు ప్రణాళికలు మార్చుకుంటున్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే అధిక విలువ కలిగిన పంటల వైపు వెళ్లకుండా… తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెడుతున్నారు. సోయాబీన్, కంది, మినప, పత్తి లాంటి పంటలు వేస్తే నీటి ఎద్దడి వల్ల ఎండిపోతాయని భయపడుతున్నారు. అందుకే సజ్జలు, జొన్నలు, పెసలు లాంటి తక్కువ నీటిని తీసుకునే పంటల వైపు మళ్లుతున్నారు. ఈ ప్రత్యామ్నాయ పంటలకు నీరు తక్కువే పట్టినా… వీటి ద్వారా రైతులకు వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వ్యవసాయ రంగాన్ని మాత్రమే నమ్ముకుని జీవిస్తున్న కోట్ల మంది రైతుల కుటుంబ ఆదాయానికి కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది.
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఎల్‌నినో పూర్తిగా మార్చేయబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కరవు పరిస్థితుల వల్ల వ్యవసాయ జీడీపీ వృద్ధి రేటు దాదాపుగా సున్నాకి పడిపోవచ్చని.. కొన్ని ప్రాంతాల్లో వృద్ధి రేటు మైనస్ లోకి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. దిగుబడులు తగ్గితే మార్కెట్లో కూరగాయలు, వంట నూనెల కొరత ఏర్పడి… ద్రవ్యోల్బణం అమాంతం పెరిగిపోతుంది. అక్టోబర్.. నవంబర్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం 5 శాతం దాటుతుందని… రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 6 శాతాన్ని తాకుతుందని చెబుతున్నారు. పొలం దున్నే ట్రాక్టర్ల డీజిల్ రేట్లు, ఎరువులు, పురుగుల మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం రైతుల కష్టాలను మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారుస్తున్నాయి.
ఎల్‌నినో తీసుకొచ్చే ముప్పు కేవలం వ్యవసాయానికే పరిమితం కాబోదు, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలంగా కుదిపేస్తుంది. రైతుల చేతిలో డబ్బులు లేకపోతే… వాళ్ళ కొనుగోలు శక్తి పాతాళానికి పడిపోతుంది. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, బట్టలు, రోజువారీ వినియోగ వస్తువుల అమ్మకాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో కుదేలవుతాయి. దేశంలోని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అమ్మకాల్లో 30 నుంచి 40 శాతం వాటా పల్లెలదే ఉంటుంది. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే… అది పారిశ్రామిక రంగాన్ని సంక్షోభంలో పడేస్తుంది. సరైన సమయంలో వర్షాలు పడకపోతే ప్రభుత్వాలు ముందుచూపుతో ఆదుకోకపోతే… రాబోయే రోజుల్లో దేశమంతటా పెను ఆర్థిక సంక్షోభం తప్పదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

