Andhra Pradesh Train Crime: రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్ చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన జోన్నలగడ్డ రాజారావుగా గుర్తించారు. రెండు నెలల క్రితం కేరళకు చెందిన మహిళపైనా అతడు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. సంత్రగచి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మహిళా బోగీలో ప్రయాణిస్తున్న మహిళపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. గుంటూరు జిల్లా నడికుడి పీఎస్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం నడికుడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించడంతో.. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
READ ALSO: Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ సంత్రగచి ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో హైదరాబాద్‌కి వస్తోంది. రాజమండ్రి స్టేషన్‌లో మధ్యాహ్నం ఒకటిన్నరకి ట్రైన్ ఎక్కినట్లు ఆ మహిళ చెప్తోంది. రైలు గుంటూరు స్టేషన్‌కు చేరుకున్నాక.. తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. రైలు కదులుతుండగా సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు బోగీ వద్దకు వచ్చాడు. మిగతా బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయని.. బోగీ తలుపు తీయాలని కోరడంతో మహిళ డోర్ తీసింది. రైలు కదిలిన 20 నిమిషాల వరకు బాగానే ఉన్న ఆ వ్యక్తి.. ఒక్కసారిగా మహిళ వద్దకు వెళ్లి కత్తి చూపించి బెదిరించాడు. దీంతో ఆ మహిళ.. తన వద్ద డబ్బులున్న బ్యాగు, మొబైల్ ఫోన్‌ను అతడికి ఇచ్చి.. భయంతో బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ పెట్టుకుంది…
బాత్‌రూమ్ డోర్ తీయకపోతే.. బ్యాగ్, మొబైల్ ట్రైన్ నుంచి విసిరేస్తానని చెప్పడంతో ఆ మహిళ గడియ తీసింది. దీంతో ఆమెను బాత్రూం నుంచి బయటకు లాగాడు అగంతకుడు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగులో ఉన్న 5,600, ఫోన్ తీసుకొని కిందకు దూకి పారిపోయాడని బాధితురాలు చెబుతోంది. బాధిత మహిళ హైదరాబాద్‌లోని చర్లపల్లిలో స్టేషన్‌లో దిగి.. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది… జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చర్లపల్లి పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో కేసును నడికుడికి బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడ్డ అగంతకుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు…
సీసీ ఫుటేజ్‌లో లభ్యం కాని మహిళ ఆనవాళ్లు
ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత మహిళ చెబుతున్న విషయాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు. రాజమండ్రిలో మధ్యాహ్నం 1.30 కి ట్రైన్ ఎక్కి నట్లు మహిళ చెప్తున్నా… సీసీ ఫుటేజ్‌లో ఎలాంటి ఆనవాళ్లు లేవు. మహిళ కట్టుకున్న చీర, చేతిలో ఉన్న బ్యాగ్ రంగు ఆధారంగా, టైం ఆధారంగా అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు రాజమండ్రి రైల్వే పోలీసులు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. అసలు ఆ మహిళ రాజమండ్రి స్టేషన్‌లో ట్రైన్ ఎక్కలేదని చెబుతున్నారు. మహిళ మాత్రం రాజమండ్రిలో ట్రైన్ ఎక్కాను అని చెప్తోంది. బాధిత మహిళను రేపు మరోసారి గుంటూరు మేజిస్ట్రేట్ ముందు ఇన్ కెమెరాలో హాజరుపర్చి.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు…
