NTV Telugu Site icon

Karnataka: బీదర్‌లో మహిళపై అత్యాచారం, హత్య.. కర్ణాటకలో నిరసనలు..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో బీదర్‌లో 18 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. బాధిత యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నగరవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసుకి సంబంధించి పోలీసులకు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. యువతి ఆగస్టు 29న తప్పిపోయింది, సెప్టెంబర్ 01న గుణతీర్థవాడిలోని ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోని పొదల్లో ఆమె మృతదేహం లభించింది.

Read Also: 15 Years Of Chay In TFI: ‘తండేల్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

పోలీసులు ముందుగా యువతి మృతిపై హత్య కేసు నమోదు చేయగా, పోస్టుమార్టం నివేదిక, నిందితుల వాంగ్మూలం ఆధారంగా అత్యాచారం, హత్యగా పోలీసులు కేసు బుక్ చేశారు. బాధితురాలి తలకు రాయి తగిలి ప్రాణాలు పోయాయని నివేదిక వెల్లడించింది. ముగ్గురు నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేయగా, నిందితుడి ఇద్దరు స్నేహితులు ఘటన జరుగుతున్న సమయంలో వాహనంలో వేచి ఉన్నారు.

కీలక నిందితుడు యువతితో రిలేషన్ కలిగి ఉన్నాడని, కేసు మరింత లోతుగా విచారించేందుకు ముగ్గురు సభ్యుల టీం‌ని ఏర్పాటు చేసినట్లు బీదర్ ఎస్పీ ప్రదీప్ గుంటే తెలిపారు. బాధిత మహిళ ఎస్టీ అని చెప్పారు. ఇదిలా ఉంటే, ఈ అత్యాచారం ఘటన బీదర్‌లో తీవ్ర నిరసనలకు కారణమైంది. వందలాది మంది బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని నగరంలోని రోడ్లపై నిరసనలు చేపట్టారు. కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ రోజు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున బాధితురాలి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.