Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?

Charles Darwin On The Origon Of Species

Charles Darwin On The Origon Of Species

నవంబర్ 24, 1859. మానవుడు తన గురించి తాను నిర్మించుకున్న అహంకారపు సామ్రాజ్యానికి పునాదులు కదిలిన రోజు. ప్రకృతిపై మనిషి నిర్మించుకున్న ఆధిపత్య భావనకు, జీవ సృష్టి గురించి శతాబ్దాలుగా పాతుకుపోయిన విశ్వాసాలకు శాస్త్రీయ సవాలు ఎదురైన రోజు. జీవుల పుట్టుక వెనుక ఉన్న ప్రకృతి రహస్యాలను, వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాలను, కోట్లాది సంవత్సరాల పరిణామ చరిత్రను ఆధారాలతో ఆవిష్కరిస్తూ చార్లెస్ డార్విన్ ప్రచురించిన ‘On the Origin of Species’ ప్రపంచం ముందుకొచ్చింది. 167ఏళ్ల క్రితం ప్రచురితమైన ఈ పుస్తకం.. జీవ ప్రపంచం గురించి మానవుడు నిర్మించుకున్న ఆలోచనా పునాదులనే కదిలించింది.

అప్పటివరకు ప్రబలంగా ఉన్న విశ్వాసాల ప్రకారం భూమిపై ప్రతి జీవి దేవుడి సృష్టిలో భాగం. ప్రతి జీవికి ఒక నిర్దిష్ట రూపం, ఒక నిర్దిష్ట స్థానం ఉన్నాయని, సృష్టి ఆరంభం నుంచి జీవరాశులు అదే రూపాల్లో కొనసాగుతున్నాయని మెజారిటీ సమాజం భావించేది.

ముఖ్యంగా మనిషిని మిగతా జీవరాశుల నుంచి వేరుచేసి, ప్రకృతిపై ఆధిపత్యం కలిగిన ప్రత్యేక సృష్టిగా పరిగణించేది. ఈ భావన మతపరమైన విశ్వాసాల్లోనే కాకుండా అప్పటి సామాజిక, తాత్విక ఆలోచనల్లోనూ బలంగా పాతుకుపోయింది. 1831లో HMS Beagle నౌకలో ప్రారంభమైన ప్రపంచ యాత్ర.. డార్విన్‌ను దక్షిణ అమెరికా తీరాలకు, అక్కడి అడవులకు, అంతరించిపోయిన జీవుల శిలాజాల దగ్గరకు, చివరికి పసిఫిక్ మహాసముద్రంలోని గాలాపగోస్ దీవులకు చేర్చింది. 1835లో ఆ దీవుల్లో ఆయన గమనించిన జీవ వైవిధ్యం ఒక కీలకమైన అన్వేషణకు దారితీసింది. ఒక దీవిలో కనిపించే జీవులు మరో దీవిలోని జీవుల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ, వాటి మధ్య ఆశ్చర్యకరమైన పోలికలు ఉండటం ఆయనను ఆలోచింపజేసింది.

వేర్వేరు దీవుల్లో కనిపించిన ఫించ్ పక్షుల ముక్కుల ఆకారాల్లో తేడాలున్నాయి. వాటి ఆహారపు అలవాట్లు, నివాస పరిస్థితులకు అనుగుణంగా ఆ తేడాలు కనిపించాయి. కొన్ని పక్షుల ముక్కులు గట్టి విత్తనాలను పగలగొట్టడానికి అనువుగా ఉంటే, మరికొన్ని చిన్న కీటకాలను పట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. జీవుల రూపాల్లోని ఈ వైవిధ్యం వెనుక ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా తరతరాలుగా జరిగిన మార్పులు ఉండవచ్చనే ఆలోచనకు ఈ పరిశీలనలు బీజం వేశాయి.

ఇక్కడి నుంచి డార్విన్ అన్వేషణ మరింత విస్తరించింది. శిలాజాలు, జీవుల శరీర నిర్మాణాల్లోని పోలికలు, భౌగోళిక ప్రాంతాలను బట్టి కనిపించే జీవ వైవిధ్యం.. వీటన్నింటినీ పరిశీలిస్తూ జీవరాశుల మధ్య ఉన్న సంబంధాలను అన్వేషించాడు. ఆ పరిశీలనలన్నీ ఒకే గొప్ప ఆలోచనవైపు దారితీశాయి. భూమిపై జీవులన్నీ వేర్వేరుగా, శాశ్వతమైన రూపాల్లో సృష్టించబడినవి కావు. కాలంతో పాటు మార్పులకు లోనవుతూ, ఉమ్మడి పూర్వీకుల నుంచి విభిన్న జీవ జాతులుగా పరిణామం చెందాయి.

ఆ పరిణామానికి కీలకమైన ప్రక్రియ Natural Selection. ఒక జీవ సమూహంలో సహజంగా కనిపించే వారసత్వ వైవిధ్యాల్లో కొన్ని లక్షణాలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన జీవులు ఎక్కువగా సంతానాన్ని ఉత్పత్తి చేయగలిగితే, ఆ లక్షణాలు తరతరాలుగా ఆ జనాభాలో పెరుగుతాయి.

ఇలా అనేక తరాల పాటు జరిగే మార్పులు జీవ జాతుల పరిణామానికి దారితీస్తాయి. మనుషులు కూడా అలా పరిణామం చెందినట్టు డార్విన్‌ తేల్చడం అప్పటి మత పెద్దలకు ఏ మాత్రం నచ్చలేదు. నిజానికి మనుషులు, చింపాంజీలు లక్షల సంవత్సరాల క్రితం జీవించిన ఉమ్మడి పూర్వీకుల నుంచి వేర్వేరు పరిణామ మార్గాల్లో అభివృద్ధి చెందారు. అయినా నేటికీ తోటి మనుషులను కోతులతో పోలుస్తూ అవమానించే అహంకారం మానవుల్లో కనిపిస్తూనే ఉంది. పరిణామ చరిత్రలో తాము కూడా భాగమనే వాస్తవాన్ని గుర్తించలేని మానవుడి నైజం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ లెక్కన చూస్తే డార్విన్ పుస్తకం ప్రకృతిని చూసే దృక్పథాన్నే మార్చేసింది.

కోట్లాది సంవత్సరాల పరిణామ ప్రయాణంలో ప్రతి జీవరాశికీ ఒక చరిత్ర ఉందని, రూపాల్లోని వైవిధ్యం వెనుక జీవుల మధ్య లోతైన సంబంధాలున్నాయని నిరూపించింది. ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనే మానవ అహంకారానికి బదులుగా, ప్రకృతిలో తన స్థానాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. తనను తాను సృష్టికి కేంద్రంగా భావించిన మనిషిని, అదే ప్రకృతి పరిణామ చరిత్రలో ఒక భాగంగా నిలబెట్టింది. 167 ఏళ్ల క్రితం ప్రచురితమైన ఆ పుస్తకం సృష్టించిన అసలైన శాస్త్రీయ విప్లవం ఇదే.