ఎన్ని చట్టాలు చేసిన, ఎంత కఠినంగా శిక్షించిన కామాంధులు మాత్రం మారడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. విద్యాబుద్దులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే తమ ఆ స్థానానికి తీరని మచ్చను తీసుకువస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు విద్యార్థినీల పట్ల కామాంధులైన ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చిన ఉదాంతాలు ఉన్నాయి. అయితే తాజాగా విజయనగరం ఏజేన్సీలో దారుణం చోటు చేసుకుంది. విజయనగరంలో జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు స్కూల్‌లో విద్యార్థినీలతో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
అయితే విద్యార్థినీలపై ఉపాధ్యాయులు లైంగిక వేధింపుల వీడియోను విద్యార్థినీలు బయటపెట్టారు. దీంతో ఉన్నతాధికారులకు విద్యార్థినీల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఉపాధ్యాయులపై అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయులిద్దరినీ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆరా తీశారు. విద్యార్థినుల తల్లిదండ్రులతో పుష్పశ్రీవాణి మాట్లాడి పరామర్శించారు.
