Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!

Teacher Murder (2)

Teacher Murder (2)

Teacher Murder: స్కూల్ అంటే పిల్లలకు జ్ఞానం పంచే పవిత్ర స్థలం. అక్కడ భయం కాదు, భద్రత ఉండాలి. కానీ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఆ నమ్మకాన్నే కుదిపేసింది. ప్రతి రోజులాగే ప్రారంభమైన ఓ స్కూల్ ఉదయం క్షణాల్లోనే రక్తపు మరకలతో నిండిపోయింది. మాస్క్ ధరించి స్కూల్‌లోకి వచ్చిన ఓ యువకుడు, ఓ టీచర్‌ను  పిలిపించుకుని కేవలం అర నిమిషంలోనే పదుల సంఖ్యలో కత్తిపోట్లు పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం మరింత కలకలం రేపుతోంది.

ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 29 ఏళ్ల సంధ్య అనే ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ఓ యువకుడు స్కూల్ గేటు వద్దకు వచ్చి సంధ్యతో మాట్లాడాలని నిర్వాహకులకు చెప్పాడు. అతని గురించి ఎలాంటి అనుమానం రాకపోవడంతో సంధ్య బయటకు వెళ్లింది. అదే ఆమె జీవితంలో చివరి క్షణమైంది. బయటకు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి ఆమె మెడ పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ముఖం, మెడ, ఛాతీపై 30కి పైగా కత్తిపోట్లు పొడిచినట్లు పోలీసులు తెలిపారు.

సీసీటీవీ దృశ్యాల ప్రకారం దుండగుడు ముందుగా స్కూల్‌లోకి ప్రవేశించి లాబీలో వేచి ఉన్నాడు. సంధ్య కనిపించగానే బయటకు రావాలని సైగ చేశాడు. ఆమె బయటకు అడుగుపెట్టగానే మెడ పట్టుకుని నేలకూల్చి వరుసగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె కిందపడిపోయినా అతడు ఆగలేదు. మళ్లీ మళ్లీ కత్తిపోట్లు పొడుస్తూనే ఉన్నాడు.

అరుపులు విన్న స్కూల్ నిర్వాహకుడు బయటకు పరుగెత్తి వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు అతడిపైనా కత్తితో బెదిరింపులకు దిగాడు. దీంతో క్షణకాలం వెనక్కి తగ్గిన నిర్వాహకుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో నిందితుడు మళ్లీ సంధ్య వద్దకు వెళ్లి పొట్ట, ముఖంపై మరో ఇరవైకి పైగా కత్తిపోట్లు పొడిచిన తర్వాత నంబర్ ప్లేట్ లేని బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తీవ్రంగా గాయపడిన సంధ్యను అల్ ఫలాహ్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగిన రెండు గంటల్లోనే కోట్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అమిత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం అమిత్‌కు సంధ్య పరిచయమైంది. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడేందుకు పలుమార్లు ప్రయత్నించినా సంధ్య అతడిని పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆమెను పదేపదే వెంబడిస్తూ వేధించినట్లు పోలీసులు గుర్తించారు.

అతడి వేధింపులు ఎక్కువ కావడంతో సంధ్య అతడిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు దర్యాప్తులో తెలిసింది. కొద్ది రోజుల క్రితమే అమిత్‌పై సంధ్య లైంగిక వేధింపుల కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అమిత్ అందరి ముందూ క్షమాపణ చెప్పడంతో విషయం అక్కడితో ముగిసిందని భావించారు. అయితే అదే ఘటనను మనసులో పెట్టుకున్న అమిత్ ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన మహిళల భద్రత, వెంటాడే వ్యక్తులపై ముందస్తు చర్యల అవసరం, విద్యాసంస్థల్లో భద్రతా వ్యవస్థల బలోపేతంపై మరోసారి తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.