ప్రపంచానికి మానవ హక్కుల పాఠాలు చెప్పే అమెరికా… ఇప్పుడు అదే హక్కులను తన సరిహద్దుల వద్దే కాలరాస్తోందా? ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ గౌరవం అంటూ ప్రపంచ వేదికలపై గొంతెత్తే దేశం, తన గడప దాటిన మనుషుల విషయంలో మాత్రం కఠినమైన వైఖరిని చూపిస్తోంది.
ఇటీవల అమెరికా నుంచి మెక్సికోకు ఒక వ్యక్తిని బలవంతంగా పంపించారు. అతడు మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలపై అమెరికా అధికారులకు సమాచారం ఇచ్చాడు. అతడు తిరిగి మెక్సికోకు వెళ్తే ఆ ముఠాలు అతడిని హింసించే ప్రమాదం ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ముందే గుర్తించారు.
అందుకే అతడికి రక్షణ కల్పించారు. తర్వాత మెక్సికో ప్రభుత్వం అతడికి ఎలాంటి హాని జరగదని హామీ ఇచ్చిందన్న కారణంతో ఆ రక్షణ తొలగిపోయింది. ఆగస్టు ఒకటిన అతడిని మెక్సికోలోకి పంపించారు. ఇప్పుడు తనను వెతుక్కుంటూ కార్టెల్‌లు వస్తాయేమోనన్న భయంతో అతడు దాక్కుని జీవిస్తున్నాడు. చివరకు ఆగస్టు 21న అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి అతడిని తిరిగి అమెరికాకు తీసుకురావాలని ఆదేశించారు. ఈ ఒక్క కథ వెనుక మరింత పెద్ద చిత్రమే కనిపిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం డిపోర్టేషన్‌ను ఒక భారీ మిషన్‌లా చూస్తోంది. ఒక మనిషిని అతడి స్వదేశానికి పంపే అవకాశం లేకపోతే… మూడో దేశం వైపు నెట్టేస్తోంది. ఆ దేశంతో అతడికి ఎలాంటి బంధం ఉన్నా లేకపోయినా, అక్కడ అతడికి జీవితం ఎలా ఉంటుందో స్పష్టత ఉన్నా లేకపోయినా, సరిహద్దు దాటించడం మాత్రం పూర్తవుతోంది. ఇటీవలి గణాంకాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి.
2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు అమెరికా వేలాది మంది వలసదారులను వారికి ఏ మాత్రం సంబంధం లేని దేశాలకు పంపించినట్లు మానవ హక్కుల సంస్థలు గుర్తించాయి. మెక్సికోకు మాత్రమే ఇతర దేశాల పౌరులను పెద్ద సంఖ్యలో తరలించారు. వారిలో క్యూబా, హైతీ, వెనిజులా లాంటి దేశాల ప్రజలు ఉన్నారు. వాళ్లకు మెక్సికోలో ఇల్లు లేదు. కుటుంబం లేదు. చాలామందికి అక్కడి జీవన పరిస్థితులపై ఎలాంటి ఆధారం లేదు. అయినా అమెరికా భూభాగం నుంచి బయటకు పంపించడమే ప్రధాన లక్ష్యంగా మారింది.
ఇక్కడ ఒక భయంకరమైన ప్రశ్న ఎదురవుతోంది. ఒక మనిషిని ఎక్కడికి పంపుతున్నామన్నదే ముఖ్యమా? లేదా అతడు అక్కడ ఎలా బతుకుతాడన్నదే ముఖ్యమా? అమెరికా ప్రభుత్వం మాత్రం మొదటి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. మానవ హక్కుల సంస్థలు రెండో ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ఎందుకంటే హింస అనేది ప్రభుత్వ కార్యాలయంలో సంతకం పెట్టి ఆపే విషయం కాదు కదా. అది చీకట్లో జరుగుతుంది. జైళ్లలో జరుగుతుంది. పోలీసుల అదుపులో జరుగుతుంది. సాయుధ ముఠాల చేతుల్లో జరుగుతుంది. బాధితుడు బయటకు వచ్చి తన కథ చెప్పే అవకాశం లేకుండా కూడా పోవచ్చు.
అందుకే ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఇచ్చిన హామీని పట్టుకుని ఒక మనిషి ప్రాణాన్ని ప్రమాదంలోకి పంపడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. అమెరికా ఈ విషయంలో గతంలో కూడా ఇదే తరహా విమర్శలను ఎదుర్కొంది. ఎల్-సాల్వడార్‌లోని కెకాట్ జైలుకు వెనిజులా పౌరులను పంపించినప్పుడు, అక్కడ వారికి హింస జరగదని సాల్వడార్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అమెరికా ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. తర్వాత అక్కడి ఖైదీలు తీవ్ర హింసను ఎదుర్కొన్నారని మానవ హక్కుల పరిశోధనలు తేల్చాయి. హామీ ఒక కాగితంపై మిగిలిపోయింది. బాధ మాత్రం మనుషుల శరీరాలపై మిగిలింది.
ఇదే సమయంలో అమెరికా నుంచి భారతీయుల డిపోర్టేషన్లు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. 2025లో 3567మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపినట్లు భారత విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2026లో కూడా డిపోర్టేషన్లు కొనసాగుతున్నాయి. అమెరికా నుంచి తీసుకొచ్చిన కొందరు భారతీయుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు బంధాలు వేసిన దృశ్యాలు బయటకు రావడంతో భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. భారత ప్రభుత్వం కూడా అమెరికా అధికారులతో ఈ వ్యవహారంపై తన ఆందోళనను వ్యక్తం చేసింది.
డిపోర్టేషన్ అనే చట్టపరమైన ప్రక్రియకు మానవ గౌరవం కూడా తోడుగా ఉండాలి. ఒక మనిషిని సరిహద్దు దాటించడమే ప్రభుత్వ బాధ్యతగా మారినప్పుడు… ఆ సరిహద్దు అవతల అతడి ప్రాణం, అతడి భద్రత, అతడి భవిష్యత్తు ఏ స్థితిలో ఉంటాయన్న ప్రశ్న మిగిలిపోతుంది. ఇది అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు.

