Leela Pavitra:సమాజంలో మహిళలను కొంతమంది మగాళ్లు బతకనివ్వడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడవలేకపోతోంది. ప్రేమిస్తే పెద్దవాళ్ళు చంపేస్తున్నారు.. పెళ్లి చేసుకొంటే భర్త చంపేస్తున్నాడు.. ప్రేమించమని ప్రేమోన్మాదులు చంపేస్తున్నారు. ఇలా ఎక్కడా ఒక మహిళకు రక్షణ లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది ఆ అమ్మాయి కల. అంతకుమించి తన కుటుంబ అంగీకారంతో ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. కానీ, ఆ ఆశ అడియాసయింది.. తన ప్రేమను కుటుంబం నిరాకరించింది. కుటుంబ ఒత్తిడితో ప్రేమించినవాడిని దూరం పెట్టింది. అదే ఆమె చేసిన పొరపాటు.. ఆ చిన్న పొరపాటే ఆమె జీవితాన్ని బలితీసుకుంది. నడిరోడ్డుపైనే ప్రేమించినవాడితో చేతిలో అతి క్రూరంగా చంపబడింది. బెంగుళూరులో లీలా పవిత్ర హత్య సంచలనం సృష్టిస్తుంది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన లీలా పవిత్ర అలియాస్ లీలా (26) అనే యువతి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఎమ్మెస్సీ పూర్తి చేసిన లీలా పవిత్ర బెంగళూరు చేరుకుని అక్కడ మురగేశ్ పాళ్యలోని ఓమెగా మెడిసిన్ కంపెనీలో ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్నది. మంచి ఉద్యోగం చేస్తున్న లీలా పవిత్రా నిత్యం ఆమె కుటుంబ సభ్యులతో టచ్ లో ఉండేది. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన దినకర్ (28) అనే యువకుడు బెంగళూరు చేరుకుని దొమ్మలూరులోని ల్యాబ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల నుంచి లీలా పవిత్రా, దినకర్ ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం దినకర్, లీలా పవిత్రా వారి ప్రేమ విషయం వాళ్లవాళ్ల కుటుంబ సభ్యులకు చెప్పారు.వారి కులాలు వేరు కావడంతో వారు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు దినకర్, లీలా పవిత్రా అనేక ప్రయత్నాలు చేశారని తెలిసింది. దినకర్ తో పెళ్లికి తాము అంగీకరించమని లీలా పవిత్రా కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని తెలిసింది. దినకర్ తో ఇక ముందు నువ్వు మాట్లాడకూడదని లీలా పవిత్రాకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కొంతకాలం నుంచి లీలా పవిత్రా ఆమె ప్రియుడు దినకర్ ను దూరం పెట్టి అతన్ని కలవడం మానేసింది. ప్రియురాలికి దగ్గర కావాలని దినకర్ చాలా ప్రయత్నాలు చేసాడు కానీ, లీలా పవిత్ర మాత్రం మాజీ ప్రియుడు దినకర్ ను కలవకూడదని డిసైడ్ అయ్యింది.
ఇక మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో దినకర్ అతని ప్రియురాలు లీలా పవిత్రా ఉద్యోగం చేస్తున్న మురగేశ్ పాళ్యలోని కంపెనీ దగ్గరకు వెళ్లాడు. రాత్రి పని ముగించుకుని లీలా పవిత్రా కంపెనీలో నుంచి బయటకు వచ్చింది. నీతో మాట్లాడాలని దినకర్ చెప్పడంతో లీలా పవిత్రా కొంచెం పక్కకు వచ్చింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావని అడుగుతూ దినకర్ తన జేబులో ఉన్న కత్తి తీసుకొని మొదట లీలా పవిత్రా కడుపులో పదేపదే పొడిచాడు. లీలా పవిత్రా కేకలు వెయ్యడంతో ఇంకా రగిలిపోయిన దినకర్ ఆమె ఛాతీ ముఖం, గొంతు తదితర చోట్ల ఇష్టం వచ్చిన 16 సార్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన లీలా పవిత్రా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన దినకర్ ను స్థానికులు పట్టుకుని జీవన్ భీమానగర్ పోలీసులకు అప్పగించారు. ప్రియురాలు లీలా పవిత్రా తనను దూరం పెట్టిందని రగిలిపోయిన దినకర్ ఆమెను దారుణంగా హత్య చెయ్యడం బెంగళూరులో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బతకడానికి బెంగళూరు వచ్చిన ప్రేమికుల్లో ఒకరు హత్యకు గురికావడం, మరోకరు జైలుకు వెళ్లడంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.