Site icon NTV Telugu

Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!

Crime

Crime

తండ్రి.. సవతి తల్లి కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. ఆస్తి కూడా దక్కదని తెలిసి రాక్షసునిగా మారాడు. ఏకంగా తండ్రిని, సవతి తల్లి కుటుంబాన్ని మూకుమ్మడిగా హత్య చేయాలని డిసైడయ్యాడు. తన ప్లాన్ అమలు చేయడంతో ఇంటిల్లిపాది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఇంతకీ ఆ కొడుకు ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది?

తండ్రి తీసుకున్న కఠిన నిర్ణయం.. కొడుకు మనసులో పెరిగిన బాధ.. చివరకు ఒక కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేసిన విషాద ఘటనగా మారింది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్‌సింగ్ తండా గ్రామంలో ఈ దారుణం జరిగింది. డబ్బు ముందు మానవ సంబంధాల విలువను ఈ ఘటన మళ్లీ ప్రశ్నార్థకంగా మార్చింది.

ఇటీవలే గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది రమణి బాయి. ఐతే ఆ కుటుంబం.. బయటకు చూస్తే సంతోషంగా కనిపించినా.. లోపల మాత్రం విభేదాల మంటలు రగులుతున్నాయి. భర్త హన్మంతుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య 5 నెలల క్రితం మరణించింది. ఐతే ఆమెకు పుట్టిన కొడుకు అనార్‌సింగ్ హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నాడు.

తల్లి మరణం తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు బీమా రూ.5 లక్షలు, అలాగే కుటుంబ ఆస్తిలో తన వాటా కావాలని తండ్రి హన్మంతును అడిగాడు కొడుకు అనార్ సింగ్. అయితే హన్మంతు మాత్రం ఆ డబ్బులు, ఆస్తి ఇవ్వనని మొండిగా నిలబడ్డాడు. దీంతో తండ్రీ-కొడుకుల మధ్య విభేదాలు షురూ అయ్యాయి. ఇద్దరూ గ్రామంలో పంచాయితీ చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

సరిగ్గా ఇక్కడి నుంచే అనార్ సింగ్ ఆలోచనలు తప్పుదారి పట్టాయి. నాకేం దక్కదు అన్న నిస్సహాయ భావన ఆవరించింది. దీంతో ఆస్తి కోసం అత్యంత దారుణమైన ప్లాన్ వేశాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తన తండ్రి హన్మంతుతోపాటు.. పిన్ని సర్పంచ్ రమణి బాయి, వారి ఇద్దరు పిల్లలు వెంకటేష్, శివను చంపాలని స్కెచ్చేశాడు. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ తీసుకు వచ్చాడు. ముందుగా ఇంటికి తాళం వేశాడు. అనంతరం పైకప్పు రంధ్రం ద్వారా పెట్రోల్, డీజిల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. లోపల ఉన్న నలుగురు ప్రాణాల కోసం అరుస్తుండగా.. ఆ కేకలు గ్రామాన్ని కుదిపేశాయి…

పక్కనే ఉన్న గ్రామస్తులు పరుగెత్తుకొచ్చి తలుపులు బద్దలు కొట్టి బాధితులను బయటకు తీసి 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. ప్రస్తుతం వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ ఘటనలో అనార్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సర్పంచ్ కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న అనార్‌సింగ్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version