Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Britain Teenager Murder Explained: బ్రిటన్ అట్టుడుకుతోంది… వీధుల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు… హింసాత్మక ఘటనలే కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క హత్య… బ్రిటన్ సమాజాన్ని నిలువునా చీల్చేసింది. వలసదారులపై స్థానికుల్లో ఉన్న కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఒక టీనేజర్ ప్రాణాలు కోల్పోతే.. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో బ్రిటన్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. అసలు సౌతాంప్టన్ వీధుల్లో ఆ రోజు ఏం జరిగింది? ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేసిన నేరం బ్రిటన్ను ఎందుకు తగలబెడుతోంది?
సౌతాంప్టన్‌లో ఏం జరిగింది?
చలికాలం రాత్రి సమయం.. సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ తన స్నేహితులతో గడిపి ఒంటరిగా ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో అతనికి విక్రమ్ దిగ్వా అనే వ్యక్తి ఎదురయ్యాడు. విక్రమ్ దగ్గర సిక్కుల సంప్రదాయ కత్తులు ఉన్నాయి. వాటిని గమనించిన హెన్రీ తన ఫోన్ తో వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్తా ప్రాణాలు తీసే స్థాయికి చేరింది. హెన్రీ ఛాతీపై విక్రమ్ నాలుగుసార్లు కత్తితో దారుణంగా పొడిచాడు. రక్తపు మడుగులో పడిపోయిన హెన్రీ.. అక్కడికి వచ్చిన పోలీసులతో నన్ను కత్తితో పొడిచారు.. నాకు ఊపిరి ఆడటం లేదని పదేపదే మొరపెట్టుకున్నాడు. కానీ పోలీసులు అతన్ని బాధితుడిగా చూడలేదు. అనుమానితుడిగా భావించి చేతులకు బేడీలు వేశారు.
అతని బాధను పట్టించుకోకుండా వెటకారంగా మాట్లాడారు. నిమిషాల వ్యవధిలో హెన్రీ ప్రాణాలు విడిచాడు. ఇటీవలే కోర్టులో ఈ దారుణమైన నిజాలు బయటకు వచ్చాయి. భారతీయ సిక్కు నేపథ్యం ఉన్న 23 ఏళ్ల విక్రమ్ దిగ్వాకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసుల అమానవీయ తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ 'షాక్' అస్త్రం!
- Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
- Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
బ్రిటన్‌లో సిక్కులపై విద్వేషం ఎందుకు పెరిగింది?
ఈ హత్యతో బ్రిటన్‌లోని సాధారణ సిక్కులపై విద్వేషాలు పెరిగాయి. విక్రమ్‌కు శిక్ష పడిన కొద్ది రోజులకే స్థానిక గురుద్వారాకు చెందిన ఒక సిక్కు మత గురువుపై కొందరు దాడి చేశారు. జాతి వివక్షతో దూషించారు. ప్రతీకార దాడుల భయంతో వృద్ధులు.. సాధారణ సిక్కులు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో నైజెల్ ఫరాజ్ లాంటి మితవాద రాజకీయ నేతలు ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బ్రిటన్ లో టూ-టైర్ పోలీసింగ్ నడుస్తోందని ఆరోపించారు. అంటే మతం.. జాతి.. రాజకీయాలను బట్టి పోలీసులు వేర్వేరు ప్రమాణాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలపై నమ్మకం కోల్పోయిన చాలామంది బ్రిటీష్ ప్రజలకు ఈ వాదనలు బలంగా నాటుకుపోయాయి. యూరప్.. అమెరికా అంతటా వలస వ్యతిరేక ఉద్యమాలకు ఇలాంటి భావోద్వేగాలే పునాదిగా మారుతున్నాయి.
హెన్రీ నోవాక్ ఘటన అమెరికాలోని జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని గుర్తుచేస్తోంది. ఫ్లాయిడ్ కూడా చనిపోయే ముందు నాకు ఊపిరి ఆడటం లేదు అని పోలీసులతో వేడుకున్నాడు. ఈ సారూప్యాలను ఎత్తిచూపుతూ అమెరికా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. బ్రిటన్ పోలీసుల తీరును తప్పుబట్టారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ హత్యను వలసదారుల సామూహిక దండయాత్రతో ముడిపెట్టారు. అధికారులు ఏమాత్రం కనికరం చూపకుండా బేడీలు వేయడం వల్లే ఓ యువకుడి ప్రాణం గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. మరోవైపు ఎలన్ మస్క్ కూడా బ్రిటన్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. జార్జ్ ఫ్లాయిడ్ ఘటనకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ హత్యకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో ఒక సాధారణ స్థానిక నేరం కాస్తా అంతర్జాతీయ వివాదంగా మారిపోయింది.
వాస్తవానికి నిందితుడు విక్రమ్ దిగ్వా కొత్తగా వచ్చిన వలసదారుడు కాడు. అతడు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగాడు. అయినా సరే ఆధునిక మితవాద పార్టీలు వలసల సమస్యను ప్రధాన రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నాయి. పశ్చిమ దేశాల పాలకులు సాధారణ ప్రజల భద్రత.. జాతీయ భావాలను గాలికొదిలేశారని వారు వాదిస్తున్నారు. ఈ విమర్శలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం దీటుగా బదులిచ్చింది. ఒక కుటుంబ విషాదాన్ని వాడుకుని బ్రిటన్ సమాజాన్ని విభజించడానికి బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడింది. అమెరికా తరహా విద్వేష రాజకీయాలను తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పింది. అయితే పెరుగుతున్న వలసల వల్ల స్థానికుల్లో నెలకొన్న ఆందోళనలను మాత్రం స్టార్మర్ ప్రభుత్వం తక్కువ అంచనా వేయలేకపోతోంది. చట్టబద్ధమైన ఆందోళనలను పట్టించుకోకపోతే ఇలాంటి అల్లర్లే పునరావృతం అవుతాయి.
ఇది కేవలం బ్రిటన్‌కు పరిమితమైన సమస్య కాదు. యూరప్ అంతటా వలస వ్యతిరేక సెగలు రగులుతున్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో సరిహద్దుల నియంత్రణపై ప్రభుత్వాలు విఫలం అయ్యాయన్న వాదనలు బలపడుతున్నాయి. మొన్నటికి మొన్న సౌత్ పోర్ట్ లో ముగ్గురు చిన్నారుల హత్య తర్వాత బ్రిటన్ అల్లకల్లోలం అయింది. ఆ తర్వాత బెల్ఫాస్ట్ లో ఓ స్థానిక యువకుడిపై దాడి జరగడంతో కార్లు, ఇళ్లకు నిప్పుపెట్టారు. జర్మనీలో కూడా వలసదారుల దాడుల తర్వాత ఇమ్మిగ్రేషన్ అతిపెద్ద రాజకీయ వివాదంగా మారింది. అమెరికాలోని ట్రంప్ అనుకూల వర్గాలు ఉద్దేశపూర్వకంగానే యూరప్‌లోని ఇలాంటి వలస వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తున్నాయని పలువురు అనుమానిస్తున్నారు.
మొత్తానికి ఒక వీధిలో జరిగిన దారుణ హత్య కేవలం నేరంగా మిగిలిపోలేదు. పాశ్చాత్య దేశాల భవిష్యత్తును.. విధానాలను ప్రశ్నించే సైద్ధాంతిక యుద్ధానికి తెరతీసింది. ఇమిగ్రెంట్స్పై విషం చిమ్మడానికి ఆయుధంగా మారింది.
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!