First Virtual School in India: దేశంలోనే మొట్టమొదటి వర్చువల్ స్కూల్‌ని నిన్న బుధవారం ప్రారంభించామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఈ స్టేట్‌మెంట్ తప్పు అంటూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) ఖండించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పినదాని ప్రకారం.. ఈ స్కూల్‌లో దేశంలోని ఏ ప్రాంతం నుంచి అయినా స్టూడెంట్స్ అడ్మిషన్ పొందొచ్చు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే దీనికి శ్రీకారం చుట్టారు.
ఈ వర్చువల్ స్కూల్.. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అఫిలియేషన్‌తో నడుస్తుంది. వివిధ కారణాల రీత్యా స్కూల్‌కి వెళ్లలేనివాళ్లు ఇందులో ప్రవేశాలు పొందొచ్చు. అడ్మిషన్లు కూడా నిన్నే ప్రారంభమయ్యాయి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సైతం ఇక్కడ స్పెషల్ కోచింగ్ ఇవ్వనుండటం విశేషం. ఈ వర్చువల్ స్కూల్‌లో ప్రస్తుతానికి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇస్తున్నారు. ఈ స్టూడెంట్స్.. లైవ్ క్లాస్‌లకు అటెండ్ కావొచ్చు. రికార్డు చేసిన క్లాస్‌ల వీడియోలు చూసి పాఠాలు నేర్చుకోవచ్చు. స్టడీ మెటీరియల్ చదువుకోవచ్చు.
ఈ మేరకు ప్రతిఒక్కరికీ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. డిజిటల్ లైబ్రరీ సేవలనూ వాడుకోవచ్చు. స్కిల్ డెవలప్‌మెంట్ ఎడ్యుకేషన్‌నీ అందిస్తారు. మొత్తమ్మీద ఈ వర్చువల్ స్కూల్ దేశ విద్యా రంగాన్ని మలుపుతిప్పే చెప్పుకోదగ్గ పరిణామమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదిలాఉండగా దేశంలోనే ప్రప్రథమ వర్చు్‌వల్ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో అందుబాటులోకి తెచ్చిందని ఎన్‌ఐఓఎస్ ప్రకటన చేయటం గమనార్హం. ఢిల్లీ సీఎం స్టేట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రకటన కూడా వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
”ఎన్‌ఐఓఎస్‌లో ప్రస్తుతం 7 వేల స్టడీ సెంటర్లు అకడమిక్ సపోర్ట్ అందిస్తున్నాయి. 15 వందల స్టడీ సెంటర్లు నైపుణ్య ఆధారిత వృత్తివిద్యా కోర్సులను బోధిస్తున్నాయి. లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులను సైతం నిర్వహిస్తున్నాయి. 2021లో ప్రారంభమైన ఫస్ట్ సెషన్‌లో వర్చువల్ స్కూల్ పరిధిలోని లెర్నర్స్ 2.18 లక్షల అసైన్‌మెంట్లను అప్‌లోడ్ చేశారు” అని ఎన్‌ఐఓఎస్ వివరించింది. ఎన్‌ఐఓఎస్‌ని గతంలో నేషనల్ ఓపెన్ స్కూల్(ఎన్‌ఓఎస్)గా వ్యవహరించేవారు. దీన్ని 1989 నవంబర్‌లో జాతీయ విద్యావిధానం-1986కి అనుగుణంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ప్రారంభించారు.
ఈ సంస్థ సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిల్లో జనరల్, అకడమిక్ కోర్సులతోపాటు అనేక వృత్తి విద్య, లైఫ్ ఎన్‌రిచ్‌మెంట్, కమ్యూనిటీ బేస్డ్ కోర్సులను అందిస్తోంది. ఈ వర్చువల్ స్కూల్ వ్యవహారం కేంద్ర, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. దీనిపై ఒక్క రోజులోనే రెండు భిన్న ప్రకటనలు వచ్చాయి. ఈ కథ భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.