NTV Telugu Site icon

Home Work: ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వొద్దన్న ఆదేశాలు అమలవుతాయా?

Home Work

Home Work

Home Work: పాఠశాల విద్యార్థుల స్కూల్‌ బ్యాగ్‌ బరువు తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) తాజాగా కొన్ని గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. అయితే ఈ మార్గదర్శకాలన్నీ బాగున్నాయని, కానీ వాటి అమలుకు పాఠశాలలు ముందుకు వస్తాయా లేదా అనే సందేహాలు పేరెంట్స్‌లో నెలకొన్నాయి. ఒకటీ రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ ఇవ్వొద్దని ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశించింది.

టెక్‌స్ట్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌, వర్క్‌ షీట్స్‌ భారీగా ఉంటాయి కాబట్టి వాటిని బ్యాగులో పెట్టుకొని స్కూల్‌కి తీసుకెళ్లటం, అక్కడి నుంచి ఇంటికి మోసుకెళ్లటం చిన్నారులకు ఇబ్బందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. మూడు, నాలుగు, ఐదు తరగతుల వర్క్‌బుక్స్‌ని స్కూల్లో ఉంచటమే దీనికి పరిష్కారమని పరోక్షంగా పేర్కొంది. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు హోం వర్క్‌ హెవీగా ఉంటోందని ఎస్‌సీఈఆర్‌టీ అభిప్రాయపడింది.

One Man Two Jobs: ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు.. రెండుగా చీలిపోయిన టెక్‌ కంపెనీలు

స్టూడెంట్స్‌ హోం వర్క్‌ విషయంలో ఒత్తిడికి గురికాకూడదంటే వాళ్లకు ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్‌లో మాత్రమే హోం వర్క్‌ ఇవ్వాలని సూచన చేసింది. ప్రైమరీ క్లాసుల స్టూడెంట్స్‌కి మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌కి ఒక నోట్‌బుక్‌, మిగతా ఐదు సబ్జెక్టులకు ఒక నోట్‌ బుక్‌ పెట్టాలని తెలిపింది. హైస్కూల్‌ స్టూడెంట్స్‌ ఒక లాంగ్‌ నోట్‌ బుక్‌ని రెండు సబ్జెక్టులకు వాడుకునేందుకు పర్మిషన్‌ ఇవ్వాలని సూచించింది. ఏ రోజు ఏ సబ్జెక్టులను బోధిస్తారో ఆ రోజు ఆ బుక్స్‌ మాత్రమే తెచ్చుకునేలా చూడాలని ఆదేశాల్లో పొందుపరిచింది.

టెక్‌స్ట్‌ బుక్స్‌ని సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు పంపిణీ చేయాలని, తదుపరి సెమిస్టర్‌ వచ్చే వరకు బుక్స్‌ని స్కూల్లోనే భద్రపరచుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. స్టూడెంట్స్‌ స్కూల్‌ బ్యాగ్‌ల బరువు ఎంత ఉండాలో తరగతులవారీగా నిర్దేశించింది. 1-2 తరగతులవారికి ఒకటిన్నర కేజీల లోపు, 3-5 తరగతి విద్యార్థులకు 2.5 కేజీలు, 6-7 తరగతులకు 4 కేజీలు, 8-9 తరగతుల వారికి 4.5 కేజీలు, పదో తరగతి విద్యార్థులకు 5 కేజీల లోపు బరువు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఇదిలాఉండగా ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాలు అమలైతే విద్యార్థులు నిజంగా రిలీఫీ పొందుతారని, అమలు బాధ్యతను ప్రభుత్వం పక్కాగా పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. హోం వర్క్‌లు స్టూడెంట్స్‌ స్థాయికి మించి ఉండటంతో వాటిని చేయించలేక చాలా మంది పేరెంట్స్‌ పిల్లల్ని బలవంతంగా ట్యూషన్లకు పంపించాల్సి వస్తోందనే అభిప్రాయం నెలకొంది. దీనివల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారని, తల్లిదండ్రుల పైన అదనపు ఆర్థిక భారం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌సీఈఆర్‌టీ ఆదేశాలు అమలైతే ఇవన్నీ తొలిగిపోతాయని ఆశిస్తున్నారు.