Site icon NTV Telugu

Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

Warangal Police

Warangal Police

Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో చేసే ప్రమాదాలతో నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతోంది. కన్న వారికి పుట్టెడు గర్భశోకం మిగుల్చుతోంది. పుట్టిన రోజైనా.. చావు రోజైనా.. పెళ్లి జరిగినా.. ఇలా సందర్భం ఏదైనా సరే.. మద్యం ఏరులై పారుతోంది. ఆ తర్వాత జరిగే ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దీనికి పుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. యువతకు అంత్యక్రియల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

READ ALSO: VJA CHEPPULA DANDA: ఇదా..? క్షమశిక్షణా..?

మద్యం మత్తు.. ఆపై మితిమీరిన వేగం.. యువత నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఏ యాక్సిడెంట్ చూసినా.. మద్యం మత్తు లేదా నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తున్నాయి. కారణమేదైనా.. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్, ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి. అతివేగం వారి నిండు ప్రాణాలు తీసింది. బంధువుల అంత్యక్రియలు హాజరై.. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో యువకులు ప్రయాణిస్తున్న బైక్.. కమలాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనతో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన యువకులను నవీన్ కుమార్, నాగరాజు‌గా గుర్తించారు. ఎదిగి వచ్చిన కొడుకులు హఠాన్మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో అతివేగం నిర్లక్ష్యం యువకుల ప్రాణాలు తీసినట్లు తేలింది. వారికి వారే వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీ కొట్టుకోవడం వల్ల వారి ప్రాణాలు పోయినట్లు అర్థమవుతుంది. అంతేకాదు ఇద్దరూ మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. మద్యం మహమ్మారి వల్లే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలుసుకున్న పోలీసులు.. గ్రామంలోని మిగతా యువకులకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఇద్దరు యువకుల అంత్యక్రియలకు హాజరయ్యారు. వారు ప్రాణాలు కోల్పోయిన తీరును వివరించే ప్రయత్నం చేశారు.

ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి నేటి యువతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అంతేకాదు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించిన తీరుతో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలా శ్రమ పడుతున్నారు? పిల్లలు తల్లిదండ్రుల ఆశలని నిర్లక్ష్యంతో ఎలా వమ్ము చేస్తున్నారు? అనే విషయాన్ని వారి తల్లిదండ్రుల ద్వారానే అక్కడున్న యువతకు తెలిసేలా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది.

READ ALSO: Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?

Exit mobile version