Site icon NTV Telugu

Srikakulam: చిల్లంగి అనుమానంతో.. దారుణంగా కొట్టి చంపేశారు…

Crime

Crime

తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. సాంకేతికంగా ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా.. వాళ్లను మాత్రం మూఢ నమ్మకాల జాఢ్యం వదలడం లేదు. ఇంకా చేతబడులు, చిల్లంగి, బాణామతి చేస్తున్నారంటూ గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. మానసికంగా భయాందోళన చెందుతూ ఎదుటి వారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. తమపై బాణామతి చేస్తున్నారనో.. లేదా తాము బాణామతి బారిన పడ్డామనో.. ఇంకా కొంత మంది జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. చేతబడి గురించి భయపడుతూ మానసిక వేదనతో చనిపోతున్న వాళ్లు కొంత మంది అయితే.. అదే మానసిక వేదనతో.. ఎవరో చేతబడి చేశారని చంపేసే వారు మరికొందరు. సరిగ్గా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురంలోనూ ఇలాగే జరిగింది. స్థానికంగా ఉంగ రాములు అనే వృద్దుడు నివసిస్తున్నాడు. ఊరిలో అతడు చిల్లంగి చేస్తాడనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అతనిపై కొంత మంది కక్ష కట్టారు. అదే నెపంతో అర్థరాత్రి సమయంలో రాములును కొంత మంది ప్రత్యర్ధులు రాళ్లతో కొట్టి చంపేశారు..

READ MORE: Dulquer Salman : మా ఇండస్ట్రీలో రూ. 30 కోట్ల బడ్జెట్ అంటే చాలా ఎక్కువ..

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఇంటి ముందే రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామానికి చెందిన తులసీరావు అనే వ్యక్తి గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో బోరుభద్రకు చెందిన భూత వైద్యుడిని సంప్రదించారు. ఈ క్రమంలో తులసీరావు ఇంట్లో పూజలు చేసి భూత వైద్యుడు వెళ్లి పోయాడు.. రాత్రి సమయంలో.. భూత వైద్యుడు వెళ్లిపోయిన తర్వాత.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉంగరాములు ఇంటి వద్దకు వచ్చిన తులసీరావు కుటుంబ సభ్యులు, బంధువులు.. అతన్ని బయటకు ఈడ్చుకొచ్చారు. రాళ్లు, కర్రలతో కొట్టి చంపారని రాములు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు కాశీబుగ్గ పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు.. పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెబుతున్నారు కాశీబుగ్గ పోలీసులు. భూతవైద్యుడు ఏమైనా చెప్పి ఉంటాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: నేడే Samsung Galaxy Unpacked event 2025.. ఏ ప్రాడెక్ట్స్ లాంచ్ కాబోతున్నాయంటే?

Exit mobile version