Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!

Tiger Shroff Shooting

Tiger Shroff Shooting

Tiger Shroff Shooting: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ కారుపై ముంబైలోని జుహూ ప్రాంతంలో కాల్పులు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడగా, ఆయన డ్రైవర్‌తో పాటు మరో ఆటోరిక్షా డ్రైవర్‌ గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది.. అయితే, దీపావళి పండుగ సమీపిస్తుండటంతో తొలుత కాల్పుల శబ్దాలను స్థానికులు టపాసుల శబ్దాలుగా భావించారు. ఆ తర్వాతే అవి తుపాకీ కాల్పులని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్షి, వ్లాగర్ సల్మా షేక్‌ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ.. ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరపడంతో అందరూ దీపావళి టపాసులు పేలుస్తున్నారని అనుకున్నారని చెప్పారు. అయితే, టైగర్ ష్రాఫ్‌ కారు ఆగిన తర్వాత జరిగిన పరిణామాలతో అక్కడి వారు తీవ్ర భయానికి గురయ్యారని వివరించారు.

మరో ప్రత్యక్ష సాక్షి షారుఖ్ షేక్‌ మాట్లాడుతూ.. తాము ఫొటోలు దిగేందుకు అక్కడ ఆగామని, ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారని తెలిపారు. అక్కడ ఫుట్‌బాల్ ఆడుతున్నారని, అపరశక్తి ఖురానా, అభిషేక్ బజాజ్, అభిమన్యు వంటి ప్రముఖులు కూడా అప్పటికే అక్కడ ఉన్నారని చెప్పారు. అంతకుముందు అక్కడి వాతావరణం సాధారణంగానే ఉందని వివరించారు. వాహనం గేటు దాటి కొద్దిదూరం వెళ్లగానే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని షారుఖ్ షేక్‌ వెల్లడించారు. అంతా సవ్యంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా నాలుగు రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించిందని, ఏం జరుగుతుందో అర్థం కాక భయపడిపోయామని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి ముఖాన్ని కూడా సరిగ్గా గుర్తించలేకపోయానని తెలిపారు.

ఇక, జుహూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుష్పా పార్క్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. కాల్పులు ఎలా జరిగాయి? దాడి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఆ పోస్ట్ నిజమైనదా కాదా అన్నది పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దాడికి గల కారణాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆదివారం టైగర్ ష్రాఫ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోవైపు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ముంబైలో గ్యాంగ్‌వార్‌లను ప్రభుత్వం సహించబోదని హెచ్చరిస్తూ, కాల్పులకు కాల్పులతోనే సమాధానం చెబుతామంటూ వ్యాఖ్యానించారు. కాగా, బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన టైగర్ ష్రాఫ్‌ 2014లో ‘హీరోపంతి’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘బాఘీ’, ‘బాఘీ 2’, ‘వార్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌ కుమారుడైన టైగర్‌పై కాల్పుల ఘటన బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.