NTV Telugu Site icon

Admissions in Psychology Courses: జీవితం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సైకాలజీ కోర్సుల్లో 50 శాతం పెరిగిన అడ్మిషన్లు.

Admissions In Psychology Courses

Admissions In Psychology Courses

Admissions in Psychology Courses: దేశవ్యాప్తంగా సైకాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు 50 శాతం పెరిగాయి. ఆనర్స్‌, పీజీ లెవల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఈ సబ్జెక్ట్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో సైకాలజీగా బాగా డిమాండ్‌ పెరిగింది. డిగ్రీలో ఏ గ్రూప్‌ చదివినవారైనా సైకాలజీని సెలెక్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రతిభావంతులైన విద్యార్థులు గతంలో మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ కోర్సుల వైపు వెళ్లేవారు. ఇప్పుడు ముఖ్యంగా (పీజీ ఇన్‌) సైకాలజీ కోర్సుపై ఫోకస్‌ పెడుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీలో ఇంతకుముందు సైకాలజీ కోర్సుకి 30-40 వేల అప్లికేషన్లు మాత్రమే వచ్చేవి. 2020-21 నుంచి 50-60 వేల వరకు వస్తున్నాయి. దీంతో 99 శాతం కటాఫ్‌ వరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని రామానుజన్‌ కాలేజీలోని అప్లైడ్‌ సైకాలజీ హెచ్‌ఓడీ ధర్మేంద్రనాథ్‌ తివారీ తెలిపారు. స్టూడెంట్స్‌ నుంచి స్పందన బాగా వస్తుండటంతో ఢిల్లీ యూనివర్సిటీ సైకాలజీలో సీట్లు పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవితాలు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయని తివారీ పేర్కొన్నారు.

OU Phd Admissions: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలపై వివాదం?

దీంతో సైకాలజీ సబ్జెక్టులు చదవటం ద్వారా రిలీఫ్‌ పొందాలని జనం భావిస్తున్నారని చెప్పారు. ఇగ్నోలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఒక అడ్మిషన్‌ సైకిల్‌లో (జూన్‌, డిసెంబర్‌ కలిపి) దాదాపు 4-5 వేల మంది చేరేవారు. గతేడాది మాత్రం సుమారు 10 వేల మంది ప్రవేశం పొందారు. ఈ సంవత్సరం ఇప్పటికే 5 వేల అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. టీచర్లు, డెంటిస్టులు, హోమియోపతివాళ్లు, లాయర్లు, జర్నలిస్టులు డిస్టెన్స్‌ లెర్నింగ్‌ పీజీ కోర్సుల్లో ఎన్‌రోల్‌ అవుతున్నారు.

బెంగాళూరులోని జైన్‌(డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ)లో ఈ ఏడాది సైకాలజీ ప్రోగ్రామ్‌కి 50-60 శాతం అధికంగా అప్లికేషన్లు వచ్చాయి. వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూహెచ్‌ఓ) 2017 రిపోర్ట్‌ ప్రకారం మన దేశంలోని ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కానీ.. 1.3 బిలియన్‌ ప్రజలకు 9 వేల మంది మాత్రమే సైకియాట్రిస్ట్‌లు ఉన్నారు. 10 మిలియన్‌ల మందికి కేవలం ఏడుగురే కౌన్సిలర్లు ఉన్నారు.

దీన్నిబట్టి సైకాలజీ ప్రొఫెషనల్స్‌కి ఎంత గిరాకీ ఉందో అర్థంచేసుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి అనే నాణేనికి ఒకవైపు అంతా బాగున్నట్లే కనిపిస్తోంది. రెండో మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని రంగాల్లోనూ పోటీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక అసమానతలు రాజ్యమేలుతున్నాయి. దీంతో.. ఆదాయ వ్యయాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి.

ఉద్యోగ జీవితాలు కూడా స్థిరంగా కొనసాగట్లేదు. కొలువులు కోల్పోవటం, ఆర్థిక ఇబ్బందులు ప్రజల మానసిక ఆరోగ్యం, స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కరోనా సమయంలో అయినవారు అనూహ్యంగా దూరంగా కావటం, అనారోగ్యానికి గురికావటం వంటివి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో సైకాలజీ సబ్జెక్టు చదవాలనే ఆసక్తి అన్ని వర్గాల ప్రజల్లో పెరుగుతోంది అని జైన్‌ వీసీ రాజ్‌ సింగ్‌ వివరించారు.