Kidnap Case : కన్న తండ్రి కసాయిగా మారాడు. సొంత బిడ్డని ఏకంగా బిచ్చగాళ్లకు అమ్మేశాడు. బిచ్చగాళ్ళ మాఫియా పాపను కొనుగోలు చేసి రాజమండ్రికి తరలించే ప్రయత్నం చేసింది. కానీ ఈలోగా తన పాప కిడ్నాప్ అయిందన్న తండ్రి డ్రామాతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది. వెంటనే పోలీసులు, రైల్వే పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. కేవలం 6 గంటల్లోనే పాప మిస్సింగ్ కేసును ఛేదించారు. ఇందుకోసం సీసీ పుటేజీలు అన్నీ పరిశీలించి.. మొత్తానికి పాపను పట్టుకున్నారు. చిన్నారిని తీసుకు వెళ్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు..
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు విషయం బయటపడింది. పాపను ఎత్తుకెళ్తున్న వారిని అరెస్ట్ చేయడంతో వాళ్లు నిజం చెప్పారు. చిన్నారి శ్రావణి తండ్రే 5 వేల రూపాయలకు విక్రయించాడని తెలిపారు. దీనిపై పాప తండ్రి మస్తాన్‌ను ప్రశ్నించారు పోలీసులు. అప్పుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. తన స్వస్థలం బాపట్ల జిల్లా వేటపాలెం అని చెప్పిన మస్తాన్.. మద్యం కోసం పాపను వాళ్లకు విక్రయించినట్లు వెల్లడించాడు…
భార్య గురించి అడిగిన పోలీసులకు ఆమెపైనా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. నిజానికి మస్తాన్ తన భార్యతో గొడవ పడి నాలుగు నెలల నుంచి వేరుగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారి శ్రావణిని బెజవాడకు తీసుకువచ్చాడు. అక్కడే కొద్ది కాలం నుంచి భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. ఈ క్రమంలో బొల్లా శ్రీనివాసరావు, చిన్నారి అనే బిచ్చగాళ్ల ముఠాతో పరిచయం ఏర్పడింది. దీంతో పాపను వారికి రూ. 5వేలకు విక్రయించాడు మస్తాన్ రావు. వారు రాజమండ్రికి బస్సులో వెళ్తుండగా గుర్తించిన పోలీసులు..బస్సు డ్రైవర్ సాయంతో వారిని పట్టుకున్నారు. దీంతో పాప కిడ్నాప్ కథ సుఖాంతమైంది…
