KILLER WIFE: ప్రియుడి మోజులో పడి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసిందో భార్య !! ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం భర్తను చంపుకుంది. పక్కా స్కెచ్ వేసి ప్రియుడితో కలిసి కిరాతకంగా హతమార్చింది. పైగా తనకేం తెలియనట్టు దొంగనాటకం మొదలుపెట్టింది. పీకలదాకా మందు తాగి ఉలుకుపలుకు లేకుండా పడిపోయాడు నా భర్త అంటూ మాయమాటలతో తప్పించుకునేందుకు డ్రామా ఆడింది. కానీ ప్రియుడితో సహా అడ్డంగా దొరికిపోయింది. సొంత బంధాల కంటే… సోషల్ మీడియాలో పరిచయమవుతున్న వ్యక్తులనే సర్వస్వంగా భావిస్తున్నారు. ముక్కూమొహం తెలియనోడి కోసం ఏకంగా కట్టుకున్నవాళ్లను, కన్నబిడ్డలను హతమార్చుతున్నారు. శంకర్‌పల్లి లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇన్‌స్టాలో పరిచయమైన ప్రియుడి కోసం భర్తను హత్య చేసింది..
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పర్వేదకు చెందిన నారగూడం కృష్ణ.. జీడిమెట్లకు చెందిన రాజేశ్వరి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి 2018లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. చెవెళ్లలోని చంద్రారెడ్డి నగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని.. కూలీ చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. రాజేశ్వరికి ఇన్‌స్టా రీల్స్ చేయడం ఇష్టం. తరుచూ రీల్స్ చేస్తూ పోస్ట్ చేసేది. రాజేశ్వరి రీల్స్ చూసిన శరత్ అనే యువకుడు… రీల్స్‌కు లైక్‌లు కొడుతూ.. రాజేశ్వరికి మెసేజ్‌లు చేయసాగాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. శరత్‌తో వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఓ వైపు భర్త కూలి పనులకు వెళ్తుంటే.. శరత్, రాజేశ్వరి హద్దుమీరి ప్రవర్తించారు…
రాజేశ్వరి కదలికలను గమనించిన భర్త కృష్ణ హెచ్చరించాడు. శరత్ విషయం తెలుసుకుని పద్దతి మార్చుకోవాలని సూచించాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. దీంతో రాజేశ్వరి ప్రియుడు శరత్‌ను దూరం పెట్టింది. ఇన్‌స్టాలో బ్లాక్ చేసింది. శరత్‌కు ఫోన్ చేయడం, కాల్ చేయడం ఆపేసింది. ప్రియురాలు తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయాడు శరత్. కృష్ణ లేని సమయంలో రాజేశ్వరి ఇంటికి వచ్చాడు శరత్. నువ్వంటే ఇష్టమని… కృష్ణ నుంచి విడిపోయి వస్తే నిన్ను బాగా చూసుకుంటాను అని మాయమాటలు చెప్పాడు. శరత్ మాటలకు డైవర్ట్ అయిన రాజేశ్వరి.. పాత జ్ఞాపకాలు నెమరేసుకుంది. ప్రియుడి మాయలో పడిపోయింది.
కృష్ణను ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది రాజేశ్వరి. ఓ రోజు కృష్ణ ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చిన తర్వాత.. రాజేశ్వరి కావాలనే గొడవ పెట్టుకుంది. భార్యతో గొడవపడి.. మద్యం మత్తులో ఉన్న కృష్ణ స్పృహ లేకుండా పడుకున్నాడు. అదే సమయంలో రాజేశ్వరి.. ప్రియుడు శరత్‌కి కాల్ చేసింది. ఇద్దరూ కలిసి కృష్ణ ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేశారు. భార్య రాజేశ్వరి భర్త ఛాతిమీద కూర్చుని దిండును అదిమిపట్టింది. కాసేపటికే కృష్ణ చనిపోయాడు. శరత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తెల్లారిన తర్వాత భార్య రాజేశ్వరి కొత్త నాటకం మొదలుపెట్టింది. తన భర్త స్పృహలేకుండా పడి ఉన్నాడని.. ఎంత లేపినా లేవడం లేదని కొత్త డ్రామా షురూ చేసింది. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. కృష్ణ చనిపోయాడని నిర్ధారించారు వైద్యులు. కృష్ణ తల్లి అంజమ్మకి సమాచారం ఇచ్చారు. అందరూ సాధారణ మరణమే అనుకున్నారు. కానీ.. కోడలి ప్రవర్తనలో తేడా ఉండటం… కృష్ణ ముఖంపై గాయాలు ఉండటం చూసి అనుమానించింది కృష్ణ తల్లి. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. భార్య రాజేశ్వరే హత్య చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రాజేశ్వరితో పాటు.. ప్రియుడు శరత్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కృష్ణ ఇద్దరు పిల్లలను నాన్నమ్మకి అప్పగించారు.
