Srushti Fertility Scam: అక్రమ సృష్టి తో అమాయక దంపతులు, చిన్నారుల జీవితాలతో చెలగాటమాడిన డాక్టర్ నమ్రత పాపాల పుట్ట కదిలింది. తొలుత తనకే పాపం తెలియదని మహానటి సావిత్రి రేంజ్ లో నటించినా.. పోలీసులు అన్ని ఆధారాలు ముందుంచే సరికి కళ్లు తేలేసింది. తాను చేసిన అక్రమాలన్నీ తానే ఒప్పుకుంది. ఎందుకు చేయాల్సి వచ్చింది.. ? ఎప్పటి నుంచి చేస్తోంది..? ఎవరెవరిని భాగస్వామ్యులను చేసింది..? ఎన్ని కోట్లు వెనకేసుకుంది..? ఇలా ప్రతీ అంశాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించింది నమ్రత!! పోలీసు విచారణలో నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
READ MORE: Top Headlinews @9PM : టాప్ న్యూస్
సరోగసి, IVF ట్రీట్‌మెంట్ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్
డాక్టర్ నమ్రత !! అక్రమ సృష్టి కర్త !! సరోగసి, ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ దందా నడిపి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమ్మతనాన్ని అంగట్లో సరుకులా మార్చి.. అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతూ.. కోట్లు వెనకేసుకుంది. పాపం పండి.. కటకటాలపాలైంది. పోలీసుల విచారణలో తాను చేసిన పాపాలు.. పాల్పడిన అక్రమాలన్నీ ఒప్పుకుంది నమ్రత. 1995లో వైజాగ్ లో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించిన నమ్రత. 1998లో విజయవాడ కేంద్రంగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2007లో సికింద్రాబాద్ కేంద్రంగా మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్ కోసం తన వద్దకు వచ్చిన దంపతులను సరోగసి వైపు మళ్లించింది. దంపతుల నుంచి శాంపిల్స్ సేకరించి.. సరోగసి పద్ధతిలో పిల్లలు పుట్టేలా చేస్తానని నమ్మించి.. ఎక్కడో, ఎవరికో పుట్టిన పిల్లలను తీసుకొచ్చి.. ఈ దంపతుల చేతిలో పెడుతున్నట్లు ఒప్పుకుంది నమ్రత. ఇలా ఒక్కో జంట నుంచి 20, 30 లక్షల వరకు తీసుకుంటున్నట్లు చెప్పింది.
పుట్టిన బిడ్డను ఇస్తే లక్షల రూపాయలు ఇస్తానని ఆశ కల్పించిన నమ్రత
అబార్షన్ కోసం క్లినిక్‌లకు వెళ్తున్న మహిళలకు డబ్బులు ఆశ చూపి.. అబార్షన్ చేయించుకోకుండా ఉండి, పుట్టిన బిడ్డను తనకు ఇస్తే చాలు.. లక్షల రూపాయలు ఇస్తానని ఆశ పెట్టింది. ఈ మహిళలకు పుట్టిన బిడ్డలను.. తన వద్దకు సరోగసి కోసం వచ్చే దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డ అని నమ్మించి ఇస్తున్నట్లు ఒప్పుకుంది నమ్రత. 2020లో మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో తనపై కేసు నమోదు అయిందని.. రిమాండ్‌కు కూడా వెళ్లి వచ్చినట్లు చెప్పింది నమ్రత. వైజాగ్ టూటౌన్, గుంటూరు పరిధిలోని కొత్తపేటతోపాటు గోపాలపురం పీఎస్ లో కూడా గతంలో కేసులు నమోదు అయినట్లు చెప్పింది నమ్రత. అయినా సరే.. తన అక్రమ దందా మాత్రం కొనసాగించినట్లు చెప్పింది నమ్రత… స్పాట్..
సికింద్రాబాద్‌లోని సృష్టి సెంటర్‌లో సూపర్‌వైజర్ కం ఫార్మాసిస్ట్‌గా కృష్ణ, రిసెప్షనిస్ట్‌గా పద్మ, టెలీకాలర్స్‌గా అర్చన, మేరీ సోన వ్యవహరిస్తున్నట్లు చెప్పింది నమ్రత. నర్స్‌గా సురేఖ, ల్యాబ్ టెక్నీషియన్‌గా ప్రభాకర్ పనిచేస్తున్నట్లు చెప్పింది. విజయవాడ బ్రాంచ్‌లో డాక్టర్లు మధులత, కిషోర్ బాబు, కరుణ… వైజాగ్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా కళ్యాణి, ల్యాబ్ టెక్నీషియన్‌గా రమ్య పనిచేస్తున్నట్లు చెప్పింది. గాంధీ హాస్పిటల్ డాక్టర్ సదానందం. తన టీమ్‌లో కీలక వ్యక్తి అని చెప్పింది. సరోగసి కేసు షీట్లు అన్నింటినీ ఎవరూ ముట్టుకోకుండా.. ఎవరూ చూడకుండా.. తన కన్సల్టెన్సీ రూమ్‌లోని ఓ బాక్స్‌లో భద్రంగా ఉంచినట్లు తెలిపింది. సరోగసి పేరు చెప్పుకుని సంపాదించిన డబ్బు మొత్తాన్ని తనకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లలో దాచుకున్నట్లు చెప్పింది నమ్రత.
భర్త వెంకట కృష్ణ ప్రసాద్, కొడుకు జయంత్ కృష్ణ సహకారం
తాను చేసే అక్రమాలన్నింటికీ.. తన భర్త వెంకట కృష్ణ ప్రసాద్, కొడుకు జయంత్ కృష్ణ సహకరిస్తున్నట్లు తెలిపింది. ఎవరైనా దంపతులకు విషయం తెలిసి నిలదీస్తే.. వారి సంగతి కొడుకు జయంత్ కృష్ణ చూసుకుంటాడని చెప్పింది నమ్రత. 2024లో సోనియా, గోవింద్ సింగ్ దంపతులు చేసిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గోపాలపురం పీఎస్‌లో నమోదైన కేసుతో తీగ లాగితే డొంక కదిలింది. నమ్రత అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అరెస్ట్ తర్వాత కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే.. తనకే పాపం తెలియది బుకాయించిన నమ్రత..తర్వాత అన్ని విషయాలూ ఒప్పుకుంది.
READ MORE: SI Rajasekhar case: బుద్ధి గడ్డితింది.. ఉద్యోగం ఊడిపోయింది..
