Gold Smuggling: స్మగ్లింగ్‌లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..

Smuggling

Smuggling

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (IGI) విమానాశ్రయంలో ఒక పెద్ద బంగారు స్మగ్లింగ్ కలకలం రేపింది. అమెరికా నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ పౌరుడు రూ. 5.5 కోట్ల విలువైన 115 బంగారు బిస్కెట్లను తన ప్యాంటులో దాచుకుని నడుస్తూ పట్టుబడ్డాడు.

ఆ వ్యక్తి శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. కొంతమంది అంతర్జాతీయ స్మగ్లర్లు భారీగా బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నారని కస్టమ్స్ అధికారులకు ముందే సమాచారం అందింది. ఈ సమాచారంతో అధికారులు విమానాశ్రయంలో నిఘాను తీవ్రం చేశారు.

సదరు ప్రయాణికుడు విమానం దిగగానే, కస్టమ్స్ నిఘా విభాగం అధికారులు అతని కదలికలను నిశితంగా గమనించారు. ఆ వ్యక్తి ఎటువంటి తనిఖీలు లేకుండా విమానాశ్రయం నుంచి బయటపడటానికి ప్రయత్నించాడు. కానీ, అతని ప్రవర్తన, నడకపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని అడ్డుకుని ప్రశ్నించారు.

సాక్షుల సమక్షంలో అతడు ధరించిన ప్యాంటును..  అతని సామాగ్రిని పూర్తిగా తనిఖీ చేయగా.. దాదాపు 3.5 కిలోల బరువున్న 115 బంగారు బిస్కెట్లు దొరికాయి. 24 క్యారెట్ల ఈ బంగారాన్ని అతను ప్రత్యేకంగా తయారు చేయించుకున్న బెల్ట్, ప్యాంటు లోపలి జేబుల్లో ఎవరికీ అనుమానం రాకుండా దాచాడు.

అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. దీని వెనుక ఏదైనా అంతర్జాతీయ ముఠా ఉందా అనే కోణంలో అతని ఫోన్, ప్రయాణ వివరాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. అతను కేవలం ఒక బంగారాన్ని చేరవేసే వ్యక్తి(క్యారియర్) మాత్రమేనని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బంగారంపై దిగుమతి సుంకం పెరగడం వల్లే ఇలాంటి స్మగ్లింగ్ కేసులు ఎక్కువవుతున్నాయని, అందుకే విమానాశ్రయాల్లో సరికొత్త సాంకేతికతతో తనిఖీలను మరింత కఠినతరం చేశామని అధికారులు తెలిపారు.