NTV Telugu Site icon

Special Story on Teacher’s Day: ఎందరో టీచర్లు.. అందరికీ వందనాలు..

Special Story On Teacher's Day

Special Story On Teacher's Day

Special Story on Teacher’s Day: ఈ రోజు సెప్టెంబర్‌ 5. టీచర్స్‌ డే. టీచ్‌ అంటే బోధించటం (లేదా) నేర్పటం. మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతిఒక్కరూ టీచర్లే. పుట్టిన దగ్గరి నుంచి గిట్టే వరకు మనం ఎన్నో అంశాలను నేర్చుకుంటాం. ఆ క్రమంలో మనకు ఎందరో టీచర్లు. ప్రతి వ్యక్తి జీవితమూ పలువురితో ముడిపడి ఉంటుంది. అందుకే ఏడాదిలో వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న మంచి సంస్కృతి మన సమాజంలో కొనసాగుతోంది. అందులో భాగంగా ఇవాళ మన గురువులను ఒకసారి గుర్తుచేసుకుందాం. అందరికీ అమ్మే ఆది గురువు. కాబట్టి ముందుగా మాతృమూర్తికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మకు, బ్రహ్మకు మధ్య నిచ్చెన వేసిన, మనకు నడకను, నడతను నేర్పిన నాన్నకు వేల వేల వందనాలు.

లక్షల కన్నా అక్షరాలు మిన్న. అంతటి విలువైన చదువును చెప్పే, ప్రపంచాన్ని పరిచయం చేసే పాఠశాలకు మనల్ని చిన్న వయసులో నిత్యం తీసుకెళ్లిన మన తోబుట్టువులను సైతం ఈ సందర్భంగా యాదికి తెచ్చుకోవాలి. దేవాలయం లాంటి విద్యాలయానికి దారిచూపిన, హోం వర్క్‌ చేయటంలో సాయపడిన అన్న, తమ్ముడు, అక్క, చెల్లి.. ఇలా అందరూ మనకు మార్గదర్శకులే. వాళ్లకు కూడా ‘విష్‌ యూ హ్యాపీ టీచర్స్‌ డే’. ఇక.. బడిలో, కాలేజీలో, యూనివర్సిటీలో మనకు కొన్ని సంవత్సరాల పాటు పాఠాలు చెప్పిన గురుబ్రహ్మలకు పాదాభివందనాలు. పటిష్ట విజ్ఞాన పునాదులు వేసి ప్రయోజకులను చేసిన ఉపాధ్యాయుల పేర్లను జీవితం అనే మన పుస్తకంలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి. ఏటా కనీసం ఒకసారైనా ఇలా తెరిచి చూసుకోవాలి. మననం చేసుకోవాలి.

మనిషికో చరిత్ర. కొందరికి చదువుకునే అదృష్టం దొరకదు. ఏదో ఒక పని చేసుకోవటం, చేస్తూనే నేర్చుకోవటం ద్వారా వాళ్లు ముందుకు వెళుతుంటారు. ఆ పనులను అలా కాదు ఇలా చేయాలంటూ దగ్గరుండి నేర్పే మేస్త్రి (లేదా) యజమాని (లేదా) ఫ్రెండ్సే వాళ్లకి టీచర్స్‌. వాస్తవానికి చదివి, చూసి నేర్చుకునేదానికన్నా చేసి నేర్చుకునేదే తొందరగా వస్తుంది. ఎక్కువ కాలం గుర్తుంటుంది. తక్కువ సమయంలో తన కాళ్లపై తాను నిలబడేందుకు ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్య విషయం. ఈ తరహా అభ్యాసంలో విద్యార్థి గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పని నేర్పటమే కాకుండా పని చేయించుకున్నందుకు వాళ్లే మనకు తిరిగి కూలి ఇస్తారు. అసంఘటిత రంగంలోని ఇలాంటి అసమాన బోధకులకూ ఈరోజు గురుపూజ చేసుకోవాలి.

ఉద్యోగ జీవితంలో నైపుణ్యాల పెంపు కోసం, పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కోసం క్రమంతప్పకుండా ట్రైనింగ్‌ ఇచ్చే ఇన్‌ఛార్జ్‌లూ ఉపాధ్యాయులతో సమానమే. మన పక్కనే కూర్చొని, మనతో కలిసి తిరుగుతూ రోజు వారీ విధుల్లో మన సందేహాలను నివృత్తి చేసే సహచరులూ మనకు టీచర్లే. వైవాహిక జీవితంలో మన తప్పొప్పులను సరిచేసే అర్ధాంగీ ఒక రకంగా మనకు గురువే. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా స్వతహాగా చదువుకొని, పైకొచ్చి ఆ పేరెంట్స్‌కే ఈ ఎరగని లోకాన్ని చూపే బిడ్డలెందరో. వాళ్లు కూడా ఆ అమ్మానాన్నలకు టీచర్లే. అసలు కంటే వడ్డీ ముద్దు. రిటైరైన గ్రాండ్‌ పేరెంట్స్‌కి టీవీ, రిమోట్‌, సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ లాంటి డైలీ టెక్నాలజీ అప్‌డేట్స్‌ని ముచ్చటగా ఎక్స్‌ప్లెయిన్‌ చేసే మనవళ్లూ, మనవరాళ్లూ తక్కువేం కాదు. తాతలకు దగ్గులు నేర్పేవాళ్లే.

మన సాయం పొంది మర్చిపోయే మిత్రులు, కలిసిరాని కాలంలో కర్రే పామై కాటేస్తుందన్నట్లు సూటిపోటి మాటలతో బాధపెట్టే బంధువులు, గుణపాఠాలు చెప్పే మన పొరపాట్లు.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ అనంత విశ్వంలో గురువులేని చోటు లేదు. ఏకలవ్యుడి లాంటి శిష్యులూ లేకపోలేదు. అందుకే.. మన వెనక, తెర వెనక ఉండి నడిపించే ఇలాంటి టీచర్లు ఎందరో.. వాళ్లందరికీ వందనాలు.