Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?

Relationship Tips Telugu

Relationship Tips Telugu

ఒక కొత్త డేట్‌కి వెళ్లారు. మీ ఎదురుగా ఒక కొత్త వ్యక్తి కూర్చున్నారు. వాళ్లు నవ్వుతున్నారు. మీతో మాట్లాడుతున్నారు. మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతా కొత్తగానే ఉంది కానీ మీ మనసులో మాత్రం ఇంకా ఇంకొకరు ఉన్నారు. వాళ్లు మాట్లాడే విధానాన్ని పాత వ్యక్తితో పోలుస్తున్నారు. వాళ్లు మెసేజ్‌కి ఆలస్యంగా స్పందిస్తే పాత సంబంధం గుర్తొస్తోంది. వాళ్లు చూపించే ఇంట్రెస్ట్‌ని కూడా గతంలో మీకు దొరికిన ఇంట్రెస్ట్‌తో కొలుస్తున్నారు.

ఒక్కసారిగా మీకు ఒక విషయం అర్థమవుతుంది. మీరు ఈ కొత్త వ్యక్తిని తెలుసుకోవడానికి ఈ డేట్‌కి రాలేదు. పాత వ్యక్తి నుంచి మీరు ఎంత దూరం వచ్చారో తెలుసుకోవడానికి వచ్చారు. ఇంతకీ బ్రేకప్‌కి తర్వాత మళ్లీ డేటింగ్ మొదలుపెట్టడానికి సరైన సమయం ఎప్పుడు? రెండు వారాల తర్వాతా? మూడు నెలల తర్వాతా? ఆరు నెలల తర్వాతా?

ఈ ప్రశ్నకు మనుషులు ఒక ఖచ్చితమైన సంఖ్య కోసం వెతుకుతుంటారు. కానీ మనసు క్యాలెండర్ చూసుకుని మారదు. ఒక సంబంధం ముగిసిన కొన్ని వారాలకే ఎవరో కొత్త వ్యక్తి నిజంగా నచ్చవచ్చు. మరో వ్యక్తికి నెలలు గడిచినా పాత సంబంధం నుంచి బయటపడిన భావన రాకపోవచ్చు. అందుకే బ్రేకప్‌కి ఎన్ని రోజులు అయ్యాయన్నది నెక్ట్స్‌ ప్యాచ్‌అప్‌కి కొలమానం కాదు. ఇంతకీ అసలు ఇప్పుడు కొత్త వ్యక్తి ఎందుకు కావాలనిపిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా విషయాలను బయటపెడుతుంది. ఒంటరిగా ఉండటం భరించలేకపోతున్నారా? పాత వ్యక్తిని మర్చిపోవడానికి ఎవరో కొత్త వ్యక్తి కావాలనిపిస్తోందా? మీ కోసం ప్రేమించేవాళ్లు ఉన్నారని మీకు మీరే నిరూపించుకోవాలనుకుంటున్నారా? లేదా నిజంగా ఒక కొత్త మనిషిని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోందా? ఈ నాలుగు పరిస్థితులు బయటికి ఒకేలా కనిపించవచ్చు.

ఫోన్‌లో కొత్త డేటింగ్ యాప్ ఉంటుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడటం మొదలవుతుంది. డేట్‌కి వెళ్తారు. కానీ లోపల జరుగుతున్నది ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటుంది. బ్రేకప్ తర్వాత వచ్చే ఖాళీ చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఒకప్పుడు రోజులో ఎన్నోసార్లు మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా కనిపించకుండా పోతారు. ఫోన్ మోగడం తగ్గుతుంది. రోజులో చెప్పుకోవాల్సిన చిన్న విషయాలకు కూడా ఎవరూ ఉండరు.

అప్పుడు ఒక కొత్త వ్యక్తి దొరికితే ఆ ఖాళీ కొంతసేపు నిండినట్టుగా అనిపించవచ్చు. ఈ రిలీఫ్‌ని ప్రేమగా అనుకోవడం చాలా సులభం. అందుకే కొత్త వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్లను ఒక వ్యక్తిగా చూస్తున్నామా, లేక మన పాత బాధకు మందులా ఉపయోగిస్తున్నామా అనేది గుర్తించడం ముఖ్యం. అయితే ఇక్కడ మరో అపోహ కూడా ఉంది. బ్రేకప్ అయిన వెంటనే ఎవరినైనా కలిస్తే అది రీబౌండ్ అని నిర్ణయించేయడం.

ప్రతి కొత్త సంబంధం విఫలమవ్వాల్సిన అవసరం లేదు. న్నిసార్లు ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా కలుస్తారు. మాట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరికి నిజమైన ఆసక్తి కలుగుతుంది. ఇక సంబంధం ముగిసిందనే కారణంతో కొత్త భావనను వెంటనే అనుమానించాల్సిన అవసరం లేదు. మనసులో ఇంకా కొంత బాధ ఉన్నప్పటికీ కొత్త వ్యక్తిని ఇష్టపడవచ్చు. బ్రేకప్ జరిగిన ప్రతిదీ పూర్తిగా మర్చిపోయిన తర్వాతే కొత్తగా ఎవరినైనా ఇష్టపడాలి అనే నియమం లేదు. ముఖ్యమైన విషయం ఇంకొకటి ఉంది. కొత్త వ్యక్తిని పాత వ్యక్తి స్థానంలో కూర్చోబెట్టకపోవడం.

కొత్త వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ప్రేమిస్తున్నారు? ఎలా మెసేజ్ చేస్తున్నారు? ఎలా స్పందిస్తున్నారు? ప్రతి విషయాన్నీ గత సంబంధంతో పోల్చడం మొదలైతే… మనం కొత్త సంబంధాన్ని ప్రారంభించడం లేదు. పాత సంబంధాన్నే మరో మనిషితో కొనసాగిస్తున్నట్టవుతుంది. మరో సంకేతం కూడా ఉంటుంది. కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం చివరికి మాజీ దగ్గరికి వెళ్లిపోతుంది. వాళ్లు ఏం చేశారో చెబుతారు. వాళ్లు ఎలా ఉండేవారో గుర్తొస్తుంది. వాళ్లు ఇలా చేసేవారు అని పోలిక మొదలవుతుంది.

అప్పుడు మనసు ఇంకా పాత కథలోనే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇక సోషల్ మీడియా ఈ విషయాన్ని మరింత క్లిష్టం చేసింది. బ్రేకప్ తర్వాత ఒక వ్యక్తి జీవితంలో నుంచి పూర్తిగా మాయమవ్వడం ఇప్పుడు చాలా కష్టం. ఫాలో చేయకపోయినా ఎవరో ఒకరి స్టోరీలో కనిపిస్తారు. బ్లాక్ చేసినా ఒక స్నేహితుడి పోస్ట్ ద్వారా సమాచారం వస్తుంది. వాళ్లు ఎవరితో బయటికి వెళ్లారో తెలుస్తుంది. వాళ్ల జీవితంలో కొత్త వ్యక్తి వచ్చారని తెలుస్తుంది. అప్పుడు మనం కూడా త్వరగా ముందుకు వెళ్లిపోయినట్టు కనిపించాలని అనుకోవచ్చు. కొత్త డేట్ ఒక వ్యక్తితో మొదలవుతుంది. కానీ దాన్ని చూస్తున్న ప్రేక్షకుడు మాత్రం పాత వ్యక్తి. అది మనకు తెలియకుండానే జరిగితే… మనం కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం కంటే, పాత వ్యక్తికి ఏదో నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్టవుతుంది.

అందుకే బ్రేకప్ తర్వాత మీరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. నాకు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి కావాలా… లేక పాత వ్యక్తి వల్ల మిగిలిన ఖాళీని ఎవరో ఒకరితో నింపాలనిపిస్తోందా? ఆ సమాధానం వెంటనే దొరకకపోయినా పరవాలేదు. కొత్తగా ఎవరినైనా కలవడం అంటే వెంటనే మరో తీవ్రమైన సంబంధంలోకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఒక కాఫీకి వెళ్లవచ్చు. మాట్లాడవచ్చు. కొత్త మనుషులను కలవవచ్చు. మీకు ఇప్పుడు ఏం కావాలో తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకోవచ్చు. ఆ ప్రయాణంలోనే మీరు సిద్ధంగా ఉన్నారా, ఇంకా కొంత సమయం కావాలా అనేది మీకే స్పష్టమవుతుంది.

ఎందుకంటే బ్రేకప్ తర్వాత ముందుగా వెళ్లిపోయిన వ్యక్తికే ఏదో బహుమతి దక్కదు. త్వరగా కొత్త వ్యక్తిని కనుగొన్నందుకు కూడా ఎలాంటి పతకం ఉండదు. సరైన సమయం అంటే పాత వ్యక్తిని పూర్తిగా మర్చిపోయిన రోజు కాదు. కొత్తగా ఎదురైన వ్యక్తిని పాత కథ నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించకుండా… ఒక కొత్త వ్యక్తిగానే చూడగలిగిన రోజు. అప్పుడు డేటింగ్ ఒక తప్పించుకునే మార్గంలా అనిపించదు. ఒక కొత్త అవకాశంలా అనిపిస్తుంది.