Site icon NTV Telugu

Gannavaram Airport Accident: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి

Gannavaram Airport Accident

Gannavaram Airport Accident

Gannavaram Airport Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్‌ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. లగేజీని ట్రాలీలో లోడ్ చేసేందుకు ట్రాక్టర్ ఇంజిన్ సహాయంతో ట్రాలీని నడుపుతున్న ఆదిత్య, ఒక్కసారిగా బ్యాలెన్స్‌ కోల్పోయి తాను నడుపుతున్న ట్రాక్టర్‌ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ అతని శరీరం మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Joe Root Record: రికీ పాంటింగ్‌ రికార్డు సమం.. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌కు చేరువగా జో రూట్!

ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది స్పందించి అతన్ని చికిత్స నిమిత్తం చిన్న అవుట్‌పల్లి సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే, గాయాల తీవ్రత కారణంగా పరిస్థితి విషమించి, ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు. కుటుంబం కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోందని, కొద్ది కాలంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానిక వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Exit mobile version