Site icon NTV Telugu

Ludo Game: నవ భారతంలో అపర ద్రౌపది.. తనను తాను పందెం కట్టుకొని

Ludo

Ludo

Ludo Game: మనిషికి ఏదైనా ఇష్టం ఉంటే పర్లేదు కానీ అది వ్యసనంలా మారితేనే ప్రాబ్లెమ్. కొంతమందికి మందు వ్యసనం, ఇంకొంతమందికి పేకాట, మరికొంతమందికి పబ్ జీ. ఇక మనం చెప్పుకొనే మహిళకు లూడో గేమ్ అంటే వ్యసనం. ఎంత వ్యసనం అంటే భర్త ఆస్తి మొత్తాన్ని ఆ ఆటలో పెట్టి పోగొట్టింది. ఇక తన దగ్గర పందెం కట్టడానికి ఏది లేక తనను తానే పందెం కట్టింది. చివరకు దాని పర్యవసానం ఆ కుటుంబానికి తలనొప్పిగా మారింది. ఈ ఘటన జైపూర్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. జైపూర్ లోని ప్రతాప్‌గఢ్‌లోని దేవ్‌కలి ప్రాంతానికి చెందిన ఒక జంట ఒక అద్దె ఇంట్లో నివాసముంటుంది. ఆమెకు లూడో గేమ్ అదేనండి పాము నిచ్చెన ఆడడం ఇష్టం. కరోనా సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండలేక ఈ ఆన్ లైన్ గేమ్ లో పందెలు కాసి మరీ ఆడేవారు. ఇక ఆ సమయంలోనే మహిళ సైతం దానికి అలవాటుపడింది. ఆ అలవాటు కాస్త వ్యసనంగా మారింది. భర్త కష్టపడి తెచ్చిన డబ్బును మొత్తం లూడో లోపెట్టి నాశనం చేసింది.అయినా ఆమె తృప్తి చెందలేదు. ఇక ఇటీవల ఆ ఇంటి యజమానితో లూడో గేమ్ ఆడింది. అందులో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుంది. ఇక చివరగా పందెం కాయడానికి ఏమి లేవని తెలిసి తనను తానే పందెం కాసింది. తాను గెలిస్తే తన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వాలని, ఓడిపోతే తనను ఇంటికి తీసుకెళ్లి దేనికైనా వాడుకోవచ్చని పందెం కట్టింది. ఎంత కష్టపడి ఆడినా ఆమె ఓడిపోయింది. అనుకున్న పందెం ప్రకారం యజమాని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఇక ఈ విషయాన్నీ ఆమె తన భర్తకు ఫోన్ చేసి చెప్పగా అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటికి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు యజమాని ఇంటికి వెళ్లి ఆమెను ఇంటికి పంపమని అడుగగా ఆమె ట్విస్ట్ ఇచ్చింది. తనకు యజమానితో ఉండడమే ఇష్టమని భర్త దగ్గరకు రానని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటన జైపూర్ లో కలకలం సృష్టిస్తోంది.

Exit mobile version