Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!

Air India Flight 182 Bombing

Air India Flight 182 Bombing

Air India Flight 182-Kanishka Explained: 1985 జూన్ 23. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రశాంతంగా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ‘కనిష్క’ ఒక్కసారిగా గాల్లోనే ముక్కలైపోయింది. ఆకాశం నుంచి మృత్యువు కురిసిన క్షణమది! ఆ ఘటనలో చిన్నారులు, మహిళలు సహా మొత్తం 329 మంది అమాయకులు సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కాదు.. అంతర్జాతీయ చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి! ఈ ఘాతుకం వెనుక ఉన్నది ‘ఖలిస్తానీ ఉగ్రవాదులే’ అని భారత్ అప్పుడే చెప్పింది. కానీ, అంతర్జాతీయ రాజకీయం.. ఓటు బ్యాంకు వ్యూహాలు.. ఒక దేశపు ఉదాసీనత.. ఆ సత్యాన్ని నొక్కిపెట్టాలని చూశాయి. దశాబ్దాలు గడిచాయి, బాధితుల కుటుంబాల కన్నీళ్లు ఆరలేదు.

కానీ చివరకు.. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. నిజం నిప్పులా బయటపడింది. ఎట్టకేలకు కెనడా తన తప్పును అధికారికంగా ఒప్పుకుంది! “అవును, కనిష్కను కూల్చింది ఖలిస్తానీ వేర్పాటువాదులే” అని కెనడా భద్రతా సంస్థ స్వయంగా ప్రకటించింది. నాలుగు దశాబ్దాల పాటు కెనడా పాటించిన మౌనం వెనుక అసలు రహస్యం ఏంటి?.

ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే:

టొరంటో నుంచి ముంబైకి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ప్రమాదం కెనడా చరిత్రలోనే కాదు, ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. విమానంలోని లగేజ్ విభాగంలో అత్యంత పక్కా ప్రణాళికతో అమర్చిన బాంబు.. వేలాది అడుగుల ఎత్తులో పేలిపోవడంతో నిమిషాల వ్యవధిలోనే సర్వమూ శూన్యమైపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే, దీని వెనుక కెనడా వేదికగా పనిచేస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాద ముఠాల హస్తం ఉందనడానికి భారత్ తిరుగులేని ఆధారాలను చూపించింది. కానీ కెనడా పాలకులు నాడు ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు. దర్యాప్తును ఉద్దేశపూర్వకంగానే నత్తనడకన నడిపించారు.

ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎయిర్ ఇండియా ‘కనిష్క’ విమానాన్ని పేల్చేయడానికి దారి తీసిన పరిస్థితులను మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1980ల నాటికి పంజాబ్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే నాయకత్వంలోని సాయుధ ఉగ్రవాదులు అమృత్‌సర్‌లోని సిక్కుల పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారిని అణచివేయడానికి అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ 1984 జూన్‌లో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ పేరిట సైనిక చర్యకు ఆదేశించారు. ఈ ఆపరేషన్‌లో భింద్రన్‌వాలేతో పాటు అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ ఆలయ ప్రాంగణానికి నష్టం వాటిల్లింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు తీవ్రవాద గ్రూపులలో తీవ్ర ఆగ్రహాన్ని, పగను పెంచింది.

ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ప్రతికారంగా 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరా గాంధీని సిక్కులైన ఆమె సెక్యూరిటీ గార్డులే కాల్చి చంపారు. ఆ తర్వాత దేశంలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు తీవ్ర హింసకు దారితీశాయి. ఈ వరుస పరిణామాలు విదేశాలలో ముఖ్యంగా కెనడా, బ్రిటన్, అమెరికాలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాద ముఠాలలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసిని మరింత బలపరిచాయి. కెనడాలో తలదాచుకున్న తల్వీందర్ సింగ్ పర్మార్ నేతృత్వంలోని ‘బబ్బర్ ఖల్సా’ అనే ఉగ్రవాద సంస్థ భారత ప్రభుత్వంపై అతిపెద్ద దాడికి వ్యూహం రచించింది. ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి సరిగ్గా ఏడాది పూర్తవుతున్న తరుణంలో అంటే జూన్ 1985లో భారత ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ కొట్టాలని వారు నిర్ణయించుకున్నారు. భారత్‌కు చెందిన విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ను లక్ష్యంగా చేసుకుని ‘కనిష్క’ విమానంలో బాంబులు పెట్టి పేల్చేశారు.

కెనడాపై విమర్శలకు కారణమేంటి?

కనిష్క విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తును దశాబ్దాలుగా నాన్చుతూ వస్తోంది కెనడా. ఆ దేశ అంతర్గత రాజకీయాలే ఇందుకు కారణం. నాటి కెనడా ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల అవలంబించిన మెతక వైఖరి, వారికి పరోక్షంగా అందించిన మద్దతు, ఆశ్రయం వల్లే ఈ కేసులో కీలక నిందితులు చట్టం నుంచి సులువుగా తప్పించుకోగలిగారు. విచారణను కాలయాపన చేయడంతో, ఆధారాలు బలహీనపడ్డాయి. ఒక దేశ సార్వభౌమత్వానికి, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వేర్పాటువాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారో చెప్పడానికి కనిష్క కేసు దర్యాప్తు తీరే ఒక పెద్ద ఉదాహరణ.

ఎన్నాళ్లు దాచాలని చూసినా సత్యం ఎప్పటికీ దాగదు. నాలుగు దశాబ్దాల తర్వాత కెనడా అధికారికంగా ఈ ప్రమాదంపై నోరు విప్పింది. కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్- CSIS బుధవారం అధికారిక ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సంచలన నిజాన్ని వెల్లడించింది. ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై జరిగిన ఈ దాడికి ‘ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమమే’ కారణమని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ ఏ పేరును ప్రస్తావించడానికి కెనడా పాలక వర్గం వెనుకాడిందో.. ఇప్పుడు అదే ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్రను ఆ దేశ అత్యున్నత భద్రతా సంస్థ అధికారికంగా అంగీకరించక తప్పలేదు.

కనిష్క్ విమాన ఘటన ప్రమాదం కాదని, ఇది బబ్బర్ ఖల్సా సభ్యుల పనేనని కెనడా ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. దీంతో ఈ ఘటనపై వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం.. కెనడాను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న ఖలిస్తానీ గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా’ సభ్యులే నాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. విమానంలోని లగేజ్ విభాగంలో బాంబులు పెట్టి, అమాయకులైన 329 మందిని హతమార్చింది వీరేనని తేలిపోయింది. కెనడా చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఉగ్రదాడి అని ఆ సంస్థ పేర్కొంది. వేర్పాటువాద భావజాలం ఏ విధంగా మానవత్వాన్ని మంటగలిపి క్రూరత్వానికి ఒడిగడుతుందో బబ్బర్ ఖల్సా చేసిన ఈ వినాశనం నిరూపిస్తోంది.

కెనడా ఇంత ఆలస్యంగా వాస్తవాలను అంగీకరించడం వెనుక ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. కెనడాలో అంతర్గతంగా పెరుగుతున్న ఖలిస్తానీ తీవ్రవాదం, అంతర్జాతీయంగా భారత్ బలపడుతున్న తీరు.. కెనడాను తన పాత వైఖరిని మార్చుకునేలా చేశాయి. సొంత గడ్డపై ఉగ్రవాద మూలాలను పెంచి పోషిస్తే, అది ఏనాటికైనా ఆ దేశానికే ముప్పుగా మారుతుందనే చేదు నిజం ఇప్పుడు కెనడాకు అర్థమవుతోంది. ఇన్నాళ్లూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాద ముఠాలకు పరోక్ష రక్షణ కల్పించిన కెనడా, ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఈ సత్యాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కనిష్క ప్రమాదం జరిగి 41 ఏళ్లు దాటింది. కాలం గడిచినా, బాధితుల గుండెల్లోని గాయం అలాగే ఉంది. కేవలం తప్పును అంగీకరిస్తే సరిపోదు. ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి మతం లేదు, జాతి లేదు.. దానికి తావు ఇచ్చే దేశాలు కూడా ఎప్పటికైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఉగ్రవాదంపై పోరాటంలో ప్రపంచ దేశాలన్నీ ద్వంద్వ విధానాలు వీడి ఏకం కావాల్సిన సమయం ఇదే!

: CLN RAJU (EDITOR- NTV DIGITAL)