మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో భవనం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద కర ఘటనలో ఇద్దరు సజీవ సమాధి అయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఇండోర్ లో భవనం కుప్పకూలి ప్రమాదం జరిగింది. పట్టణ పరిధిలోని రాణిపుర ప్రాంతంలో ఉన్నట్టుండి మూడు అంతస్తుల భారీ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన 14 మంది శిథిలాల కింది చిక్కుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు స్పాట్‌లనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ శివం వర్మ , పోలీసులు, రెస్క్యూ టీమ్ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహారాజా యశ్వంత్ రావ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని అలీఫా, ఫహీమ్‌గా గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. కేవలం 5 గంటల టైంలోనే సహాయక చర్యలు పూర్తిచేసిన రెస్క్యూ టీంని కలెక్టర్ అభినందించారు. అయితే కూలిన భవనాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. భవనం వెనుక భాగం పురాతన కట్టడం కావడంతో భవనం కూలినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కూలిన భవనంలోని ఒక భాగం పక్కనే ఉన్న నిర్మాణంపై పడిందని మేయర్ పుష్యమిత్ర భార్గవ తెలిపారు.
