Site icon NTV Telugu

Vikarabad Land Scam: దర్జాగా.. కబ్జా! రూ.5 కోట్ల భూమిని కేవలం రూ.5 లక్షలకే కొట్టేశారు..

Vikarabad Land Scam

Vikarabad Land Scam

Vikarabad Land Scam: భూమి.. కనిపిస్తే చాలు గద్దల్లా తన్నుకుపోతున్నారు. అమాయకుల భూములైతే.. నయానో భయానో భయపెట్టి.. ఎంతో కొంత చేతిలో పెట్టి లాగేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో సరిగ్గా ఇలాగే జరిగింది. 5 కోట్ల రూపాయల భూమిని కేవలం 5 లక్షలకే కొట్టేశారు. కొడుకుకు తెలియకుండా తల్లి వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమి కోసం అడిగితే రౌడీయిజం చేస్తున్నారు. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

READ ALSO: Adulterated Ghee: కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్లకు చెందిన మహిళ కురువ పద్మమ్మ. ఈమె హైదరాబాద్ లింగంపల్లిలోని పోచమ్మ అనే మహిళ ఇంట్లో 2 నెలలుగా ఇంటి పని చేస్తోంది. నిజానికి పద్మమ్మకు పూడూరు మండలం పెద్ద ఉమ్మేంతాలలో 2 ఎకరాల భూమి ఉంది. కానీ నీళ్లు లేకపోవడంతో.. పంటలు పండే పరిస్థితి లేక హైదరాబాద్‌లో ఇంటి పని చేసుకుంటోంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. పద్మమ్మకు 2 ఎకరాల భూమి ఉన్న విషయం ఇంటి యజమాని పోచమ్మకు తెలిసింది. మెల్లగా పద్మమ్మకు మాయమాటలు చెప్పింది. భూమి విక్రయానికి ఒప్పించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. రూ. 5 లక్షలు చెల్లించింది. నిజానికి 2 ఎకరాల భూమి విలువ రూ. 5 కోట్లు ఉంటుంది. దీంతో అతి తక్కువ ధర చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంది…

రిజిస్ట్రేషన్ చేసుకున్న… సర్వే నెంబర్ 401లోని 2 ఎకరాల భూమి సర్వే చేస్తుండగా… ఆ నోటా ఈ నోటా పద్మమ్మ కొడుకు సురేష్‌కు తెలిసింది. దీంతో విషయాన్ని గ్రామస్తులకు చెప్పుకున్నాడు. ఫలితంగా గ్రామస్తులంతా భూమి వద్దకు వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశారు. ఐతే అప్పటికే పోచమ్మకు చెందిన దాదాపు 100 మంది గుండాలు తమను బెదిరించారని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు తమ తల్లిని మోసం చేసి.. ఖరీదైన భూమిని తక్కువ ధరకు లాగేసుకున్నారని.. కొడుకు సురేష్ చెబుతున్నాడు..

చివరికి భూమి పంచాయితీ కాస్తా.. పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు పోచమ్మ.. పంపించిన కిరాయి గుండాలను అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కిరాయి గుండాల వద్ద కత్తులు లాఠీలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. పోచమ్మ కొడుకు కలెక్టర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. భూమి విలువ తెలిసే.. మోసం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. పద్మమ్మ కుటుంబీకులు అంటున్నారు… మరోవైపు ఈ విషయాన్ని మాజీ సర్పంచ్ పెంటయ్య పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా అమాయకుల భూములను కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తహశీల్దార్లు కూడా కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలను తెలుసుకున్నాకే రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు…

READ ALSO: Ananthapur Crime: కటకటాల వెనక్కి.. తండ్రిని చంపిన కొడుకు

Exit mobile version