Plot to kill Wife: ఒక వ్యక్తి తన భార్యను ప్లాన్ ప్రకారం చంపేసి, ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఘటన అమెరికాలో జరిగింది. 71 ఏళ్ల అమెరికన్ వ్యక్తి ఈకేసులో నేరాన్ని అంగీకరించడంతో అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఐదేళ్ల ప్రొబేషన్ శిక్ష విధించబడింది. బాధితురాలి సవతి కుమార్తె ఇన్వాల్వ్ అయిన ఈ ఘటనలో అనేక సార్లు బాధితురాలు ఆస్పత్రిలో ప్రాణాపాయంతో చేరాల్సి వచ్చింది. చివరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఆల్‌ఫ్రెడ్ డబ్ల్యూ. రూఫ్, తన భార్యని కోకా కోలాలో డ్రగ్స్ కలిపి చంపేందుకు ప్లాన్ చేశాడు. సోమవారం ఆయన ఇండియానాలోని వేన్ కౌంటీ కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. 2021లో ఈ సంఘటన జరిగింది. రూఫ్ భార్య తలనొప్పి, విరేచనాల లక్షణాలతో అనేక సార్లు ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షల్లో ఆమె శరీరంలో ఎండీఎంఏ, కొకైన్, బెంజోడియాజిపైన్స్ ఉన్నట్లు తేలింది. అయితే, ఆమె ఈ డ్రగ్స్‌ని ఎప్పుడూ తీసుకోలేదని చెప్పింది. జనవరి 2022 వరకు దీని గురించి ఆమె తెలియదు. ఆమె భర్త కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడని ఒప్పుకోవడంతో అసలు నిజం బయపడింది.
Read Also: Israel-Hamas war: ఇజ్రాయెల్ దాడిలో మరో హమాస్ కమాండర్ హతం
రూప్ తన భార్యకు అంతకుముందు వివాహంతో కలిగిన కుమార్తెని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. దీని కోసం డ్రగ్స్ కలిపిన పానీయాన్ని అతని సవతి కూతురు తన తల్లికి ఇచ్చేలా చేశారు. ఇది తన భార్య సుమారు 13 గంటలు నిద్రపోయేలా చేస్తుందని రూఫ్ పేర్కొన్నాడు. అయితే, అతని ఉద్దేశం మాత్రం భార్యను చంపేసి, సవతి కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆమె వస్తువుల్ని దొంగలించడం అని తెలిసింది.
సెప్టెంబరు మరియు డిసెంబర్ 2021 మధ్య కాలంలో రూఫ్ తన భార్య పానీయంలో దాదాపు 12 సార్లు విషం కలిపినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ నెలల్లో, అతని భార్య అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూతురు మరియు ఆమె స్నేహితురాలు రూఫ్ ఇంటికి వచ్చేవారని ఆరోపించారు. దోషిగా తేలిని రూఫ్ అతని సవతి కుమార్తెతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆమె స్నేహితురాలు ఇంటి నుంచి వస్తువుల్ని దొంగలించింది.
2022 జనవరి ప్రారంభంలో తన భార్యకు తాను విషం కలిపినట్లు రూఫ్ ఒప్పుకోవడంతో అతడి ప్లాన్ బట్టబయలైంది. చివరకు అతని భార్య అనారోగ్యం పాలవ్వడం, ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చి పోలీసులను సంప్రదించింది. దీంతో రూఫ్ ప్లాన్ బట్టబయలైంది. పోలీసులు అరెస్ట్ చేశారు. రూఫ్‌కు శిక్ష ఖరారు కాగా, విచారణ కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న కుమార్తె మరియు మరొక వ్యక్తి ప్రమేయంపై స్థానిక పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, అయితే తదుపరి అరెస్టులు చేయలేదు.
