Explained: ఇది ఒక అమ్మానాన్న కథ… ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందినా.. దారుణంగా మోసపోయిన అమ్మానాన్న కథ. తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలు తమ వాళ్లు కారని తెలిసి కుమిలిపోతున్న అమ్మానాన్న కథ…! సంతానం కోసం ఆశపడే దంపతులకు ఐవీఎఫ్ ఒక వరం… కానీ అదే ఐవీఎఫ్ ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఐవీఎఫ్ పేరుతో సాగుతున్న చీకటి దందాలో కొత్త కోణం ఇది. అసలు ఆస్పత్రుల్లో ఏం జరుగుతోంది…? ఢిల్లీలో ఈ జంటకు ఎదురైన అనుభవం…మిగతా వాళ్లకు కూడా ఎదురైతే?
గుర్గావ్‌లో ఏం జరిగింది?
గుర్గావ్ ప్రాంతంలో రాహుల్ రాథోడ్.. మీను దంపతులు నివాసం ఉంటున్నారు. రాహుల్ వయసు 41 ఏళ్లు… మీను వయసు 39 ఏళ్లు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే 2024లో వారు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మరోసారి తల్లిదండ్రులు కావాలని నిర్ణయించుకున్నారు. తమ గైనకాలజిస్ట్ సూచనతో ఢిల్లీ గ్రేటర్ కైలాష్‌లోని ఎస్సీఐ ఐవీఎఫ్ ఆసుపత్రిని ఆశ్రయించారు.
2025 జనవరి 9న వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. అదే ఏడాది మే 14న ఐదు ఆరోగ్యకరమైన పిండాలు వృద్ధి చెందాయని వైద్యులు శుభవార్త చెప్పారు. అదే రోజు అందులో మూడు పిండాలను మీను గర్భంలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది జనవరి 5న మీను కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లల ముఖకవళికలు తమతో ఏమాత్రం కలవకపోవడంతో ఆ దంపతుల్లో అనుమానం మొదలైంది.
అనుమానం నివృత్తి చేసుకునేందుకు ఆ దంపతులు డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలనకుంటే ఆస్పత్రి యాజమాన్యం అడ్డుకుంది. దీంతో అనుమానాలు పెరిగాయి. ఆ ఆస్పత్రితో సంబంధం లేకుండా వారు రెండు వేర్వేరు డీఎన్ఏ ఏజెన్సీలకు శాంపిల్స్ పంపారు. జనవరి 10, 14 తేదీల్లో వచ్చిన ఫలితాలు వారిని నివ్వెరపోయేలా చేశాయి. ఆ కవలలు రాహుల్, మీను దంపతులకు బయాలజికల్‌గా పుట్టలేదని తేలింది. ఎవరో గుర్తుతెలియని దాతల పిండాలతో ఆ పిల్లలు జన్మించారని రిపోర్టులు స్పష్టం చేశాయి.
తొమ్మిది నెలలు కడుపులో మోసిన పసివాళ్లు ఎవరి పిల్లలు అంటూ మీను కన్నీరుమున్నీరు అవుతోంది. ఆసుపత్రి వాదన మాత్రం మరోలా ఉంది. దంపతుల జన్యు పదార్థం పనికిరాకపోవడంతో.. అజ్ఞాత దాతల పిండాలను ఉపయోగించేందుకు 2025 మే 14న వారు రాతపూర్వక అంగీకారం తెలిపారని ఆసుపత్రి చెబుతోంది. కానీ అనస్థీషియా మత్తులో ఉన్న సమయంలో తన చేత సంతకాలు చేయించారని మీను ఆరోపిస్తోంది. ఆ అంగీకార పత్రం కనీసం నోటరీ చేయలేదని రాహుల్ వాదిస్తున్నాడు.
చైల్డ్ ట్రాఫికింగ్ కుట్ర ఉందా?
మోసపోయామని గ్రహించిన దంపతులు న్యాయపోరాటానికి దిగారు. జనవరి 17న పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మార్చిలో కోర్టును ఆశ్రయించారు. ఆసుపత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మార్చి 23న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. ఫోర్జరీ, నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా.. ఫిర్యాదుదారుల అసలు పిల్లలు కిడ్నాప్‌కు గురయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీని వెనుక చైల్డ్ ట్రాఫికింగ్ కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాలని సూచించింది.
ఆసుపత్రి వేసిన రివిజన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. గత నెలలో ఆసుపత్రిపై చీటింగ్ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజం తెలుసుకోవడం కోసం ఆ దంపతులు పనులన్నీ మానుకుని పోరాడుతూనే ఉన్నారు. అన్యాయం జరిగినా… ఆ కవల పిల్లలను మాత్రం వారు అనాథలను చేయలేదు.
సహజంగా గర్భం దాల్చలేని పరిస్థుల్లోనే దంపతులు IVF వంటి వైద్య విధానాలను ఆశ్రయిస్తారు. ఇందులో నమ్మకం చాలా ముఖ్యం. ఇందులో నమ్మకంతో పాటు పారదర్శకంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఇలా చేయడంలో ఆస్పత్రి యాజమాన్యం ఘోరంగా విఫలమైంది. చివరి నిమిషంలో ఏవో సంతకాలు పెట్టించుకోని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది.

