Egg: గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?

Eggs Prices Hike

Eggs Prices Hike

ఒకప్పుడు ఐదు రూపాయలకు దొరికిన కోడిగుడ్డు ఇప్పుడు తొమ్మిది రూపాయలకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు మార్కెట్లలో గుడ్డు ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర 9రూపాయల వరకు పలుకుతోంది. అంటే డజను గుడ్లు కొనాలంటే 108 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

అయితే రానున్న వారాల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గుడ్డు ధర ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి సమాధానం వెతకాలంటే ముందుగా కోళ్ల దాణా మార్కెట్‌ను పరిశీలించాలి.

పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు ఇచ్చే ఆహారంలో మొక్కజొన్న, సోయాబీన్, ఇతర ధాన్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ధరలు భారీగా పెరిగాయి. గత ఏడాది కిలో మొక్కజొన్న ధర సుమారు 18రూపాయలు ఉండగా ఇప్పుడు 34రూపాయలకు చేరింది. బ్రోకెన్ రైస్ ధర కూడా కిలో 14 రూపాయల నుంచి 32రూపాయలకు పెరిగింది.

ఈ పెరుగుదలకు వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ప్రధాన కారణాలు. ముఖ్యంగా మొక్కజొన్న వినియోగంలో ఇథనాల్ పరిశ్రమ ప్రభావం పెరుగుతోంది. పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ తయారీకి మొక్కజొన్నను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు అందుబాటులో ఉండే మొక్కజొన్నపై డిమాండ్ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రధాన మొక్కజొన్న పండించే రాష్ట్రాల్లో వర్షపాతం లోటు కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ మొక్కజొన్న ఉత్పత్తి 15 నుంచి 16 శాతం తగ్గవచ్చని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి.

దీనికి తోడు మార్కెట్‌లో ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాలతో కొంతమంది వ్యాపారులు నిల్వలు ఉంచుకోవడం కూడా సరఫరాపై ఒత్తిడి పెంచుతోంది. దీని ప్రభావం నేరుగా కోళ్ల పెంపకంపై పడుతోంది. దాణా ఖర్చులు పెరిగితే ఒక్కో గుడ్డును ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయం కూడా పెరుగుతుంది. రైతులు ఆ భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కాకపోవడంతో గుడ్ల అమ్మకపు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఇక రెండో అంశం డిమాండ్. సాధారణంగా డిసెంబర్, జనవరి నెలలు పౌల్ట్రీ పరిశ్రమకు అత్యధిక వినియోగం ఉండే కాలం. చలికాలంతో పాటు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, బేకరీ ఉత్పత్తుల వినియోగం పెరగడం వల్ల గుడ్లకు డిమాండ్ ఎక్కువవుతుంది. ఇక్కడ మరో కీలకమైన పరిణామం కూడా ఉంది. ఉత్పత్తి ఖర్చులు భరించలేక కొంతమంది రైతులు కోళ్ల పెంపకంలో మార్పులు చేయడం, ముందుగానే కోళ్లను విక్రయించడం వల్ల రాబోయే నెలల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ పరిణామాలు చూస్తే డిసెంబర్ నాటికి గుడ్లు, చికెన్ ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే ఇది ఒక పరిశ్రమ అంచనా మాత్రమే. మొత్తానికి గుడ్డు ధరల పెరుగుదల వెనుక కేవలం చలికాలపు డిమాండ్ మాత్రమే లేదని అర్థమవుతుంది. వ్యవసాయ దిగుబడులు, ఇథనాల్ తయారీకి పెరిగిన మొక్కజొన్న వినియోగం, దాణా ధరలు, పౌల్ట్రీ రైతుల ఉత్పత్తి వ్యయాలు.. ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని చెప్పవచ్చు.