Site icon NTV Telugu

UP techie Suicide: ‘‘అమ్మా నాన్న క్షమించండి’’.. భార్య వేధింపులకు మరో వ్యక్తి ఆత్మహత్య..

Up Techie Suicide

Up Techie Suicide

UP techie Suicide: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్య, అత్తమామల వేధింపులతో తాను ఎంతటి బాధను అనుభవించాననే విషయాన్ని వీడియోలో వెళ్లడించి, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, భార్యల వేధింపుల వల్ల మరణించారు. చట్టాలను దుర్వినియోగం చేసి, అక్రమ కేసులు పెట్టడం, మానసికంగా వేధించడంతో పలువురు తనువు చాలిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాజాగా మరో వ్యక్తి భార్య వేధింపులకు బలయ్యాడు. నోయిడాలో ఫీల్డ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న మోహిత్ కుమార్ అనే వ్యక్తి తన ఆస్తినంతా తన భార్య, అత్తమామల పేర్లకు బదిలీ చేయమని తనపై ఒత్తిడి తెస్తున్నారని, తప్పుడు వరకట్న ఆరోపణలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆత్మహత్యకు ముందు మోహిత్ ఓ వీడియోలో తాను ఎదుర్కొంటున్న వేధింపులను గురించి చెప్పారు. వీడియోలో ‘‘ఈ వీడియో మీకు అందే సమయానికి నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. పురుషుల కోసం ఒక చట్టం ఉంటే, బహుశా నేను ఈ చర్యకు పాల్పడకపోయే వాడిని. నా భార్య, ఆమె కుటుంబం మానసిక హింసను నేను భరించలేను. అమ్మా, నాన్న, దయచేసి నన్ను క్షమించండి.’’ అని చెప్పాడు.

Read Also: KTR: రాజేంద్రనగర్ ఉప ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి గెలిస్తారు.. ప్రచారానికి సిద్ధం అవ్వండి!

ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయ్యా జిల్లాకు చెందిన మోహిత్, ప్రియ యాదవ్‌తో చాలా కాలంగా సంబంధంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రియ బీహార్ సమస్తిపూర్‌లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందే వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి మోహిత్‌తో ఆమె భిన్నంగా ప్రవర్తించడం ప్రారంభించింది. దీనికి తోడు ప్రియ సోదరుడు, తల్లి మోహిత్‌ని మానసికంగా వేధించడం ప్రారంభించారు.

వీడియోలో ‘‘ నా భార్య ప్రియ యాదవ్ తల్లి బలవంతంగా గర్భస్రావం చేయించింది. నగలు, చీరలన్నీంటిని తన వద్దే ఉంచుకుంది. ఇల్లు, ఆస్తి ఆమె పేరుపై బదిలీ చేయాలని, లేదంటే నాపై, నా కుటుంబంపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెడతానని నా భార్య నన్ను బెదిరిస్తుంది. నా మరణం తర్వాత కూడా నాకు న్యాయం జరగకుంటే నా ఆస్థికల్ని కాలువలో పడేయండి. అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను మీ అంచనాలను అందుకోలేకపోయాను’’ అని తన చివరి సందేశాన్ని రికార్డ్ చేశారు.

నోయిడాలోని జాలి హోటల్‌లో మోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోహిత్ సోదరుడు తరుణ్ ప్రతాప్ మాట్లాడుతూ.. నా సోదరుడు మోహిత్ నోయిడాలోని ఒక సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రియ అతడిని హింసించడంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

Exit mobile version