NTV Telugu Site icon

AP Govt School: బోస్టన్ స్కూల్ కాదు. బెండపూడి ప్రభుత్వ బడి. తెలుగు కన్నా తేలికగా అమెరికా ఇంగ్లిష్‌

Ap Govt School

Ap Govt School

AP Govt School: రెండు తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఇంగ్లిష్‌ మాట్లాడటం కాదు కదా కనీసం చూసి (పర్ఫెక్టుగా) చదవటం కూడా రాదనే చులకన భావం చాలా మందిలో ఉంది. అసలు తెలుగు అక్షరాలనే సరిగా గుర్తించలేకపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా అన్నవరానికి సమీపంలో ఉన్న బెండపూడి ప్రభుత్వ బడి పిల్లలు ఆంగ్లాన్ని అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇండియన్‌ ఇంగ్లిష్‌ కాదు. ఏకంగా అమెరికా ఇంగ్లిష్‌నే ఈజీగా దంచికొడుతున్నారు. ఇలా అవలీలగా మాట్లాడుతుండటంతో వాళ్లు నిజంగా అమెరికాలోని బోస్టన్‌ స్కూల్లో చదివి వచ్చారా అనే సందేహం కలగకమానదు.

‘‘ప్రపంచ’’ ప్రశంసలు

ఈ స్టూడెంట్స్‌కి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఇంటర్నెట్‌ సెలబ్రిటీలు అయ్యారంటే వాళ్లు ఏ రేంజ్‌లో ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారో అర్థంచేసుకోవచ్చు. దీనికి ముఖ్య కారణం ఆ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు గంటా వీరప్రసాద్‌. ఆయన కృషిని అభినందిస్తూ ఎంతో మంది ఘనంగా సన్మానాలు చేశారు. దీంతో గంటా వీరప్రసాద్‌ కూడా స్థానికంగా ఫేమస్‌ పర్సన్‌ అయ్యారు. తనకు వచ్చిన శాలువాలు, బొకేలు, మెమెంటోలతో ఒక షాపు కూడా పెట్టుకోవచ్చంటూ ఆయన సరదాగా అన్నారంటే ఎంత గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని టీచర్‌ జాబ్‌ కొట్టిన గంటా వీరప్రసాద్‌ తనలాగే తన విద్యార్థులు ఆంగ్లం మాట్లాడటంలో ఇబ్బందులు పడకూడదని నిర్ణయించుకొని తన కొత్త డిజిటల్‌ ఫోన్‌తో సరికొత్త ప్రయోగాలు చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌తో..

ఇంగ్లిష్‌ను సింపుల్‌గా మాట్లాడుతూ, విద్యార్థులతో తేలిగ్గా మాట్లాడిస్తూ ఆయన కొన్ని ఆడియా, వీడియో రికార్డింగ్స్‌ చేశారు. వాటిని ఆన్‌లైన్‌ ద్వారా స్కూల్‌ గ్రూప్‌లో పెట్టడంతో వైరల్‌ అయ్యాయి. కొంత మంది ఐఏఎస్‌ ఆఫీసర్ల దృష్టికి కూడా వచ్చాయి. అంతకన్నా ముందే వాళ్లు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ఆ పాఠశాల విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడారు. కొన్ని దేశాల డెలిగేట్స్‌ నేరుగా బెండపూడి ప్రభుత్వ బడికే వచ్చి విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూశారు. దీంతో ఇప్పుడు ఈ స్కూల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు మోడల్‌గా మారింది. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రైవేట్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ కూడా ఇక్కడే అడ్మిషన్‌ తీసుకోవటం చెప్పుకోదగ్గ విషయం.

అలా.. మొదలైంది..

గంటా వీరప్రసాద్‌ తొలుత ఒక ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో 2వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే అవకాశం పొందారు. కొన్నేళ్లలోనే గ్రామర్‌పై పట్టు సాధించారు. చివరికి ఆ పాఠశాలలోని స్టాఫ్‌ మొత్తానికి ఆంగ్ల వ్యాకరణం నేర్పే స్థాయికి ఎదిగారు. గంటా వీరప్రసాద్‌ తెలుగులోనే చదువుకున్నారు కాబట్టి ఆ మీడియం విద్యార్థుల బలాలు బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకున్నారు. రెగ్యులర్‌ ఇంగ్లిష్‌ క్లాసులను వాళ్ల అవసరాలకు, భాషా స్థాయికి అనుగుణంగా మార్చుకున్నారు. విద్యార్థులను పాఠాల్లోని పాత్రధారులుగా మార్చారు. పదాల గొలుసు ఆటలు (వర్డ్‌ చెయిన్‌ గేమ్స్‌) ఆడించేవారు. ఇంగ్లిష్‌ పదాలను అమెరికా ఆంగ్లంలో ఎలా పలకాలో నేర్చుకునేందుకు కొంత మంది ట్రైనర్ల ఆన్‌లైన్‌ వీడియోలను విద్యార్థులకు రోజూ చూపించేవారు. దీంతో వాళ్లు అమెరికా, బ్రిటన్‌ ఇంగ్లిష్‌ ప్రొనౌన్సియేషన్‌ల మధ్య తేడాను గుర్తించసాగారు.

ఆకాశమే హద్దు..

పదాలను ఎంత వేగంగా పలకాలి, ఎక్కడ నొక్కి చెప్పాలి, ఎక్కడ సైలెంట్‌ పదాలను పలకకుండా ఆగాలి అనే అంశాల్లో క్షుణ్ణంగా తర్ఫీదు ఇచ్చారు. సోషల్ మీడియాలో కొంత మంది ట్రోల్ చేసినా పట్టించుకోలేదు. గురువు, పేరెంట్స్‌ ప్రోత్సాహంతో పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఎవరినీ చూసి భయపడాల్సిన అవసరంలేదని ధీమాగా చెబుతున్నారు. ఎంత మందిలోనైనా ధైర్యంగా అమెరికా ఇంగ్లిష్‌ అదరగొడతామని ఆత్మవిశ్వాసంతో అంటున్నారు. ఈ నేపథ్యంలో బెండపూడి ప్రభుత్వ బడి ‘టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌’ అయింది. ఈ ఊరి పేరు, స్కూల్‌ పేరు ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. ఆ గ్రామ ప్రజలంతా ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏ చిన్న ఫంక్షన్‌ జరిగినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. బంధుమిత్రులంతా ఆరా తీస్తుండటంతో ఆనందంగా అనిపిస్తోందని మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ చెప్పారు.